
లాభసాటిగా ఉండటంతో రెండేళ్లుగా సాగుపై మొగ్గు చూపిన రైతులు
గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 7,200 ఎకరాల్లో సాగు
రైతుల ఆశలపై నీళ్లు చల్లిన నకిలీ సీడ్, ప్రతికూల వాతావరణం
వైరస్, విబ్రియో ధాటికి తేలిపోతున్న రొయ్యలు
అయినకాడికి విక్రయిస్తున్న రైతులు
ఊరించి ఉసూరుమనిపించిన టైగర్ రొయ్యల సాగు
సాక్షి, భీమవరం: రెండు దశాబ్దాల క్రితం వరకు మీసం మెలేసిన టైగర్ (మోనోడాన్) రొయ్య ఆక్వా రంగంలో రారాజుగా వెలుగొందింది. ఈ రొయ్యలకు 2002 వరకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండేది. ఆ తరువాత కాలంలో వివిధ రకాల తెగుళ్ల కారణంగా వీటి పెంపకానికి ఆదరణ తగ్గింది. అనంతరం వనామి రొయ్యలపై ఆక్వా రైతులు దృష్టి పెట్టడంతో టైగర్ రొయ్యల సాగు అంతర్థానమైంది.
చాలా కాలం తర్వాత మళ్లీ తెరపైకి వచ్చి రైతులను ఊరించిన టైగర్ రొయ్యల సాగు అంతలోనే ఉసూరుమనిపించింది. 10 నుంచి 20 కౌంట్‌తో సాగుదారులకు సిరులు కురిపిస్తుందనుకుంటే.. 50 నుంచి 80 కౌంట్ దశలోనే నిండా ముంచేస్తోంది. నకిలీ సీడ్, ప్రతికూల వాతావరణం నష్టాలకు కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నష్టాల్లో ముంచేసి..
ఈ సీజన్‌లో ఊహించని విధంగా టైగర్ రొయ్యలకు వైట్ స్పాట్, విబ్రియో వైరస్ ప్రబలి నీటిపైకి తేలిపోతున్నాయి. ఒక చెరువు నుంచి మరొక చెరువుకు వైరస్ సోకుతుండటంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో రైతులు 80 కౌంట్ నుంచి 50 కౌంట్‌కు హడావిడిగా పట్టుబడులు చేస్తున్నారు. ఇదే అదునుగా దళారులు దోచుకునే పనిలో పడ్డారు. కంపెనీలు 10 కౌంట్ నుంచి 20 కౌంట్ మాత్రమే తీసుకుంటున్నాయని, అంతకంటే ఎక్కువ ఉంటే అయినకాడికి వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైరస్‌తో 5 నెలలకే పట్టుబడి చేయాల్సి వచ్చిందని, 30 కౌంట్ రొయ్యలను రూ.470కి అమ్ముకోవాల్సి వచ్చిందని చినమైనవానిలంకకు చెందిన రైతులు వాపోతున్నారు. దీంతో పెట్టుబడులు కూడా రాక తీవ్రంగా నష్టపోయామని చెబుతున్నారు. రెండు రాష్ట్రాల్లో మోనోడాన్ సీడ్‌ను ఉత్పత్తి చేసే హేచరీలు ఐదారు మాత్రమే ఉండగా.. సీడ్ కోసం రెండు నెలల ముందే అడ్వాన్సులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉండేది.
ఈసారి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడంతో కొన్ని హేచరీలు నాణ్యత లేని సీడ్‌ను ఉత్పత్తి చేయడం వైరస్‌ల వ్యాప్తికి కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోపక్క మే నెలలో జిల్లాలో సాధారణం కంటే 66.4 మి.మీ., జూన్‌లో 15.1 మి.మీ., అధిక వర్షపాతం నమోదు కావడం ప్రతికూల ప్రభావం చూపాయంటున్నారు. నకిలీ సీడ్ ఉత్పత్తికి అడ్డుకట్ట వేసేవిధంగా హేచరీలపై ప్రభుత్వ అజమాయిషీ ఉండాలని రైతులు కోరుతున్నారు.
