కరోనా: బెజవాడంతా రెడ్‌జోన్‌

Coronavirus: Red Zone Continuing In Vijayawada - Sakshi

రెడ్‌జోన్‌ పరిధిలోకి 15 మండలాలు, 10 నగర/పురపాలక సంఘాలు 

రెడ్‌జోన్‌లలో లాక్‌డౌన్‌ యథాతదంగా అమలు

గ్రీన్‌జోన్‌ మండలాల్లో కొన్ని రంగాలకు సడలింపులు 

తాజాగా మరో ఐదుగురికి కరోనా పాజిటివ్‌

జిల్లాలో మొత్తం 80కి చేరిన కేసులు  

సాక్షి, అమరావతి: కరోనా రక్కసి పంజాకు కృష్ణా జిల్లా విలవిలలాడుతోంది. రోజురోజుకీ పాజిటివ్‌ కేసులు పెరుగుతూ ఉండటంతో కరోనా వ్యాప్తి నియంత్రణకు అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంది. కరోనా వైరస్‌ మహమ్మారి కట్టడికి జిల్లాలో 25 మండలాలను రెడ్‌జోన్‌లుగా అధికారులు ప్రకటించారు. నేటి నుంచి ఆయా మండలాల్లో పటిష్టంగా లాక్‌డౌన్‌ నిబంధనల్ని అమలు చేయనున్నారు. అలాగే గ్రీన్‌జోన్‌ పరిధిలోకి వచ్చే 37 మండలాల్లో లాక్‌డౌన్‌ సడలింపులు వర్తిస్తాయని జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో పాజిటివ్‌ కేసులు గుర్తించిన ప్రాంతం నుంచి 3 కిలోమీటర్ల పరిధితోపాటు అలాగే దానికి బఫర్‌జోన్‌ను కూడా కలుపుకొని మొత్తం 5 కిలోమీటర్ల పరిధిని రెడ్‌జోన్‌గా గుర్తించనున్నారు. గ్రామీణ ప్రాంతంలో 7 కిలోమీటర్ల పరిధిని రెడ్‌జోన్‌గా పరిగణిస్తారు. రెడ్‌జోన్లుగా గుర్తించిన మండలాలు, మున్సిపాలిటీలు మినహాయిస్తే మిగిలిన 37 మండలాలను గ్రీన్‌జోన్‌ పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ జోన్‌లో లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించారు. 

రెడ్‌జోన్‌లో విజయవాడ నగరం
జిల్లాలో అత్యధికంగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న విజయవాడ నగర పాలక సంస్థను రెడ్‌జోన్‌గా ప్రకటించారు. నగరపాలక సంస్థ పరిధిలోకి వచ్చే విజయవాడ పశి్చమ, సెంట్రల్, తూర్పు, ఉత్తర, రూరల్‌ మండలాలు రెడ్‌జోన్‌లోకి వచ్చేశాయి. విజయవాడ పశి్చమ ప్రాంతంలో అధికంగా 20 కేసులు నమోదయ్యాయి. విజయవాడ సెంట్రల్‌ మండలంలో 18 కేసులు, విజయవాడ తూర్పు మండలంలో 17, విజయవాడ ఉత్తర మండలంలో మరో 8 కేసులు పాజిటివ్‌గా నిర్ధారించారు. మొత్తం మీద 63 కేసులు విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలోనే ఉన్నాయి.  

రెడ్‌జోన్లుగా గుర్తించిన పురపాలక సంఘాలు..
విజయవాడ కార్పొరేషన్, మచిలీపట్నం కార్పొరేషన్, నూజివీడు, జగ్గయ్యపేట, నందిగామ, ఉయ్యూరు, పెడన, కొండపల్లి, తిరువూరు, గుడివాడలను రెడ్‌జోన్లుగా గుర్తించారు. వీటిలో కొన్ని మున్సిపాలిటీల్లో కేసులు నమోదు కానప్పటికీ ముందస్తు చర్యల్లో భాగంగా రెడ్‌జోన్‌లుగా అధికారులు గుర్తించారు.  

