కదిలించిన ‘ఉప్పునీరు’

Collector Orders Issued On The Namidiwada Village In Vishakapatnam - Sakshi

విప్‌ చేయని పని..చేసి చూపించిన ‘సాక్షి’

కిడారి ఊరికి అధికారుల క్యూ

ఉదయమే స్పందించిన కలెక్టర్‌ ప్రవీణ్‌

ఆయన ఆదేశాలతో నడిమివాడకు వెళ్లిన ఎండీవో

ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ సైతం గ్రామ సందర్శన

ఉప్పు నీటితోపాటు ఇతర సమస్యల పరిశీలన

గ్రావిటీ పథకం తక్షణ పునరుద్ధరణకు హామీ

పక్కా ఇళ్లు, అంగన్‌వాడీ కేంద్రం..అర్హులైనవారికి పింఛన్లు ఇస్తామన్న అధికారులు

పుట్టిన ఊరిని ప్రభుత్వ విప్‌ కిడారి సర్వేశ్వరరావు పట్టించుకోలేదు.. ఉద్ధరిస్తాడనుకుంటే కష్టాల దారిలో నిర్లక్ష్యంగా వదిలేయడంతో సమస్యలతో సావాసం చేస్తున్న నడిమివాడ గ్రామస్తుల దయనీయ దుస్థితిపై సాక్షి ప్రచురించిన కథనంపై ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. ప్రభుత్వ పథకాలేవీ వారి దరి చేరలేదన్న విషయాన్ని తెలుసుకున్న కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌.. తక్షణం గ్రామానికి వెళ్లి ప్రజా సమస్యలపై సమగ్ర నివేదిక రూపొందించాలంటూ మండల అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాలతో స్థానిక అధికారులు గ్రామాన్ని హుటాహుటిన సందర్శించారు. నడిమివాడలో ఉండే ప్రతి సమస్యనూ సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని కలెక్టర్‌ సాక్షికి తెలిపారు.

విశాఖసిటీ, పెదబయలు: ప్రభుత్వ విప్‌ కిడారి సర్వేశ్వరరావు స్వగ్రామంలో గిరిజన కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ‘విప్‌ ఊరు.. ఉప్పు నీరు’ అనే శీర్షికన సోమవారం ‘సాక్షి’ లో ప్రచురించిన కథనంపై కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ స్పందించారు. గిన్నెలకోట పంచాయితీ నడిమివాడ గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సాక్షిపత్రికలో చదివిన ఆయన మండల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ఇబ్బందులు, తాగునీటి సమస్యతో పాటు పింఛన్‌ కష్టాలు, పౌష్టికాహార లోపం, సాగునీటి కష్టాలకు సంబంధించిన అన్ని వివరాలూ క్షేత్రస్థాయిలో పరిశీలించి అందించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ ఆదేశాలతో ఎంపీడీవో వసంతరావు నాయక్‌ సోమవారం హుటాహుటిన నడిమివాడ గ్రామాన్ని సందర్శించారు.

గ్రామస్తులు తాగుతున్న ఊట నీటిని, గ్రామంలో ప్రభుత్వం ద్వారా పథకాలు అందుతున్నాయా లేదా అనే వివరాల గురించి అ డిగి తెలుసుకున్నారు. గ్రామంలో 9 కుటుంబాలు ఉన్నా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎన్‌టీఆర్‌ పక్కా గృహాలు మంజూరు చేయడం లేదని, మట్టి ఇళ్లల్లో ఉంటూ ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల పైకప్పు పెంకులు పగిలిపోతే పాలిథిన్‌ టార్ఫాలిన్‌ కవర్లు కట్టుకుని  నివాసం ఉంటున్నామంటూ గోడు వెలి బుచ్చారు. అర్హులైన నిరుపేదలకు రేషన్‌కార్డులు ఇవ్వడం లేదంటూ ఫిర్యాదు చేశారు. గ్రామానికి వచ్చేందుకు సరైన రహదారి మార్గంలేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ ఏకరువుపెట్టారు. గ్రామ సమీపంలో గెడ్డకు కల్వర్టు నిర్మాణం చేస్తే.. ఉపాధి కోసం ఆవలి ప్రాంతాలకువెళ్లే మార్గం సుగమమవుతుందని ప్రజలు తెలిపారు. పిల్లలకు పౌష్టికాహారం అం దించేందుకు గ్రామానికి మినీ అంగన్‌వాడీ కేంద్రం మంజూరు చేయాలని కోరారు. నడిమివాడ, గుండాలగరువు

