సీమాంధ్రలో అల్లకల్లోలానికి కారణం కాంగ్రెస్సే | congress is the cause for seemandhra agitation | Sakshi
Sakshi News home page

సీమాంధ్రలో అల్లకల్లోలానికి కారణం కాంగ్రెస్సే

Sep 8 2013 4:42 AM | Updated on Mar 18 2019 9:02 PM

రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ప్రకటించి సీమాంధ్రలో అల్లకల్లోలం సృష్టించి రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చింది కాంగ్రెస్

జంగారెడ్డిగూడెం, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ప్రకటించి సీమాంధ్రలో అల్లకల్లోలం సృష్టించి రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చింది కాంగ్రెస్ పార్టీయేనని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సమైక్యాంధ్ర కోరుతూ శనివారం స్థానిక రాష్ట్ర ప్రధాన రహదారిపై జేఏసీ నేతలు, రైతులు చేపట్టిన రాస్తారోకోలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమైక్యాంధ్ర కోసం అశువులు బాసిన వారి కుటుంబాల పాపం కాంగ్రెస్ మూటకట్టుకుందని నిప్పులు చెరిగారు. ప్రజల మనోభీష్టం తెలుసుకోకుండా ప్రకటనలు చేస్తే ఆగ్రహ జ్వాలలు చవిచూడాల్సి వస్తుందని ఆయన మండిపడ్డారు.
 
 కాంగ్రెస్ తీరు చూస్తుంటే భాషాప్రయుక్త రాష్ట్రాలను ప్రాంతాలుగా, కులాలుగా, మతాలుగా చివరకు జిల్లాను ఒక రాష్ట్రంగా చేసినా ఆశ్చర్యపోనక్కలేదన్నారు. చంద్రబాబు రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చి ఇప్పుడు మొసలికన్నీరు కార్చుతూ ఆత్మద్రోహ యాత్రను చేస్తున్నారని బాలరాజు ఎద్దేవా చేశారు. సమైక్యవాదులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని ప్రకటించారు. పట్టణ కన్వీనర్ చనమాల శ్రీనివాస్, వామిశెట్టి హరిబాబు, పోల్నాటి బాబ్జి, మంగరామకృష్ణ, అడబాల రాంబాబు, డి.మధు, పాలపర్తి శ్రీనివాస్, చిన్నంగాంధీ, దుగ్గిరాల బలరామకృష్ణ పాల్గొన్నారు. 
 
 65 కిలోమీటర్ల మేర ట్రాక్టర్ల ర్యాలీ 
 కొయ్యలగూడెం : సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం శనివారం రైతన్నలు జీలుగుమిల్లి నుంచి తాళ్లపూడివరకూ స్టేట్‌హైవేపై 65 కిలోమీటర్లమేర ట్రాక్టర్లర్యాలీ నిర్వహించారు. డీసీసీబీ మాజీ ఛైర్మన్ కరాటం రాంబాబు, జిల్లా జేఏసీ సభ్యుడు చిన్నం గాంధీ ర్యాలీని ప్రారంభించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు ఈ కార్యక్రమానికి సారథ్యం వహించారు. మట్టా లక్ష్మీపతి, గొడ్డటి నాగేశ్వర్రావు ఆధ్వర్యంలో రైతులు తమ ట్రాక్టర్లతో పాల్గొన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మాటూరి నాగేశ్వర్రావు, ఉపాధ్యక్షుడు బొలుసు నాగేశ్వర్రావు, బయ్యనగూడెంలో ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ మద్దు బాలనాగేశ్వర్రావు, కంభంపాటి బుజ్జిబాబు, రైతులు పాల్గొన్నారు. మొత్తంగా 400 వందల ట్రాక్టర్లతో వెయ్యిమందికిపైగా రైతులు పాల్గొన్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement