నల్లమలపై నిరంతర నిఘా!

Continuous Surveillance In Palnadu Villages Over Maoist's  Martyrs Commemoration Week - Sakshi

 28 నుంచి మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు 

అప్రమత్తమైన నిఘా వర్గాలు

మాజీ మావోల కదలికలపై ఆరా

పల్నాడు గ్రామాలపై  పోలీసుల డేగ కన్ను

సాక్షి, గుంటూరు: నల్లమలపై పోలీసులు నిఘా పెంచారు. ఈ నెల 28వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించనుండడంతో పల్నాడు ప్రాంతాన్ని అణువణువూ పరిశీలిస్తున్నారు. మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ రామకృష్ణ అలియాస్‌ ఆర్‌కే జిల్లా వాసి కావడం, గతంలో బెల్లంకొండ, అచ్చంపేట, క్రోసూరు, దుర్గి, కారంపూడి, గురజాల మండలాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతానికి కొత్తగా వచ్చే వారి వివరాలను ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు. 

మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ఈ నెల 28 నుంచి ఆగస్టు 3 వరకు జరుగనున్న నేపథ్యంలో నల్లమల అటవీ ప్రాంతంపై పోలీసులు  నిఘా పెట్టారు. మావోయిస్టుల ప్రభావం లేనప్పటికీ గుంటూరు జిల్లా అటవీ ప్రాంతాన్ని షెల్టర్‌ జోన్‌గా వాడుకునే అవకాశం ఉందనే కారణంగా పోలీస్‌ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్న విజయనగరం, విశాఖ ఏజెన్సీ, ఏవోబీ ప్రాంతాల్లో పోలీసు  నిఘా పెరిగిన సమయంలో గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు నల్లమల అటవీ ప్రాంతాన్ని గతంలో మావోలు షెల్టర్‌ జోన్‌గా వాడుకున్నారు. ప్రస్తుతం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రెడ్‌ అలర్ట్‌ విధించిన కారణంగా మళ్లీ జిల్లాను సేఫ్‌ జోన్‌గా వాడుకునే అవకాశం ఉన్నందున నిఘాను మరింతగా పెంచారు. మాజీ మావోయిస్టుల కదలికలపై ఆరా తీసే పనిలో పడ్డారు. 

పల్నాడు గ్రామాలపై నిఘా 
గతంలో మావోల ప్రభావం అధికంగా ఉన్న పల్నాడు గ్రామాలపై పోలీసులు డేగ కన్ను వేశారు. బెల్లంకొండ, అచ్చంపేట, క్రోసూరు, దుర్గి, కారంపూడి, మాచవరం, గురజాల, పిడుగురాళ్ల రూరల్, రెంటచింతల మండలాల పరిధిలోని గ్రామాలకు రాకపోకలు కొనసాగిస్తున్న వారి కదలికలను గమనిస్తున్నారు. గుత్తికొండ బిలంతో పాటుగా నల్లమల అటవీ ప్రాంతంలోని కొన్ని గ్రామాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. గతంలో గుత్తికొండ బిలంలోని మజుందార్‌ స్మారక స్థూపం వద్ద మావోయిస్టులు అమర వీరుల సంస్మరణ దినోత్సవం జరిపిన కారణంగా ఆయా ప్రాంతాల్ని ఇప్పటికే పోలీసులు తరచూ పరిశీలిస్తున్నారు. ఇప్పటికే జనజీవన స్రవంతిలో కలసిన మాజీలలో కొందరు అనుమానితుల్ని నిఘా వర్గాలు విచారిస్తూ వివరాలను సేకరిస్తున్నాయి. అంతే కాకుండా ప్రజా సంఘాల ముసుగులో ఎవరైనా సానూభూతిపరులు ఉన్నారా అనే కోణంలోనూ వివరాలు సేకరిస్తున్నారు.

అగ్రనేత ఆర్కే జిల్లా వాసి కావడంతో.. 
అగ్రనేతగా ఉన్న అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ రామకృష్ణ అలియాస్‌ ఆర్కే గుంటూరు జిల్లా రెంటచింతల మండలం తమృకోటకు చెందిన వ్యక్తి కావడంతో పోలీస్‌ యంత్రాంగం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఆయా ప్రజాసంఘాల సీనియర్లతో ఆర్కేకు సత్సంబంధాలు ఉన్నాయనే కోణంలో  ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పల్నాడులోని రాజకీయ నేతలకు ఇంటెలిజెన్స్‌ అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ అప్రమత్తం చేస్తున్నారు. 
   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top