
రొయ్యల రైతులను దోచేస్తున్న కంపెనీలు, దళారులు
వేయింగ్ మెషిన్‌లో కేజీ మోడ్‌ను లీటరుకు మార్చి దోపిడీ
టన్నుకు రూ.20 వేల వరకు నష్టపోతున్న రైతులు
‘పశ్చిమ’లో వెలుగుచూసిన కాటా మోసం
మోసాలకు అడ్డుకట్ట వేయాలని కలెక్టర్‌కు వినతి
ఎండనకా.. వాననకా.. నకిలీలు, వైరస్‌లు, వాతావరణ మార్పుల నడుమ దినదిన గండాలను దాటుకుని రొయ్యల్ని పెంచితే.. గోతికాడ నక్కల్లా ఆక్వా రైతుల కష్టాన్ని దళారులు దోచేస్తున్నారు. ఇప్పటివరకు ఫీడ్, సీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఎక్స్‌పోర్టర్స్ రైతులను వివిధ రూపాల్లో ముంచేస్తున్నారు. తాజాగా రొయ్యల పట్టుబడి తూకంలోనూ మోసాలకు పాల్పడుతూ టన్నుకు 60 కేజీలు కాజేస్తున్న వైనం పశ్చిమగోదావరి జిల్లాలో వెలుగు చూసింది. తూకాల్లో మోసాలపై చర్యలు చేపట్టి రొయ్యల రైతులను రక్షించాలంటూ ఆక్వా రైతు సంఘం నాయకులు కలెక్టర్ సీహెచ్ నాగరాణికి వినతిపత్రం సమర్పించారు. – సాక్షి, భీమవరం
ఇలా మోసగిస్తున్నారు
రొయ్యల కొనుగోలుదారులు తూకంలో చేస్తున్న మోసం పాలకొల్లు నియోజకవర్గం మేడపాడులో బయటపడింది. సాధారణంగా ఎల్రక్టానిక్ కాటాల్లో కేజీలు, లీటర్లలో కొలిచేందుకు వీలుగా ‘మోడ్ బటన్’ ఉంటుంది. అవసరాన్ని బట్టి ఈ బటన్‌ను కేజీలు, లీటర్లలోకి సెట్ చేసుకోవచ్చు. దీనిని ఉపయోగించి వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నట్టు ఆక్వా రైతులు గుర్తించారు. కేజీ మోడ్‌లో ఉంచితే 1,000 గ్రాములకు కిలోగా డిస్‌ప్లేలో చూపిస్తుంది. దానిని లీటర్ల మోడ్‌లోకి మారిస్తే 9,400 గ్రాములు చూపిస్తుంది.
అంటే రైతులు 100 కిలోల (క్వింటాల్) రొయ్యలను తూకం వేయిస్తే 94 కిలోలు మాత్రమే చూపుతుంది. క్వింటాల్‌కు 6 కిలోల చొప్పున టన్నుకు 60 కిలోల రొయ్యలను దళారులు, కంపెనీలు రైతుల నుంచి దోచేస్తున్నాయి. ఎల్రక్టానిక్ కాటా లీటర్ల మోడ్‌లో ఉన్నప్పుడు డిస్‌ప్లే మొదటిలో ‘ఎల్’ ఇండికేషన్ వస్తుంది. ఇది కనిపించకుండా ఉండేందుకు ‘ఎల్’ ఇండికేషన్ స్థానంలో బ్లాక్ స్టిక్కర్‌ను అతికిస్తున్నారు.
దీనివల్ల ‘ఎల్’ సింబల్ కనిపించడం లేదని రైతులు చెబుతున్నారు. కాటా మోసాల వల్ల రొయ్యల కౌంట్, ధరను బట్టి టన్నుకు రూ.13 వేల నుంచి రూ.20 వేల చొప్పున రూ.కోట్లల్లో దోచేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లు, పప్పు దినుసులు, అన్నిరకాల వ్యాపారాల్లోనూ ఈ తరహా కాటా మోసాలు జరుగుతున్నాయని రైతులు చెబుతున్నారు.
అడ్డుకోవాలని అధికారులకు వినతి
కాటా మోసాలకు తూనికలు, కొలతల శాఖ అధికారులు చెక్ పెట్టాలని ఆక్వా రైతులు డిమాండ్ చేస్తున్నారు. కేజీల్లో తూకం వేసే కాటాలకు కేజీ మోడ్ మాత్రమే ఉండేలా చూడాలని, వాటికి సీళ్లు, కచి్చతమైన ప్రమాణాలు పాటించేలా ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని కోరుతున్నారు. రైతుల ఫిర్యాదులపై స్పందించేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని, కాటా మోసాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ మేరకు ఆక్వా రైతు సంఘం నాయకులు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సీహెచ్ నాగరాణికి వినతిపత్రం అందజేశారు. కాగా.. రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా దోపిడీ జరుగుతోందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ మోసం జరిగే తీరును వివరిస్తూ పాలకొల్లుకు చెందిన జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం నాయకులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
కాటా మోసం కళ్లారా చూశాం
ఇప్పటివరకు కాటా మోసం గురించి వినడమే గానీ.. ఎలా చేస్తారో తెలిసేది కాదు. కాటాకు చిన్న స్టిక్కర్ అతికించి రైతుల కష్టాన్ని దారుణంగా దోచేస్తున్నారు. ఈ తరహా మోసాలు ఒక్క ఆక్వాలోనే కాకుండా ఇతర వ్యాపారాల్లోనూ జరిగేందుకు అవకాశం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం తనిఖీలు చేయించి ప్రజలు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలి. – తులసి రాంబాబు, ఆక్వా రైతు సంఘం నేత, వీరవాసరం
కాటాలకు కేజీ ఆప్షన్ మాత్రమే ఉంచాలి
అటు వైరస్‌లు, ఇటు ధరల పతనం, సిండికేట్ల దోపిడీతో రొయ్యల రైతులు నష్టపోతుంటే కాటా మోసాలు మమ్మల్ని మరింత కుంగదీస్తున్నాయి. రొయ్యల పట్టుబడికి వినియోగించే కాటాలకు కేవలం కేజీ ఆప్షన్ మాత్రమే ఉండేలా చూడాలి. కాటా మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు తూనికలు, కొలతల శాఖ అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలి. – జీకేఎఫ్ సుబ్బరాజు, కార్యదర్శి, జిల్లా రొయ్య రైతుల సంక్షేమ సమాఖ్య, భీమవరం