
కార్యకర్తల్లో మనోధైర్యం నింపుతాం..
కాంగ్రెస్ పార్టీ జవసత్వాలు పుంజుకునే కాలం ఎంతోదూరం లేదు. కార్యకర్తలంతా మనోధైర్యంతో నిబ్బరంగా పనిచేస్తే క్షేత్రస్థాయిలో పార్టీ పునర్నిర్మాణం సాధ్యమవుతుందని పీసీసీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్. రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు.
సాక్షి, ఒంగోలు: కాంగ్రెస్ పార్టీ జవసత్వాలు పుంజుకునే కాలం ఎంతోదూరం లేదు. కార్యకర్తలంతా మనోధైర్యంతో నిబ్బరంగా పనిచేస్తే క్షేత్రస్థాయిలో పార్టీ పునర్నిర్మాణం సాధ్యమవుతుందని పీసీసీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్. రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో క్విట్‌ఇండియా డే కార్యక్రమం సందర్భంగా శనివారం ఒంగోలు జిల్లా పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యకర్తల సమావేశం, నియోజకవర్గాల సమీక్షల్లో ఆయనతో పాటు మాజీ పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యనేత బొత్స సత్యన్నారాయణ, కేవీపీ రామచంద్రరావు, కేంద్ర మాజీ మంత్రులు జేడీ శీలం, పనబాక లక్ష్మి, రాష్ట్ర మాజీ మంత్రి ఆనం వివేకానందరెడ్డి మాట్లాడారు.
తొలుత ర్యాలీగా జిల్లాపార్టీ కార్యాలయం చేరుకున్న ముఖ్యనేతలు అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ముఖ్యుల సమావేశం, నియోజకవర్గాల సమీక్షలు నిర్వహించారు. ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. పంట రుణాల మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీపై చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు మోసపోయారన్నారు. హామీల దాటవేతపై త్వరలోనే ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుడతామన్నారు. కిందటేడాది పంటలు దెబ్బతిన్న రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంచేసిన రూ.137 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని విడుదల చేసి ప్రతీ రైతుకు రూ.3400 చొప్పున తక్షణమే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
చేనేతల రుణమాఫీపై ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసుకున్న టీడీపీ నేతలు ఆ సంగతిని మరిచిపోయినట్లుందని విమర్శించారు. రేషన్‌కార్డుల తొలగింపు, పింఛన్ల కోతతో లబ్ధిదారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లో ప్రతీ కార్యకర్త పార్టీ తరఫున పూనుకుని ప్రభుత్వ పథకాల బాధితుల్ని గుర్తించి.. వారి తరఫున ఉద్యమాలు చేయాలన్నారు. ఎక్కడైతే టీడీపీ నేతల అరాచకాలు, వేధింపులు ఉంటాయో.. అక్కడ పోలీసులతో మాట్లాడి కార్యకర్తల్లో ధైర్యం నింపాల్సిన పనిని చిత్తశుద్ధిగా చేపట్టాలని జిల్లా నేతలకు బొత్స సత్యన్నారాయణ సూచించారు.
అంతర్గత సమస్యల్ని విడనాడాలి...
పలు కారణాలతో పార్టీ పరాజయం పాలైందని.. ప్రస్తుతం గ్రామాల్లోని పార్టీ కార్యకర్తలు అంతర్గత సమస్యల్ని వదిలే సి కలిసికట్టుగా పనిచేయాలని బొత్స, పనబాక, జేడీ శీలం పిలుపునిచ్చారు. తమపార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లిన కార్యకర్తలు, నేతలు అక్కడి విధానాలు నచ్చకపోవడంతో తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తున్నారని చెప్పారు. త్వరలోనే పార్టీ నిర్మాణాత్మక కమిటీలను నియమిస్తామని, కార్యకర్తలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తామన్నారు.
ఆయా కమిటీల్లో సీనియర్‌లు, జూనియర్‌లు, ఎమ్మెల్యే అభ్యర్థులు తదితరులను సభ్యులుగా చేస్తామన్నారు. అంశాలవారీగా నియోజకవర్గాల ఇన్‌చార్జులు తమ పరిధిలోని గ్రామాల పార్టీకేడర్‌తో సమావేశాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమాల్లో పీసీసీ కార్యదర్శి ఈదా సుధాకర్‌రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు మాదాసు గంగాధరం, పీసీసీ పరిశీలకులు వేణుగోపాలరాజు, పి. చెంచలబాబు యాదవ్, ఒంగోలు, ఎస్‌ఎన్ పాడు, చీరాల, కొండపి, వై.పాలెం నియోజకవర్గాల ఇన్‌చార్జులు వై. శశికాంత్‌భూషణ్, వేమా శ్రీనివాసరావు, మెండు నిషాంత్, గుర్రం రాజ్‌విమల్, కనకరావు మాదిగ, వై.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.