కువైట్‌ నుంచి వలస కార్మికులను రప్పించండి

CM YS Jagan Writes Letter to Subrahmanyam Jaishankar about Migrant workers - Sakshi

విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌కు సీఎం జగన్‌ లేఖ

ఖర్చులు భరించడానికి కువైట్‌ సిద్ధం.. ఎగ్జిట్‌ క్లియరెన్స్‌ కూడా ఇచ్చింది

నేరుగా విశాఖ, విజయవాడ, తిరుపతికి విమానాలు ఏర్పాటు చేయాలి

సాక్షి, అమరావతి: కువైట్‌లో చిక్కుకుపోయిన రాష్ట్రానికి చెందిన వలస కార్మికులను స్వదేశానికి రప్పించేందుకు అవసరమైన విమానాలు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌కు లేఖ రాశారు. కువైట్‌లోని వలస కార్మికుల కోసం విశాఖ, విజయవాడ, తిరుపతికి నేరుగా విమానాలు ఏర్పాటు చేయాలని కోరారు. సీఎం లేఖలోని అంశాలు ఇలా ఉన్నాయి.

ఆశతో ఎదురు చూస్తున్నారు..
► విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కు రప్పించేందుకు ‘వందే భారత్‌’ మిషన్‌ పేరుతో మీరు చేపడుతున్న చర్యలు ప్రశంసనీయం. దీని ద్వారా పలు దేశాల్లో చిక్కుకుపోయిన వేలాది మంది భారతీయులు సొంత ఖర్చులతో స్వదేశానికి తిరిగి వస్తున్నారు.  
► అదే కోవలో గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి కోల్పోయి, అక్కడే చిక్కుకుపోయిన వేలాది మంది వలస కార్మికులు కూడా స్వదేశానికి తిరిగి రావడానికి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. వాళ్లకు చార్జీలకు కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. 
► అయితే కువైట్‌లో ఆమ్నెస్టీ ద్వారా స్వదేశానికి రావడానికి అనుమతి పొందిన సుమారు 2,500 మందికి  మాత్రం ప్రయాణ ఖర్చును భరించడానికి కువైట్‌ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇమ్మిగ్రేషన్‌ రుసుము మాఫీ చేయడం ద్వారా మన దేశ రాయబార కార్యాలయం, వారందరికీ ఎగ్జిట్‌ క్లియరెన్స్‌ కూడా ఇచ్చింది.  

రెండు వారాలుగా ఇక్కట్లు 
► ప్రస్తుతం వారంతా అక్కడ స్థానికంగా ఏర్పాటు చేసిన శిబిరాల్లో తల దాచుకుంటున్నారు. కనీస సదుపాయాలు కూడా లేకుండా రెండు వారాల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
► ఈ పరిస్థితిలో మీరు వెంటనే కువైట్‌ హై కమిషనర్‌కు సూచించి, అక్కడి అధికారులతో మాట్లాడి.. కువైట్‌ నుంచి రాష్ట్రంలోని విశాఖ, విజయవాడ, తిరుపతికి నేరుగా విమానాలు ఏర్పాటు చేసేలా చూడగలరు. 
► వలస కూలీలందరికీ ఇక్కడ అవసరమైన వైద్య పరీక్షలు చేసి, క్వారంటైన్‌కు పంపించేందుకు అన్ని సదుపాయాలతో సిద్ధంగా ఉన్నాం. జిల్లా కేంద్రాల్లో క్వారంటైన్‌ సదుపాయంతో పాటు, విదేశాల నుంచి తిరిగొచ్చే వారి కోసం తగిన వసతి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశాం.  
► అందువల్ల కువైట్‌తో పాటు ఆగ్నేయాసియా దేశాల్లో ఉన్న వలస కార్మికులను వీలైనంత త్వరగా దశల వారీగా రాష్ట్రానికి అనుమతించాలని కోరుతున్నాం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top