రైతన్నకు తీపి కబురు

Co-operative Sugar Factories Will Be Reopen - Sakshi

ఆమదాలవలస సుగర్స్‌కు మళ్లీ ఊపిరి!

అధికారంలోకి వచ్చిన వెంటనే సానుకూల సంకేతాలు

సాక్షి, శ్రీకాకుళం: రోజుకు 1,250 టన్నుల క్రషింగ్‌ సామర్థ్యంతో దాదాపు పదివేల మంది రైతులకు, ప్రత్యక్షంగా పరోక్షంగా మరో రెండు మూడు వేల మంది కార్మికులు, ఉద్యోగుల జీవితానికి ఒకప్పుడు భరోసాగా ఉన్న ఆమదాలవలస చక్కెర కర్మాగారానికి చెల్లుచీటి రాసేసింది టీడీపీ ప్రభుత్వ హయాంలోనే! నాడు జిల్లాకే తలమానికంగా ఉన్న ఈ ఫ్యాక్టరీని సహకార రంగ చట్టాన్ని మార్చేసి మరీ వేలంవేసి అమ్మేశారు! ఇది వాస్తవానికి జిల్లాలోని 9,374 మంది వాటాదారులతో సహకార రంగంలో ఆమదాలవలస పట్టణానికి ఆనుకొని 1962లో ప్రారంభమైంది. 1990వ దశకం వరకూ బాగానే నడిచింది. తర్వాత నష్టాలు మొదలయ్యాయి. వాటిని సాకుగా చూపించి 2001లో నాటి చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్‌ జపం మొదలెట్టింది. వాటాదారులు, కార్మికులు, చివరకు కర్మాగార నిర్వహణ మండలి (బోర్డు) తీవ్రంగా వ్యతిరేకించినా పునరాలోచించలేదు.

2018 జూన్‌ 28
ఆమదాలవలస మండలంలోనే జరిగిన ఏరువాక ప్రారంభ కార్యక్రమానికి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఏరువాకలో తమకేదో వరాల జల్లు కురిపిస్తారనుకుంటే నోట చేదు గుళికలు వేశారు. ‘ఆమదాలవలస చక్కెర కర్మాగారాన్ని తెరిచే పరిస్థితి లేదు. ఫ్యాక్టరీ భూమిలో ఐటీ పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేస్తాం’ అని కుండబద్దలు కొట్టారు. 2001లోనే ఈ ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టిన ఆయనే 2014 ఎన్నికల ప్రచారం సమయంలో పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడం గమనార్హం.

2019 జూన్‌ 10 
నూతన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో తొలి కేబినెట్‌ సమావేశం జరిగింది. ఆయన తీసుకున్న పలు సంచలన నిర్ణయాల్లో మూతపడిన సహకార రంగ చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ కూడా ఒకటి. గత ఏడాది నవంబరు నెలలో ఆమదాలవలస మీదుగా సాగిన ప్రజాసంకల్పయాత్రలో రైతులకు మాట ఇచ్చారు. సహకార రంగంలో చక్కెర కర్మాగారాలను తిరిగి తెరిపిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కేబినెట్‌ తొలి సమావేశంలోనే సానుకూల సంకేతాలు ఇచ్చారు.

భారం తడిసిమోపెడు...
2001లో టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ నాడు చక్కెర కర్మాగారం డైరెక్టరుగా ఉన్న లక్ష్మీనాయుడు హైకోర్టును ఆశ్రయించారు. సహకార చట్టం ప్రకారం కోఆపరేటివ్‌ సుగర్‌ ఫ్యాక్టరీ ఆస్తులు అమ్మడానికి ప్రభుత్వానికి అధికారం లేదని న్యాయస్థానం ఇచ్చిన తీర్పు నుంచి తప్పించుకోవడానికి ఏకంగా ఆ చట్టంలోనే మార్పులు చేసింది చంద్రబాబు సర్కారు! వేలంలో జీఎమ్మార్‌ అనుబంధ సంస్థ అంబికా లామినేషన్స్‌ రూ.6.20 కోట్లకు దక్కించుకుంది. అది కూడా కర్మాగారాన్ని నడపలేదు సరికదా పూర్తిగా మూతవేసింది. ఈ బదలాయింపును సవాలు చేస్తూ కో–ఆపరేటివ్‌ సభ్యులు, రైతులు మరోసారి హైకోర్టును ఆశ్రయించి 2016 మార్చిలో సానుకూలంగా తీర్పు సాధించారు.

