గుంటూరులో కరోనా వైద్య పరీక్షలు ప్రారంభం

Coronavirus Tests Start in Guntur Medical College - Sakshi

తొలిరోజు 60 పరీక్షల నిర్వహణ

సాక్షి,గుంటూరు/గుంటూరు మెడికల్‌: గుంటూరు వైద్య కళాశాలలో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇటీవల వైరస్‌ నిర్ధారణ చేసే రియల్‌టైమ్‌ పాలిమర్‌ చైన్‌ రియాక్షన్‌ (ఆర్టీపీసీఆర్‌) పరికరం వైద్య కళాశాలలోని వైరాలజీ ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రయోగాత్మకంగా చేసిన పరీక్షలు సఫలీకృతం కావడంతో శుక్రవారం నుంచి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు గుంటూరులోనే ప్రారంభించారు. రూ. 16 లక్షలు ఖరీదైన ఆర్టీపీసీఆర్‌ వైద్య పరికరాన్ని కేంద్ర ప్రభుత్వం ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ద్వారా కొనుగోలు చేసి గత నెల 24న కళాశాల ల్యాబ్‌కు పంపించింది.

మరో ఆర్టీపీసీఆర్‌ పరికరాన్ని ప్రభుత్వం
కొనుగోలు చేసింది. గుంటూరు వైద్య కళాశాలలో శుక్రవారం కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు ప్రారంభం కాగా, తొలి రోజు 60 శాంపిళ్ళకు పరీక్షలు నిర్వహించినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ యాస్మిన్‌ చెప్పారు. నివేదికలను వైద్యులు, జిల్లా కలెక్టర్‌కు పంపారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని కరోనా అనుమానిత వ్యక్తుల నుంచి నమూనాలు సేకరించి, ఇకపై గుంటూరు వైద్య కళాశాలలోనే పరీక్షలు నిర్వహించనున్నారు. గతంలో వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి నమూనాలను విజయవాడలోని సిద్దార్ధ మెడికల్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ల్యాబ్‌కు పంపేవారు. గుంటూరులోని ల్యాబ్‌ ఏర్పాటు కావడంతో ఇకపై సమయం ఆదా కానుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top