గ్రామాల పిల్లలు, గర్భిణులు, బాలింతలు ఇంజరి పంచాయతీ చెందిన మల్లెపుట్టు గ్రామంలోని అం గన్వాడీ కేంద్రానికి వెళ్లి ఫీడింగ్‌ సరుకులు తీసుకొ చ్చేందుకు నరక యాతన అనుభవిస్తున్నారని ఎం పీడీవో ఎదుట  ఆవేదన వ్యక్తంచేశారు. అలాగే గ్రామంలో పంట భూములకు నీరందించేందుకు సరియాల గెడ్డ సమీపంలో, కొండవాలు గెడ్డ ప్రాం తాల్లో చెక్‌డ్యాంలు మంజూరు చేయాలని గ్రామస్తులు విన్నవించుకున్నారు. ఉపాధి పొందేందుకు కాఫీ మొక్కలు పంపిణీ చేయాలని కోరారు. మరోవైపు..  ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రవి పట్టన్‌శెట్టి సాక్షి కథనంపై స్పందిస్తూ గ్రామంలో తాగునీటిసమస్య పరిష్కరించేందుకు మంచినీటి పథకం ఏర్పాటు చెయ్యాలని ఆర్‌డబ్లు్యఎస్‌ విభా గం అధికారులను ఆదేశించారు. 

ఆయన ఆదేశాల మేరకు నడిమివాడ గ్రామంలో ఆర్‌డబ్లు్యఎస్‌ సైట్‌ ఇంజనీర్‌ మత్స్యలింగం సోమవారం  పర్యటించా రు. గ్రామంలో సత్యసాయి సేవా సంస్థ నిర్మించిన గ్రావిటీ పథకం నిరుపయోగంగా ఉండటాన్ని గమనించి ప్రాజెక్టు డైరెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే  మరమ్మతులు చేసి పథకాన్ని అందుబాటులో తెచ్చేందుకు వెలుగు పథకం ద్వారా నిదులు కేటాయించాలని ఐటీడీఏ పీవో ఆదేశించారని ఆర్‌డబ్లు్యఎస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీ ర్‌ రాంప్రసాద్‌ తెలిపారు. పెదబయలు ఆర్‌డబ్లుఎస్‌ జేఈ జగదీష్‌ సైతం నడిమివాడ గ్రామాన్ని సందర్శించి వాటర్‌ స్కీం మరమ్మతుల కోసం అయ్యే అంచనాల్ని రూపొందించి ఒకవారంరోజుల్లో గ్రావిటీ స్కీంని వినియోగంలోకి తీసుకు వస్తామని తెలిపారు. ఎమ్మెల్యే ఇచ్చిన హామీలతో పాటు గ్రామాన్నే మరిచిపోయారు.. మీరలా కాకూడదంటూ ఎంపీడీవోని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.

గ్రామానికి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి : ఎంపీడీవో వసంతరావు నాయక్‌
నడిమివాడ గ్రామానికి తాగునీరు, పక్కా గృహాలు , రోడ్డు, కల్వర్టు సమస్యలు ఉందని ఎంపీడీవో వి.వసంతరావునాయక్‌ తెలిపారు. గ్రామంలో 3 వేల మీటర్లు దూరంలో ఉన్న అంబలిమామిడి కొండ ప్రాంతం నుంచి గ్రావిటీ పథకం మంజూరు  చేయడం జరుగుతుందని, గ్రామ సమీపంలో గెడ్డకు కల్వర్టుకు ప్రతిపాధనలు పంపిస్తామన్నారు. గ్రామంలో 9 కుటుంబాలకు  ఎన్‌టీఆర్‌ గృహాలు మంజూరు  చేస్తామని, నడిమివాడ, గుండాలగరువు గ్రామాలకు కలిపి అంగన్‌వాడీ కేంద్రం మంజూరు చేస్తామని తెలిపారు.  ఉపాధి పథకం ద్వారా చెక్‌డ్యాంలు మంజూరు చేస్తామని, అర్హులకు పింఛన్లు, గ్రామంలో డ్వాక్రా సంఘానికి పçసుపు కుంకుమ డబ్బులతో పాటుగా  బ్యాంకు రుణాలు అందే విధంగా సంబంధిత ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తానని వివరించారు. ఎంపీడీవోతో పాటు డివిజన్‌ సర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షుడు పాంగి సింహాచలం  పంచాయతీ కార్యదర్శులు నాగేశ్వరరావు, కాంతరాజు గ్రామస్తులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top