కొనుగోలు సంస్థతో ఆర్థిక లావాదేవీలను పరిష్కరించేందుకు ఐఏఎస్‌ అధికారి కె.సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. ఆ ప్రకారం చక్రవడ్డీతో కలిపి మొత్తం రూ.22 కోట్లను అంబికా లామినేషన్స్‌కు ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) ద్వారా చెల్లించాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఫ్యాక్టరీకి చెందిన దాదాపు 74 ఎకరాల భూమి ఏపీఐఐసీ ఆధీనంలోకి రావడంతో అక్కడ ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటు చేస్తానని గత ఏడాది జూన్‌లో జరిగిన ఏరువాక కార్యక్రమంలో చంద్రబాబు ప్రకటించి రైతులను నిరాశకు గురిచేశారు.

డామిట్‌ కథ అడ్డం తిరిగింది...
విశాఖ–హౌరా రైల్వే మార్గంలో, అలాగే జాతీయ రహదారికి సమీపంలోనున్న ఆమదాలవలస పట్టణం దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ పట్టణానికి ఆనుకొనే ఉన్న ఫ్యాక్టరీకి చెందిన 74 ఎకరాలపైనా టీడీపీ నాయకులు కన్నేశారు. మార్కెట్‌ రేటు ప్రకారం దాదాపు రూ.600 కోట్ల విలువైన ఈ భూమిని హస్తగతం చేసుకొనేందుకు చురుగ్గా పావులు కదిపారు. అదే సమయంలో ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆమదాలవలస వచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రైతులు కలిశారు. చక్కెర కర్మాగారాన్ని రూ.30 కోట్ల నుంచి రూ.50 కోట్ల వ్యయంతో పునరుద్ధరిస్తే ఆమదాలవలస, శ్రీకాకుళం, నరసన్నపేట, పాతపట్నం, పాలకొండ నియోజకవర్గాల్లో రైతులకు మేలు జరుగుతుందని విన్నవించారు. వంశధార ప్రాజెక్టు పూర్తయితే సాగునీరు కూడా పుష్కలంగా లభిస్తుందని, చెరకు సాగుకు కలిసివస్తుందని వారి ఆశ. జగన్‌ నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడంతో టీడీపీ నేతల పథకం పారలేదు. సహకార రంగంలో మూతపడిన చక్కెర కర్మాగారాల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కేబినెట్‌ తొలి సమావేశంలోనే నిర్ణయించడం రైతులకు తీపికబురే!

రైతుల కల నెరవేరనుంది
మూతబడిన చక్కెర ఫ్యాక్టరీని తెరిపించుకోవాలనే రైతుల కల యువ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో సాధ్యమవుతోంది. ఆయన ఆదేశాలు శుభ పరిణామం. ఆమదాలవలసకు పూర్వవైభవం రానుంది. వరి సాగుతో నష్టపోతున్న రైతులు చెరుకు ప్రత్యామ్నాయంగా సాగుచేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.  
– చల్లా సింహాచలం, రైతు, రామచంద్రాపురం, ఆమదాలవలస మండలం

రాజన్న రాజ్యం చూడబోతున్నాం....
మంత్రివర్గ తొలి సమావేశంలోనే రైతన్నలకు జగన్‌ తీపి కబురు వినిపించారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చి గతంలో చాలా మంది నేతలు గెలిచినా తర్వాత చక్కెర ఫ్యాక్టరీ కోసం పట్టించుకోలేదు. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం జగనన్న సానుకూలంగా స్పందించారు. మళ్లీ రాజన్న రాజ్యం చూడబోతున్నాం. 
– అన్నెపు నీలాద్రిరావు, రైతు, తొగరాం, ఆమదాలవలస మండలం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top