రొయ్యకు ‘కోవిడ్‌’ దెబ్బ

Coronavirus Effect To Aqua farmers - Sakshi

పతనమైన ధరలు..కుదేలవుతున్న రైతులు 

కౌంట్‌కు 30 రూపాయల నుంచి 50 రూపాయల వరకు తగ్గుదల 

గణనీయంగా తగ్గిపోయిన వనామీ ఎగుమతులు 

విధిలేక అమ్ముకుంటున్నామంటున్న రైతులు

సాక్షి, అమరావతి బ్యూరో: ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న రొయ్యల సాగు రైతులు.. కోవిడ్‌(కరోనా) వైరస్‌ దెబ్బకు కుదేలవుతున్నారు. చైనాను బెంబేలెత్తిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావం ఇప్పుడు రొయ్యల ఎగుమతిపై కూడా పడింది. కోస్తా జిల్లాల్లో లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ఒక్క కృష్ణా జిల్లాలోనే 50 వేల ఎకరాల్లో వనామీ రొయ్యల సాగు చేస్తున్నారు. ఏటా 1.80 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తి అవుతోంది. ఈ రొయ్యలను ఆక్వా రైతుల నుంచి వివిధ కంపెనీలు  కొనుగోలు చేసి, ప్రాసెసింగ్‌ అనంతరం చైనా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల సహా యూరప్‌కు ఎగుమతి చేస్తుంటారు. జిల్లాలో ఉత్పత్తయిన రొయ్యల్లో 90 శాతం విదేశాలకే ఎగుమతి అవుతాయి.

ప్రస్తుతం కరోనా వైరస్‌ కల్లోలం సృష్టిస్తుండడంతో రొయ్యల ఎగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి. అదే సమయంలో మనదేశం నుంచి విదేశాలు రొయ్యల దిగుమతికి ఆసక్తి చూపడం లేదు. దీంతో కొనుగోలు  కంపెనీలు రొయ్యల ధర తగ్గించేస్తున్నాయి. ఇలా ఇప్పుడు రొయ్యల సైజు/కౌంట్‌ను బట్టి రూ. 30 నుంచి రూ. 50 వరకు తగ్గిపోయింది. చిన్న రైతుల వద్ద అయితే ప్రస్తుత ధరల కంటే కౌంట్‌కు మరో రూ. 20 తక్కువకే కొనుగోలు చేస్తున్నారు. ఇలా రొయ్యల రైతుకు నష్టాల పాలవుతున్నాడు. కొన్నాళ్లుగా వైరస్‌ సోకి రొయ్యల సాగు నష్టాలను తెచ్చిపెడుతోంది. ఈ ఏడాది వైరస్‌ బెడద లేకపోవడంతో ఆక్వా రైతు సంతోషపడుతున్న తరుణంలో కరోనా వైరస్‌ వారిని దెబ్బకొట్టింది.  

మేత ధరలు మోత.. 
ఒకవైపు రొయ్యల ఎగుమతులు తగ్గి ధరలు క్షీణిస్తుండగా మరోవైపు రొయ్యల మేత ధరలు పెరిగిపోయాయి. కొంత కాలం క్రితం వరకు 25 కిలోల మేత (ఫీడ్‌) బస్తా రూ. 2,100 ఉండేది. ప్రస్తుతం అది రూ. 2,230కి పెరిగింది. వీటితో పాటు ఇతర కెమికల్స్, ప్రొబయోటిక్స్‌ వంటి వాటి ధరలు కూడా పెరిగాయి. విదేశాల నుంచి రొయ్యల మేత దిగుమతులు తగ్గడమే వీటి ధరల పెరుగుదలకు కారణంగా వ్యాపారులు చెబుతున్నారు.  

విధిలేక అమ్ముతున్నాం.. 
ఇప్పటి వరకూ రొయ్యలకు వైరస్‌ సోకి నష్టాల పాలవుతున్నాం. కొత్తగా కరోనా వైరస్‌ పేరిట రొయ్యల ధరలు తగ్గించి కొనుగోళ్లు చేస్తున్నారు. ఈ పదిరోజుల్లో కౌంట్‌కు రూ. 30 నుంచి రూ. 50 వరకు ధర తగ్గిపోయింది. రొయ్యలను నిల్వ ఉంచుకునే పరిస్థితి లేదు. విధిలేక అమ్ముకోవలసి వస్తోంది. ఒకపక్క రొయ్యల ధరలు తగ్గడం, మరోపక్క మేత ధరలు పెరగడం మాకు నష్టాలను తెచ్చిపెడుతున్నాయి. 
– తలారి శ్రీహరి, ఆక్వా రైతు, వేమవరప్పాడు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top