
సిండికేట్‌గా మారి..ధర లేకుండా చేసిన కంపెనీలు.. కౌంట్‌కు రూ.80 తగ్గింపు
30–40 కౌంట్ వద్ద రొయ్యలకు ధర లేని పరిస్థితి
అమెరికా, గల్ఫ్ దేశాలకు ఎగుమతయ్యే టైగర్ రొయ్యలు
అంతర్జాతీయ మార్కెట్‌లో ఒడిదొడుకులు లేకపోయినా పట్టుబడి సమయంలో ధరలు తగ్గించిన కంపెనీలు
ఒక్కసారిగా ధరలు తగ్గించడంపై రైతుల మండిపాటు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకానికి తోడు సిండ్‌కేట్‌గా మారిన కంపెనీల దెబ్బకు ఆక్వా రైతులు కుదేలవుతున్నారు. ఇప్పటికే వెనామీ రొయ్య ధరలు దిగజారిపోగా, తాజాగా టైగర్ (నీలకంఠ) రొయ్యల ధరలు తగ్గించేయడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఒక్కసారిగా కౌంట్‌కు రూ.80 తగ్గించడంతో కనీసం పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొంది. వైట్‌స్పాట్, వెబ్రియా వంటి వైరస్‌లకు తోడు అంతర్జాతీయ మార్కెట్ ఒడిదొడుకుల సాకుతో ధరలు తగ్గి, తీవ్ర నష్టాల పాలైన వెనామీ రైతులకు టైగర్ ప్రత్యామ్నాయంగా మారింది.
వెనామీ తరహాలోనే ఎప్‌సీఎఫ్ టైగర్ బ్రూడర్స్ అందుబాటులోకి రావడంతో వెనామీకి ప్రత్యామ్నాయంగా 2021 నుంచి రాష్ట్రంలో టైగర్ రొయ్యల సాగు విస్తరిస్తోంది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో 50 నుంచి 60 వేల ఎకరాల్లో టైగర్ రొయ్య సాగవుతుంది. వ్యాధుల బారిన పడకుండా రోజూ 0.3 గ్రాముల నుంచి 0.5 గ్రాముల ఎదుగుదలతో కేవలం 120 రోజుల్లోనే 20 కౌంట్ వద్ద పంట చేతికి కొస్తుంది. టైగర్ రొయ్య వెనామీకి దీటుగా అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాలకు ఎగుమతవుతున్నాయి. దీంతో వీటిని సాగు చేసే రైతులు నాలుగైదేళ్లుగా మంచి లాభాలే చవిచూస్తున్నారు.
అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం విధించిన ప్రతీకార పన్ను సాకుతో రొయ్యల కంపెనీలు, ఎగుమతిదారులు రొయ్యల కౌంట్ ధరలను తగ్గించేసారు. వెనామీ రొయ్యల ధరలు కౌంట్‌కు రూ.20 నుంచి రూ.50 మేర పతనమైనప్పటికీ టైగర్ రొయ్యల ధరలు కాస్త మెరుగ్గానే కొనసాగాయి. అలాంటిది ప్రస్తుతం పంట చేతికొచ్చే సమయంలో కంపెనీలు సిండికేట్ అయిపోయి ఉన్నట్టుండి కౌంట్‌కు రూ.80 మేర తగ్గించేయడం టైగర్ రొయ్య రైతులకు శాపంగా మారింది. సాధారణంగా టైగర్ రొయ్యలు 20–40 కౌంట్ వద్దే పట్టుబడి పడుతుంటారు.
మొన్నటి వరకు 20 కౌంట్ వద్ద పట్టుబడి పడితే రూ.650, 30 కౌంట్‌కు రూ.580, 40 కౌంట్‌కు రూ.480 చొప్పున ధర లభించింది. అలాంటిది ప్రస్తుతం పంట చేతికొచ్చే సమయంలో అధికంగా పట్టుబడి పట్టే 30 కౌంట్ ధరను రూ.500కు, 40 కౌంట్ ధరను రూ.400కు తగ్గించేశారు. కంపెనీలను నియంత్రించి, రైతులకు మేలు చేయాల్సిన ప్రభుత్వం కూడా పట్టించుకోవడంలేదు.
వెనామీతో పోల్చుకుంటే టైగర్ రొయ్యల సాగుకు పెట్టుబడి అధికం. వెనామీ పిల్ల 30–32 పైసల మధ్య లభిస్తుండగా, టైగర్ రొయ్య పిల్ల ధర రూపాయి పైమాటే. పైగా మేత ధర కూడా వెనామితో పోల్చుకుంటే కిలోకు రూ.10–15 అధికంగా పెట్టాలి. ఎకరాకు 5.50 లక్షలు ఖర్చవుతుంది. 20 కౌంట్‌కు పడితే 2 టన్నులు, 30 కౌంట్‌కు పడితే టన్నున్నర, 40 కౌంట్ అయితే టన్నుకు మించి రాదు. అలాంటిది కిలోకు రూ.80 తగ్గించడంతో టన్నుకు రూ.80 వేల మేర రైతులు నష్టపోతున్నారు. ధరల నియంత్రణపై ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడటంవల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆక్వా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కంపెనీల మాయాజాలం
అంతర్జాతీయ మార్కెట్‌లో ఎలాంటి ఒడిదొడుకులు లేవు. టైగర్ రొయ్యలు ఎగుమతి అయ్యే దేశాల్లో ఎలాంటి ఆర్థిక సంక్షోభాలు తలెత్తలేదు. పైగా ఆ దేశాల్లో వీటికి ఎనలేని డిమాండ్ ఉంది. ఆర్డర్లు కూడా బాగానే వస్తున్నాయి. అయినా కంపెనీలు సరిగ్గా పంట చేతికొచ్చే సమయంలో కౌంట్‌కు రూ.80కుపైగా తగ్గించడం దారుణం. ప్రభుత్వమూ పట్టించుకోవడంలేదు. – దుగ్గినేని గోపీనాథ్, అధ్యక్షుడు, రొయ్య రైతుల సంఘం, ప్రకాశం జిల్లా