37 మండలాల్లో నిబంధనలు సడలింపు  
గ్రీన్‌జోన్‌ పరిధిలో ఉన్న ఆసుపత్రులు, నర్సింగ్‌హోమ్‌లు, క్లీనిక్‌లన్నీ యథావిధిగా పనిచేస్తాయి. మెడికల్‌ ల్యాబ్‌లు, మెడికల్‌ షాపులు, వెటర్నరీ ఆసుపత్రులు, వాటికి సంబంధించిన మెడికల్‌ షాపులు తెరిచే ఉంటాయి. అలాగే ఆయా రంగాలకు సంబంధించిన పరిశ్రమలు కూడా తమ ఉద్యోగులతో పనిచేయించుకోవచ్చు. వ్యవసాయ పనులు కూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. పంటకోతలు, నూరి్పళ్లు తదితర పనులన్నీ చేసుకోవచ్చు. చేపలు, రొయ్యలు, కోళ్ల పెంపకం, పాలు తదితర వాటికి అవసరమయ్యే కేంద్రాలన్నీ గ్రీన్‌జోన్‌ ఏరియాల్లో తెరిచే ఉంటాయి. వాటికి దాణా, మందుల షాపులు కూడా పనిచేస్తాయి. ఉపాధి హామీ పనులు కూడా ఈ జోన్‌ పరిధిలో జరుగుతాయి. ఇందులో నీటిపారుదల, నీటి సంరక్షణ పనులు చేపడతారు. పెట్రోలియం, గ్యాస్‌ సంబంధిత విక్రయ దుకాణాలు పనిచేస్తాయి. పోస్టాఫీసులు, ఎయిర్‌పోర్ట్, రైల్వే గూడ్స్‌ ట్రాన్స్‌పోర్ట్‌లు ఉత్పత్తుల ఎగుమతుల, దిగుమతులకు అందుబాటులో ఉంటాయి. గ్రామ, మండల కేంద్రాల్లో ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులు లభించే కిరాణాషాపులు, మిల్‌్కబూత్‌లు, మాంసాహార దుకాణాలు తెరిచే ఉంటాయి. రోడ్లు, బిల్డింగులు తదితర నిర్మాణ పనులు చేపట్టవచ్చు.  

రెడ్, గ్రీన్‌జోన్లకు ఇన్సిడెంట్‌ కమాండర్స్‌
జిల్లాలో లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలు చేసేందుకు రెడ్, గ్రీన్‌జోన్ల వారీగా సబ్‌కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లను ఇన్సిడెంట్‌ కమాండర్స్‌గా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ నియమించారు. గ్రీన్‌ జోన్‌ పరిధిలో ఉన్న మండలాలు, మున్సిపాలిటీల్లో లాక్‌డౌన్‌ సడలింపు అధికారులు వారికే ఉంటాయి.  

మరో ఐదుగురికి పాజిటివ్‌..
జిల్లాలో సోమవారం మరో ఐదు కరోనా కేసులు వెలుగుచూశాయి. వీటితో కలిపి ఇప్పటివరకు జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 80కి చేరింది. కొత్తగా వచ్చిన ఐదు కేసులు విజయవాడ నగరం, రూరల్‌ ప్రాంతాల్లో నమోదయ్యాయి. వీరంతా ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారితో సంబంధాలు ఉన్నవారు. గొల్లపూడి, ఆటోనగర్, ఖుద్దూస్‌నగర్, కానూరు, అయోధ్యనగర్‌లో ఒక్కొక్కరికి చొప్పున పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అధికారులు ఆ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు.

రెడ్‌జోన్‌లుగా గుర్తించిన మండలాలు ఇవే..  
విజయవాడ నగర పరిధిలోని ఐదు మండలాలతో పాటు మచిలీపట్నం, నూజివీడు, జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు, పెనమలూరు, కంకిపాడు, చందర్లపాడు మండలాలు ఉన్నాయి. వీటితోపాటు పశి్చమగోదావరి జిల్లాలోని ఆకివీడు నగరపంచాయతీలో పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో 7 కిలోమీటర్ల పరిధిలోపు వచ్చే జిల్లాలోని  కైకలూరు, కలిదిండి మండలాలను కూడా రెడ్‌జోన్‌గా గుర్తించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top