ఆశలు రేకెత్తించి..
ఆరు నెలల పంట కాలానికి కేజీకి 20 కౌంట్ టైగర్ రొయ్యలకు కిలో రూ.1,050 ధర పలికి రెండు సీజన్లుగా ఊరించింది. ఏపీ, తమిళనాడులోని కొన్ని హేచరీలు మడగాస్కర్ సముద్ర జలాల్లోని నాణ్యమైన బ్రూడర్స్ నుంచి సీడ్ ఉత్పత్తి చేయడంతో రెండేళ్ల క్రితం టైగర్ రొయ్య మళ్లీ తెరపైకి వచ్చింది. వీటి సాగుకు ఉప్పునీటి చెరువులు అనుకూలం. రాష్ట్రంలోని తీరం వెంబడి 1.05 లక్షల ఎకరాల్లో ఉప్పునీటి చెరువులు ఉండగా.. 2023 సీజన్‌లో కృష్ణా జిల్లాలో 5,200 ఎకరాలు, బాపట్లలో 582 ఎకరాలు, ప్రకాశం జిల్లాలో 427 ఎకరాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 457 ఎకరాల్లో టైగర్ రొయ్యల సాగు చేశారు.
ఆశాజనకంగా ఉండటంతో గత సీజన్‌లో 12 వేల ఎకరాల్లో సాగు చేసినట్టు అంచనా. పశ్చిమ గోదావరి జిల్లాలో 6 నెలల్లో 20 కౌంట్ తీయగా, 8 నెలల కాలానికి కొందరు 10 నుంచి 11 కౌంట్ కూడా తీశారు. పెట్టుబడులకు రెట్టింపు లాభాలు రావడంతో ఈ ఏడాది జిల్లాలోని బియ్యపుతిప్ప, చినమైనవానిలంక, దర్భరేవు తదితర ప్రాంతాల్లో దాదాపు 5 వేల ఎకరాల్లో టైగర్ సాగు చేపట్టారు. నష్టాలకు భయపడి కొన్నేళ్లుగా ఖాళీగా వదిలేసిన చెరువులను టైగర్ కోసం వినియోగంలోకి తెచ్చారు.
తీవ్రంగా నష్టపోయాం
గత ఏడాది 1.50 ఎకరాల్లో టైగర్ సీడ్ వేసి ఆరు నెలలకు 22 కౌంట్‌తో తీశాను. లాభసాటిగా ఉండటంతో ఈ సీజన్‌లో 3.50 ఎకరాల్లో సాగు చేశాను. ఎర్ర ఉబ్బు, తెల్ల మచ్చ (వైట్‌స్పాట్) తెగుళ్లు సోకడంతో 50 కౌంట్ ఉన్నప్పుడే అమ్మేసుకోవాల్సి వచ్చింది. వైరస్‌కు జడిసి చుట్టుపక్కల చాలామంది రైతులు 100 కౌంట్, 80 కౌంట్‌కు కూడా అయినకాడికి పట్టుబడులు చేశారు. – శీలబోయిన వెంకటేశ్వరరావు, ఆక్వా రైతు, వేములదీవి
వైరస్ వచ్చేసింది
రెండేళ్లుగా టైగర్ సాగు బాగుండటంతో ఈసారి తీరప్రాంత గ్రామాల్లో వనామీకి బదులు టైగర్ రొయ్యల సీడ్ వేశాం. కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్న చెరువులను రూ.లక్షలు పెట్టి బాగుచేసి మరీ ఈ సీజన్‌లో వినియోగంలోకి తెచ్చాం. ఊహించని విధంగా వైరస్‌లు రావడంతో ధర లేక రైతులందరూ తీవ్రంగా నష్టపోయాం. – వాతాడి హరినాథ్, ఆక్వా రైతు, చినమైనవానిలంక