చికెన్‌ డబ్బు అడిగినందుకు కానిస్టేబుల్‌ దౌర్జన్యం

Constable Attack on Chicken Shop Owner In Chittoor - Sakshi

చిత్తూరు అర్బన్‌ : తీసుకున్న చికెన్‌కు డబ్బులివ్వమని అడిగినందుకు ఓ కానిస్టేబుల్‌ దుకాణ మేనేజర్‌పై దౌర్జన్యం చేశాడు. ఇది చూసి స్థానికులు నివ్వెరపోయారు. వివరాలిలా.. నగరంలోని పలమనేరు  రోడ్డులో ఓ వ్యక్తి చికెన్‌ షాపు నిర్వహిస్తున్నాడు. మంగళవారం ఉదయం ఓ కానిస్టేబుల్‌ కేజీ చికెన్‌ తీసుకుని డబ్బు లివ్వలేదు. మీరే తొలిబోణీ అని, పది రూపాయలు తగ్గించుకుని డబ్బులివ్వాలని చికెన్‌ షాపు వ్యక్తి ప్రాధేయపడ్డాడు.

పోలీసు అని చెప్పినా డబ్బులు అడుగుతావా.. అంటూ పోలీసు అతనితో వాగ్వాదానికి దిగాడు. తాను దుకాణంలో పనిచేసే వ్యక్తినని, డబ్బులివ్వకపోతే తన జీతంలో కట్‌ చేస్తారని చికెన్‌ షాపు వ్యక్తి ప్రాధేయపడ్డాడు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన కానిస్టేబుల్‌ అతన్ని రోడ్డుపైకి లాగి తన్నాడు. తప్పు తనది కానప్పటికీ ఎందుకు కొడుతున్నారని అతడు అడుగుతున్నా కానిస్టేబుల్‌ కొట్టడం మానలేదు. సహనం కోల్పోయిన దుకాణ మేనేజర్‌ కానిస్టేబుల్‌పై తిరగబడ్డాడు. రోడ్డుపై ఇద్దరూ కొట్టుకుంటూ ఉండడంతో చుట్టుపక్కల వారు చూసి ముక్కున వేలేసుకున్నారు. కొంతసేపటి తరువాత గొడవపడుతున్న వారిని స్థానికులు విడగొట్టి సర్దిచెప్పడంతో వివాదం ముగిసింది. కాగా గొడవపడిన కానిస్టేబుల్‌ టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్నట్లు తెలిసింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top