కామ్రేడ్ కహానీ | Comrade story | Sakshi
Sakshi News home page

కామ్రేడ్ కహానీ

Jan 26 2014 4:21 AM | Updated on Aug 29 2018 4:16 PM

నల్లగొండ జిల్లా పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది కమ్యూనిస్టులు... తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతో అదే కమ్యూనిస్టులు త్యాగాలకు..

 నల్లగొండ జిల్లా పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది కమ్యూనిస్టులు... తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతో అదే కమ్యూనిస్టులు త్యాగాలకు.. నీతికి.. నిజాయితీకి.. నిబద్ధతకు.. మొక్కవోని కార్యదీక్షకు మారుపేరుగా నిలిచిన వైనం.. కానీ రోజులు మారాయి.. పరిస్థితులూ మారాయి.. కమ్యూనిస్టుల్లోనూ అన్య ధోరణులు మొదలయ్యాయి.. పెడదోవ పట్టే నేతలు తయారయ్యారు.. ఆ పార్టీలోనూ ‘కుల’ రాజకీయాల కంపు కమ్యూనిస్టుల అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. అలాంటి ఉదంతమే ఒకటి తెరపైకి వచ్చింది.  సీపీఎంకి చెందిన ఓ సీనియర్  నాయకుడి వ్యవహార శైలి చర్చనీయాంశమవుతోంది..!!
 
 సాక్షిప్రతినిధి, నల్లగొండ : సమైక్య నినాదాన్ని భుజాన ఎత్తుకుని మెజారిటీ వర్గాలకు సీపీఎం దూరమైందన్న అభిప్రాయం జిల్లాలో బలంగా ఉంది. పార్టీ జాతీయ విధానంలో అది భాగమే అయినా, జిల్లావ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ  ఉద్యమంలో భాగస్వామ్యం కాలేక, పార్టీ విధానాలను తోసిరాజని వ్యవహరించలేక ఆ పార్టీ జిల్లా కేడర్ తర్జనభర్జనలు పడింది. కొన్ని అనుబంధ సంఘాల్లో కొంత చీలికా వచ్చింది. అదే సమయంలో  వివిధ కారణాల నేపథ్యంలో పార్టీలోని కొందరు నేతల మధ్య అసలే పొసగడం లేదన్న అభిప్రాయమూ బలంగా వ్యక్తమవుతోంది. ఇపుడు అదే వ్యవహారం తెరపైకి వచ్చి సంచలనం రేపుతోంది.  ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సహజంగానే ఏ పార్టీలోని సంస్థాగత వ్యవహారాలకైనా ప్రాధాన్యం ఉంటుంది.
 
 తెరపైకి సీపీఎం అంతర్గత వ్యవహారాలు
 సీపీఎంలోనూ జరుగుతున్న అంతర్గత వ్యవహారాలపై రకరకాల ప్రచారాలు తెరపైకి వస్తున్నాయి. సీపీఎంకు చెందిన ఓ సీనియర్ నేతపై పరోక్షంగానే క్రమశిక్షణ వే టే వేశారని వినికిడి. జిల్లా కమిటీ సదరు నేతపై తీవ్రమైన అభియోగాలను పార్టీ వేదిక లపై బహిరంగంగానే పెట్టడంతో ఆ నాయకుడు రాష్ట్ర నాయకత్వానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక వ్యవహారాలు, ఇతరత్రా ఆరోపణలతో పాటు,  కుల రాజకీయ కుంపట్లు రాజేస్తున్నారన్న తీవ్రమైన అభియోగాలే ఆ నేతపై మోపారని సమాచారం. వీటికి సమాధానం చెప్పుకోవాల్సింది పోయి, అసలు పార్టీనే వీడాలన్న ఆలోచనకు ఆ నాయకుడు వచ్చాడని తెలుస్తోంది. దీనిలో భాగంగానే సదరు నేత ప్రత్యామ్నాయాల వెదుకులాటలో ఉన్నారని అంటున్నారు.
 గతంలో కాంగ్రెస్‌లో చేరేందుకు యత్నం..
 
 ప్రస్తుతం టీడీపీ వైపు..
 విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం మేరకు సీపీఎంకు చెందిన ఆ సీనియర్ నాయకుడు ఇక అట్టే కాలం పార్టీలో కొనసాగేలా లేరని తెలుస్తోంది. గతంలోనే, ఆయన ఓ మారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే ప్రయత్నం చేసినా, అది కార్యరూపం దాల్చక పోవడంతో ఇన్నాళ్ల పాటు సీపీఎంలోనే కొనసాగారు. ఇపుడు ఎన్నికలు దగ్గరవుతున్న తరుణంలో అనువైన ఁప్లాట్‌పాంరూ. వెదుక్కునే పనిలో ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
 
 తెలుగుదేశం అధినేత  చంద్రబాబునాయుడితో ఉన్న సంబంధాల ఆధారంగా జిల్లాలో ఆ పార్టీ అభ్యర్థిగా తెరపైకి రావాలని తెరవెనుక ప్రయత్నాలతో పావులు కదుపుతున్నారని వినికిడి. తాను పార్టీ మారడమే కాకుండా, తన అజమాయిషీలో ఉన్న మరికొందరిని ైసైతం బయటకు తీసుకుని వస్తానని, కాకుంటే తనకు హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజవర్గంలో పోటీ చేసే అవకాశం కల్పించాలని కండీషన్ పెట్టారని సమాచారం. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ప్రతిపాదనకు ససేమిరా అన్నారని, కాకుంటే, నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేసేందుకు అవకాశం ఇస్తామని మాటిచ్చారని తెలిసింది. జిల్లాలో తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్న టీడీపీకి సదరు సీపీఎం నేత రాకవల్ల పెద్దగా ఒరిగేది ఏమీలేదని భావించడం, బీసీ వర్గానికి  చెందిన వంగాల స్వామిగౌడ్‌ను ఇప్పటికే హుజూర్‌నగర్ ఇన్‌చార్జ్‌గా ప్రకటించినందున ఆయన్ను మార్చడం సరికాదన్న అభిప్రాయంతోనే పార్టీ మారి రావాలనుకుంటున్న సీపీఎం నేతకు నో చెప్పారని ప్రచారం జరుగుతోంది. అయితే, టీడీపీకి పార్లమెంటు సభ్యులుగా పోటీ చేసేందుకు అభ్యర్థుల కొరత కనిపిస్తోంది.
 
 ఈ కారణంగానే ఆ సీపీఎం నేతను నల్లగొండ పార్లమెంటు సీటుకు పోటీ చేస్తే, పార్టీలో చేర్చుకుంటామని బాబు సమాధానం ఇచ్చారని చెబుతున్నారు. మొత్తానికి సీపీఎం వివిధ పదవుల్లో పనిచేసిన సదరు సీనియర్ నేత, సొంత పార్టీలోనే ఆరోపణలు ఎదుర్కోవడం, సమాధానం చెప్పుకోలేక, తన దారి తను చూసుకోవాలనుకుంటున్నారని అని విశ్లేషిస్తున్నారు. ఇక, రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎన్నెన్ని సంచలనాలు చోటు చేసుకుంటాయో, ఏ నాయకుడు ఏ పార్టీ తీర్థం పుచ్చుకుంటారో,  ఏ పార్టీ నేత, ఏ పార్టీ నుంచి ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటారో కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement