అగ్రిగోల్డ్‌ బాధితుల కన్నీరు తుడిచేలా..

CM YS Jaganmohan Reddy to distribute deposits for Agrigold Victims - Sakshi

డిపాజిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టనున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి   

రేపటి నుంచి రూ.10 వేలలోపు డిపాజిట్ల చెల్లింపులు  

సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్‌ సంస్థలో డిపాజిట్లు చేసి, నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. వారికోసం కేటాయించిన నిధులను పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది. గుంటూరు పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌లో ఈ నెల 7వ తేదీన నిర్వహించే సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా అగ్రిగోల్డ్‌ బాధితులకు డబ్బుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. రూ.10 వేలలోపు డిపాజిట్లు చేసిన వారికి తొలుత చెల్లింపులు చేస్తారు. మలిదశలో రూ.20 వేలలోపు డిపాజిట్లు చెల్లించేందుకు కసరత్తు ప్రారంభించారు. ప్రతి బాధితుడికీ న్యాయం చేసేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టనుంది. 

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వైఎస్‌ జగన్‌ 
తమను ఆదుకోవాలంటూ వేలాది మంది అగ్రిగోల్డ్‌ బాధితులు పాదయాత్ర సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. మన ప్రభుత్వం వచ్చాక తప్పనిసరిగా న్యాయం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే బాధితులను ఆదుకునేలా మంత్రివర్గ సమావేశంలో తీర్మానం సైతం చేశారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లించేలా బడ్జెట్‌లో రూ.1,150 కోట్లు కేటాయించారు. రూ.263.99 కోట్లు విడుదల చేస్తూ అక్టోబరు 18న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తొలిదశలో రూ.10 వేల లోపు డిపాజిట్లు చెల్లించాలని భావించారు. అయితే, అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలంలో జాప్యం జరుగుతున్నందున రూ.20 వేల లోపు డిపాజిట్లు సైతం చెల్లించి వీలైనంత ఎక్కువ మందిని ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సెల్‌ అథారిటీ(డీసీఎల్‌) ప్రతిపాదనల ప్రకారం జిల్లాల వారీగా రూ.10 వేలలోపు డిపాజిట్ల చెల్లింపులు జరగనున్నాయి. రాష్ట్రంలో 13 జిల్లాల్లో తొలి విడత రూ.10 వేల లోపు డిపాజిట్లు మొత్తం రూ.263,99,00,983 చెల్లించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

రూ.6,380 కోట్లకుపైగా వసూళ్లు 
విజయవాడకు చెందిన అవ్వా వెంకటరామారావు, మరికొందరు డైరెక్టర్లతో కలిసి 1995లో ఏర్పడిన ‘అగ్రిగోల్డ్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌’ సంస్థ ఆంధ్రప్రదేశ్‌తో పాటు మరో ఏడు రాష్ట్రాల్లో 32 లక్షల మంది డిపాజిటర్ల నుంచి రూ.6,380 కోట్లకు పైగా సేకరించింది. చివరకు వారికి భూములు ఇవ్వక.. సొమ్ము తిరిగి చెల్లించకపోవడంతో పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై అప్పటి సీఎం  చంద్రబాబు పట్టించుకోలేదు. పైగా ఆ పార్టీ పెద్దలు సంస్థ ఆస్తులు కొట్టేసేందుకు కుట్రలు సాగించారు. దీంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ‘అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ’ ఏర్పాటై ఉద్యమాలు నిర్వహించింది.

బాధితుల జీవితాల్లో వెలుగులు
‘‘సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ అగ్రిగోల్డ్‌ బాధితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. గత ప్రభుత్వం అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవాల్సింది పోయి మానసిక క్షోభకు గురిచేసింది. అప్పటి ప్రభుత్వ పెద్దలు అగ్రిగోల్డ్‌కు చెందిన కొన్ని విలువైన ఆస్తులను కారుచౌకగా కొట్టేశారు. టీడీపీ నాయకులు అగ్రిగోల్డ్‌ ఆస్తులపై చూపిన శ్రద్ధను బాధితులపై చూపలేదు’’  
– లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్‌సీపీ అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ రాష్ట్ర కన్వీనర్‌  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top