చేతులెత్తేసిన సీసీఐ | cotton in the district to buy the Cotton Corporation of India | Sakshi
Sakshi News home page

చేతులెత్తేసిన సీసీఐ

Oct 25 2013 3:25 AM | Updated on Sep 1 2017 11:56 PM

వరుస వర్షాలతో పత్తిరైతు పరేషాన్ అవుతున్నాడు. జిల్లాలో పండిన పత్తిని కొనేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ముందుకు రాకపోవడంతో దళారులు రాజ్యం ఏలుతున్నారు.

భువనగిరి, న్యూస్‌లైన్ : వరుస వర్షాలతో పత్తిరైతు పరేషాన్ అవుతున్నాడు. జిల్లాలో పండిన పత్తిని కొనేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ముందుకు రాకపోవడంతో దళారులు రాజ్యం ఏలుతున్నారు. ఇటీవల కాలంలో వరుసగా వర్షాలు కురుస్తుండడంతో పత్తి రంగు మారింది. దీనిని ఆసరాగా తీసుకున్న సీసీఐ.. కొనుగోళ్లను నిలిపివేసింది. దీంతో పండిన పత్తిని ఎక్కడ అమ్ముకోవాలో తెలియక రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారు తేమ ఎక్కువగా ఉందని క్వింటాల్ పత్తిని రూ.3500 కు మించి కొనడం లేదు. మద్దతు ధర వచ్చే వరకు నిల్వ చేసుకుందామన్న రైతులకు గోదాంలు అందుబాటులో లేవు. వచ్చినకాడికి వచ్చిందిలే అనుకుంటూ దళారులు ఇచ్చిన ధరకే అమ్ముకుంటున్నారు. దీనికి తోడు స్పిన్నింగ్ మిల్లుల వద్ద కూడా పత్తి కొనుగోలు చేయకపోవడంతో వ్యాపారులు కూడా పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తున్నారు.
 
 నవంబర్ వరకు రాలేమన్న సీసీఐ
 సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు కావాల్సిన పత్తి కొనుగోలు కేంద్రాలు నవంబర్ రెండో వారంలో ఏర్పాటు చేస్తామని తేల్చిచెప్పారు. ఇటీవల భువనగిరికి వచ్చిన సీసీఐ అధికారులు ఏరియల్ సర్వే నిర్వహించి నవంబర్ నుంచి పత్తిని కొనుగోలు చేస్తామని జిల్లా అధికారులకు చెప్పారు. దీంతో ప్రభుత్వరంగ సంస్థల కొనగోలు మరో 15 రోజుల పాటు లేనట్లేనని తెలుస్తోంది. ఉన్నతాధికారులు. మంత్రులు కార్యరంగంలోకి దిగితే తప్పా పత్తిరైతుల కష్టాలు తీరే పరిస్థితి కనిపించడం లేదు.
 
 తేమ పేరుతో రేటులో కోత
 వర్షాలు పడుతుండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. పంట కోసే సమయంలో కురుస్తున్న వర్షాలతో పత్తిలో తేమ 20శాతానికి మించి ఉంటుందని రేటు తగ్గించేశారు. సీజన్ ప్రారంభంలో రూ.4200 చెల్లించి కొనుగోలు చేసిన పత్తిని ప్రస్తుతం రూ.3500కు తగ్గించారు. మరోవైపు వర్షాలు కురుస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు.
 
 వ్యాపారులది మరో రకం ఇబ్బంది
 రైతుల వద్ద పత్తిని కొనుగోలు చేస్తున్న వ్యా పారులు ఆ పత్తిని అమ్ముకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. వరంగల్ జిల్లా జనగామలో నాలుగు పత్తి మిల్లులు, భువనగిరిలోని పత్తి మిల్లు సక్రమంగా పత్తిని కొనుగోలు చేయడం లేదు. కరీంనగర్ జిల్లా జ మ్మికుంటలో కొనుగోళ్లు ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో రైతుల వద్ద కొనుగోలు చేసిన పత్తిని నిల్వ చేసుకునే గోదాం సౌకర్యం లేక  రైతుల వద్ద కొనుగోళ్లు నిలిపివేశారు. మిల్లులో కొనుగోలు చేస్తే తప్పా తాము కొనుగోలు చేయలేమంటున్నారు.
 
 నష్టం తప్పేలా లేదు
 - సిద్ధిరాములు, ఆలేరు
 నాలుగెకరాల్లో పత్తి సాగు చేశాను. పెట్టుబడులు, కూళ్లు విపరీతంగా పెరిగాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలతో పత్తిలో తడి ఎక్కువగా ఉంటుంది. గ్రామాల్లో పత్తిని కొనుగోలు చేయమంటే తేమ ఎక్కువగా ఉంది తక్కువ ధరకు ఇవ్వమంటున్నారు. ఏం చేయాలో తోచడం లేదు. ఈ సారి నష్టం తప్పేట్లు లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement