ఖాకీ కావరంపై కన్నెర్ర!

Compliant Against Ongole Taluka CI Ganga Venkateshwarlu - Sakshi

ఒంగోలు తాలూకా సీఐ గంగా వెంకటేశ్వర్లుపై ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు

డీజీపీ కార్యాలయంతో పాటు గుంటూరు రేంజి ఐజీ రాజీవ్‌కుమార్‌ మీనాకు కూడా..

ఆధారాలతో సహా నివేదించిన వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గంగాడ

సాక్షి, ఒంగోలు సిటీ: మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు నానా దుర్బాషలాడిన ఒంగోలు తాలూకా సీఐ గంగా వెంకటేశ్వర్లుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గంగాడ సుజాత ఎన్నికల కమిషనర్‌ గోపాలకృష్ణ ద్వివేదికి ఫిర్యాదు చేశారు. శుక్రవారం అమరావతిలో ఎన్నికల కమిషనర్‌ కార్యాలయంలో పార్టీ నాయకులతో ఆమె ఆయన్ను కలిశారు. సీఐ అనుచితంగా ప్రవర్తించిన తీరు..బెదిరింపులు..దౌర్జన్యానికి సంబంధించిన ఇతర ఆధారాలు, సీడీలతో సహా కమిషనర్‌కు సుజాత అందజేశారు. తాను ఎస్సీ మహిళనని, తనను పది మందిలో, నడిబజారులో సీఐ అనరాని మాటలు అన్నారని ఆమె కమిషనర్‌ ఎదుట చెప్పారు.

గురువారం ఒంగోలు మంగమూరు రోడ్డులోని ఓ అపార్టుమెంట్‌ వద్ద ఎన్నికల ప్రచారంలో ఉండగా సీఐ గంగా వెంకటేశ్వర్లు తన సిబ్బందితో వచ్చి అసభ్యకర పదజాలంతో తనను దూషించారని గంగాడ సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలతో ప్రచాం చేస్తున్న నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకుందన్నారు. అక్కడున్న మహిళలను భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీని వెనకేసుకొచ్చి తనపై దౌర్జన్యంగా వ్యవహరించారని ద్వివేదికి సుజాత ఫిర్యాదు చేశారు. ప్రశ్నించినందుకు నడి బజారులో జీపు ఎక్కండంటూ దౌర్జన్యం చేశారన్నారు. సీఐతో గౌరవంగా మాట్లాడుతున్నా ఆయన మాత్రం కక్ష సాధింపుగా వ్యవహరించారన్నారు.

దళిత మహిళనని కూడా చూడకుండా పలువురి సమక్షంలో అసభ్యంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కింది స్థాయి సిబ్బంది ఇది తప్పని వారించినా ఆయన అదుపులోకి రాలేదన్నారు. అక్కడే ఉన్న పార్టీ మహిళా విభాగం ఒంగోలు నియోజకవర్గ నేత బైరెడ్డి అరుణ కలుగజేసుకుని సీఐ చేష్టలను ప్రశ్నిస్తే ఆమె పట్ల కూడా సీఐ అనుచితంగా ప్రవర్తించారని సుజాత ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. సీఐ వ్యవహరించిన తీరుకు సంబంధించిన ఆధారాలు, సీడీలు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వినయ్‌చంద్‌కు అందజేశామన్నారు. తాలూకా సీఐ గంగా వెంకటేశ్వర్లుపై గతంలోనూ ఎన్నో ఆరోపణలు ఉన్నాయని, బాధితులు ఎందరో తమ గోడు వినిపించుకున్నా తనకు ఉన్న పలుకుబడితో వాటి నుంచి తప్పించుకున్నాడని సుజాత ఆరోపించారు.

తక్షణం సీఐని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆయన్ను ఇలాగే కొనసాగిస్తే అరాచకాలు జరుగుతాయని, ఒంగోలులో ఆయన నిర్వహించే ఏకపక్ష విధులతో సమస్యలు వస్తాయని ద్వివేదీకి వివరించారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని గంగాడ సుజాతకు ఎన్నికల కమిషనర్‌ హామీ ఇచ్చారు. గుంటూరు రేంజి ఐజీ రాజీవ్‌కుమార్‌ మీనాతో పాటు, డీజీపీ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశారు. గంగా వెంకటేశ్వర్లుపై చర్యలు తీసుకోవాలని కోరారు. గంగాడ సుజాతతో పాటు వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి, బైరెడ్డి అరుణ, స్వామిరెడ్డి పాల్గొన్నారు.

తొలి నుంచీ వివాదాస్పదమే..
ఒంగోలు తాలూకా సీఐ గంగా వెంకటేశ్వర్లు తొలి నుంచీ వివాదాస్పదంగానే విధులు నిర్వర్తిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ ప్రతిపక్ష పార్టీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ప్రతీ అంశంలో ఆయన తాను పోలీసు అధికారినన్న సంగతి మరిచి అధికార పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు. గతంలో వైఎస్సార్‌ సీపీ పిలుపులో భాగంగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఒంగోలు రైల్వేస్టేషన్‌లో రైలురోకో చేస్తున్న అప్పటి పార్టీ కొండపి నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు పట్ల అనుచితంగా ప్రవర్తించి సీఐ గంగా వెంకటేశ్వర్లు టీడీపీ మనిషిగా అప్పుడే ముద్రవేసుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top