వెటర్నరీలో అక్రమ పదోన్నతులు!

Contraversy On Faculty promotions In Sri Venkateswara University - Sakshi

ఆరేళ్ల తరువాత బయటపడ్డ వ్యవహారం

గవర్నర్‌కు ఓ ప్రొఫెసర్‌ ఫిర్యాదుతో వెలుగులోకి...

విచారణ సైతం పూర్తికావడంతో వర్సిటీలో కలకలం

రాద్ధాంతం వద్దంటూ..పాలకమండలి అభ్యంతరం

యూనివర్సిటీ క్యాంపస్‌ : శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో 2012లో చేపట్టిన అధ్యాపక పదోన్నతులు వివాదస్పదంగా మారాయి. తనకు కావాల్సిన వారికి మేలు చేకూర్చేందుకు అప్పటి వీసీ నిబంధనలకు వ్యతిరేకంగా చేసిన పదోన్నతులు ఇపుడు వర్సిటీలోని పలువురి పీఠాలు కదిలించేలా ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఆరేళ్ల తరువాత ఒక ప్రొఫెసర్‌ ఫిర్యాదు చేయడంతో గవర్నర్‌ విచారణకు ఆదేశించారు. వర్సిటీ దీనిపై ఒక కమిటీ వేసి విచారణ చేపట్టింది. ఈ అంశాన్ని పాలకమండలిలో చర్చకు పెట్టగా, ఇప్పుడు ఈ పదోన్నతులపై రాద్దాంతరం చేయవద్దని, బోర్డుకు తెలియకుండా ఏమీ చేయవద్దని పాలకమండలి వీసీకి సూచించింది.  ఈ వ్యవహారం మొత్తం వర్సిటీలో తీవ్ర వివాదస్పదమవుతోంది.

నిబంధనలకు విరుద్ధంగా..
అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేసే అధ్యాపకుడు కెరీర్‌ అడ్వాన్స్‌డ్‌ స్కీమ్‌(సీఏఎస్‌) కింద పదోన్నతి పొందాలంటే 9,000 ఏజీపీతో మూడు సంవత్సరాల బోధన అనుభవం ఉండాలి.  2012 అక్టోబర్‌లో ఉమ్మడి ఏపీగా ఉన్న సమయంలో అప్పటి వీసీ సీఏఎస్‌ కింద పదోన్నతులు కల్పించారు. నిబంధనల ప్రకారం మూడు సంవత్సరాల సర్వీసు పూర్తయిన వారికి  ప్రొఫెసర్‌గా పదోన్నతి కల్పించాలి. అయితే ఈ నిబంధన  పాటించలేదు. దీన్ని ప్రశ్నించినవారిని సంతృప్తిపరచడానికి మరో 20 మందికి తగినంత సర్వీసు లేకపోయినా పదోన్నతి ఇచ్చారు. ఇక్కడికి వరకు అంతా బాగానే ఉంది. ఏపీ విడిపోయాక, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కూడా విడిపోయింది. తెలంగాణలో పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. ఆస్తులు, పోస్టులు పంచుకున్నారు. దొడ్డిదారిన పదోన్నతి పొందిన వారిలో 11 మంది తెలంగాణకు, 10 మంది ఏపీకి వచ్చారు. అక్రమ పదోన్నతులపై ఓ ప్రొఫెసర్‌ రెండు నెలల క్రితం గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

రాష్ట్ర విభజన సమయంలో ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లిన ఓ అధ్యాపకుడికి తక్కువ సర్వీసుతో పదోన్నతి కల్పించారని, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో అధ్యాపకుల పదోన్నతులు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయిని అందులో పేర్కొన్నారు. ఆరు సంవత్సరాల తర్వాత ఈ పదోన్నతులపై ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ గవర్నర్‌ ఈ అంశంపై విచారణకు ఆదేశించారు. గవర్నర్‌ ఆదేశాల మేరకు వెటర్నరీ వీసీ హరిబాబు రహస్యంగా ఓ కమిటీ వేసి విచారణ జరిపించారు. విచారణ అనంతరం గవర్నర్‌కు వీసీ నివేదిక పంపినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో పలువురు పెద్దలు ఉన్నట్లు తెలిసింది. గత నెలలో 17వ తేదీ నిర్వహించిన పాలకమండలి సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. పాలక మండలి సభ్యులు వీసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకమండలికి తెలియకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. దీంతో ప్రస్తుతానికి ఈ అంశం సద్దుమణిగింది. అయినప్పటికీ భవిష్యత్‌లో ఈ వ్యవహారం ఎంత వరకు వెళుతుందోనని అధ్యాపకులు, అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. మొత్తం మీద ఒక వ్యక్తికి మేలు చేసేందుకు ఓ మాజీ అధికారి చేసిన అక్రమాలు ఆరేళ్ల తర్వాత తెరపైకి వచ్చాయి. వర్సిటీలో అక్రమ పదోన్నతుల వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top