రెడ్‌జోన్‌ ఆసుపత్రులు సర్వసన్నద్ధం

CM YS Jagan Review Meeting With Officials On Covid-19 Prevention - Sakshi

మెడికల్‌ ప్రొటోకాల్‌ మేరకు అన్నీ అందుబాటులో ఉంచుకోవాలి 

కోవిడ్‌–19 నివారణ చర్యలపై సీఎం జగన్‌ ఉన్నత స్థాయి సమీక్ష   

టెలి మెడిసిన్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి 

కీలకమైన కాల్‌ సెంటర్ల నంబర్లను సచివాలయాల్లో ప్రదర్శించాలి 

వలస కూలీలు, యాత్రికులు, గ్రూపులు, విద్యార్థులకే అనుమతి  

వ్యక్తిగతంగా వచ్చే వారికి అనుమతి లేదన్న అధికారులు

రాష్ట్రంలో వెరీ యాక్టివ్‌ క్లస్టర్లు 65  

యాక్టివ్‌ క్లస్టర్లు  86  

డార్మంట్‌ క్లస్టర్లు 46  

గత 28 రోజులుగా కేసుల్లేని క్లస్టర్లు  50

విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి విషయంలో క్వారంటైన్‌ విధానం ఎలా ఉండాలన్న దానిపై ఇప్పటికే సూచనలిచ్చాం. గ్రామ, వార్డు సచివాలయాల వారీగా సదుపాయాలు ఉండాలని చెప్పాం. వీటిని ఇంకా ఎలా బలోపేతం చేయాలనే దానిపై దృష్టి పెట్టాలి. వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించే విషయంపై కూడా మార్గదర్శకాలు తయారు చేయాలి.   

దిశ, టెలి మెడిసిన్, వ్యవసాయం, అవినీతి నిరోధకానికి సంబంధించిన కీలక నంబర్లను ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రదర్శించాలి. వీటిని ఉపయోగించుకునే విషయమై ప్రజలందరికీ అవగాహన కల్పించాలి. 

మరో రెండు వారాల పాటు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ పొడిగించిన నేపథ్యంలో ఎక్కడి వారు అక్కడే ఉండటం మంచిది. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన కూలీలను మాత్రమే కేంద్రం అనుమతించినందున దాదాపు వారు లక్ష మంది వరకు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. వీరందరినీ క్వారంటైన్‌లో ఉంచి పరీక్షలు చేయించడం కష్టమైన పని. అందువల్ల మిగిలిన వారు సహకరించాలి.  

సాక్షి, అమరావతి: రెడ్‌ జోన్లలో ఉన్న ఆసుపత్రులను అన్ని విధాలా సన్నద్ధంగా ఉంచుకోవాలని, కచ్చితమైన మెడికల్‌ ప్రొటోకాల్‌ పాటించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. టెలి మెడిసిన్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. కీలకమైన కాల్‌ సెంటర్ల నంబర్లను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచాలని స్పష్టం చేశారు. కోవిడ్‌ నివారణ చర్యలు, వలస కూలీల తరలింపు, పరీక్షల సరళిపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పరీక్షల సరళిని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సమీక్షలో అధికారులు వెల్లడించిన అంశాలు, సీఎం జగన్‌ ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. 

కేంద్ర హోం శాఖ మార్గదర్శకాల మేరకే అనుమతులు 
► రెడ్‌ జోన్‌ పరిధిలో ఉండే ఆసుపత్రుల్లో తప్పనిసరిగా మెడికల్‌ ప్రొటోకాల్‌ పాటించాలని, వైద్య సిబ్బందికి అవసరమైన అన్ని వసతులు ఉండేలా చూసుకోవాలని సీఎం ఆదేశించారు. పీపీఈ కిట్లు, మందులు, మాస్కులు ఇతరత్రా అవసరమైన వైద్య పరికరాలు నిల్వ ఉండేలా చూసుకోవాలని సూచించారు.  
► వలస కూలీలు, చిక్కుకుపోయిన యాత్రికులు, విద్యార్థులు, గ్రూపులనే అనుమతిస్తున్నామని అధికారులు వివరించారు. వెబ్‌సైట్‌ ద్వారా అప్లై చేసుకున్న వారిని పరిశీలించి.. ఆయా రాష్ట్రాల అధికారులతో మాట్లాడి, కేంద్ర హోం శాఖ మార్గదర్శకాల మేరకే రాష్ట్రంలోకి వచ్చేందుకు అనుమతిస్తున్నామని చెప్పారు. 
► వచ్చే వాళ్లు ఎక్కడి నుంచి వస్తున్నారు.. ఆయా రాష్ట్రాల్లో వాళ్లు గ్రీన్‌ జోన్లో ఉన్నారా? ఆరెంజ్‌ జోన్లో ఉన్నారా? రెడ్‌ జోన్లో ఉన్నారా? అన్న వివరాలు కూడా సేకరిస్తున్నామని చెప్పారు. వీటిని నిర్ధారించుకుని వలస కూలీలు, చిక్కుకుపోయిన యాత్రికులు, విద్యార్థులకు అనుమతులు మంజూరు చేస్తామన్నారు. 
► స్పందన వెబ్‌సైట్‌ ద్వారానే కాకుండా వివిధ మార్గాల ద్వారా విజ్ఞప్తులు చేసుకున్న వారు కూడా ఉన్నారన్నారు. అయితే వ్యక్తిగతంగా వచ్చే వారికి అనుమతి లేదని స్పష్టం చేశారు.   కుటుంబ సర్వేలో గుర్తించిన 32,792 మందికి రేపటిలోగా (మంగళవారం) టెస్టులు పూర్తి చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. 
► ఈ సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

రికార్డు స్థాయిలో పరీక్షలు 
► రోజు వారీ పరీక్షల సామర్థ్యం 10 వేలకు పైగా పెరిగింది. ప్రతి పది లక్షల జనాభాకు రాష్ట్రంలో 2,345 పరీక్షలు. కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీలో 2,224, తమిళనాడులో 1,929, రాజస్తాన్‌లో 1,402 పరీక్షలు. 
► రాష్ట్రంలో గత 24 గంటల్లో 10,292 పరీక్షలు. ఆదివారం వరకు 1,25,229 పరీక్షలు. 
► 24 గంటల్లో 67 పాజిటివ్‌లు నమోదు. యాక్టివ్‌ కేసులు 1,093. 524 మంది డిశ్చార్జి. మొత్తంగా 1,650 కేసులు, 33 మంది మృతి.  
► రాష్ట్రంలో పాజిటివిటీ కేసుల శాతం 1.32. దేశంలో ఇది 3.84 శాతం. రాష్ట్రంలో కోవిడ్‌ మరణాల రేటు 2 శాతం. దేశంలో ఇది 3.27 శాతం.  
► రాష్ట్రంలోని 11 ల్యాబ్‌ల్లో 22 మిషన్ల ద్వారా కొనసాగుతున్న పరీక్షలు. ప్రతి జిల్లాలో 4 మిషన్లు అందుబాటులో ఉంచే యత్నం. పీరియాడికల్‌గా 3 ల్యాబ్‌లలో ఫ్యుమిగేషన్‌ (శుద్ధి చేసే ప్రక్రియ). 45 కేంద్రాల్లో 345 ట్రూనాట్‌ మిషన్ల ద్వారా కూడా పరీక్షలు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top