పోస్టుల భర్తీకి సమగ్ర కార్యాచరణ

CM YS Jagan Mandate to officials On Job Replacements In The State - Sakshi

ప్రాధాన్యత క్రమంలో అన్ని విభాగాల్లో పోస్టుల భర్తీ

అధికారుల సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

విద్య, వైద్య శాఖల్లో అవసరమైన అన్ని పోస్టులూ భర్తీ చేయాలి

ఈ నెల 21న మరోసారి సమీక్ష.. అనంతరం క్యాలెండర్‌ విడుదల

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టుల భర్తీకి సమగ్ర ప్రణాళికను రూపొందించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయా శాఖల్లోని ఖాళీలను ప్రాధాన్యత క్రమంలో భర్తీ చేసే విషయమై ఆ విభాగాలతో చర్చించాలని సూచించారు. ఆ దిశగా సమగ్ర క్యాలెండర్‌ను రూపొందించి దశల వారీగా పోస్టుల భర్తీ చేపట్టాలన్నారు. వైద్య, విద్యా రంగాల్లో అన్ని పోస్టులను వెంటనే భర్తీ చేయాలని స్పష్టం చేశారు. ఉద్యోగాల భర్తీ కోసం క్యాలెండర్‌ రూపొందించడంపై తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘విద్య, వైద్య రంగాల్లో సమూల మార్పులు రావాలి. ఆ లక్ష్య సాధనకు అవసరమైన మేరకు సిబ్బందిని నియమించాలి. తొలుత ఈ పోస్టులను భర్తీ చేయాలి’ అని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ‘ఆసుపత్రికి ఎవరైనా వెళ్తే అక్కడ అవసరమైన సిబ్బంది లేకపోతే ఆ ఆసుపత్రి నిర్వహించినా వృధానే. ఇప్పటికే నాడు–నేడు ద్వారా ఆసుపత్రులను అభివృద్ధి చేయడానికి కార్యాచరణ ప్రారంభించాం. అందుకు అనుగుణంగా డాక్టర్లు, నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు ఉండాలి. అందుకే ఆ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి’ అని సీఎం సూచించారు.

స్కూళ్లలో సిబ్బంది ఖాళీలూ భర్తీ చేయాలి
ప్రభుత్వ స్కూళ్లలో నాడు–నేడు పథకం కింద కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ మౌలిక సదుపాయాలను సమకూరుస్తున్నామని, అక్కడ సరిపడా సిబ్బంది లేకపోతే పెట్టిన ఖర్చు వృధా అవుతుందని సీఎం అన్నారు. ‘టీచర్లు సరిపడా లేకపోతే ప్రమాణాలు తగ్గుతాయి. టీచర్లనే కాకుండా ల్యాబ్‌ టెక్నీషియన్లనూ నియమించాలి. అప్పుడే స్కూళ్ల అభివృద్ధికి మనం చేపడుతున్న ఆధునికీకరణ పనులు, అమ్మ ఒడి, మధ్యాహ్న భోజనంలో నాణ్యత వంటి చర్యలకు అర్థం ఉంటుంది’ అని అభిప్రాయపడ్డారు. పోలీసు విభాగంలో వారాంతపు సెలవును ప్రకటించామని, దీనివల్ల ఆ శాఖ సామర్థ్యం తగ్గకుండా ఖాళీలు భర్తీ చేయాలన్నారు.

రెవెన్యూ విభాగంలో కూడా ప్రాధాన్యతలను అనుసరించి పోస్టుల భర్తీ చేపట్టాలని, ఈ శాఖలో సర్వే సిబ్బందికి అవసరమైన పరికరాలను సమకూర్చాలని సీఎం సూచించారు. ఇలా శాఖల వారీగా ప్రాధాన్యతలను నిర్ధారించుకొని పోస్టుల భర్తీకి కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. మూడు వారాల్లో ప్రాధాన్యత పోస్టులను నిర్ధారించి, వాటి భర్తీకి ప్రణాళిక రూపొందిస్తామని అధికారులు సీఎంకు వివరించారు. ఈనెల 21న మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. ఆ సమావేశానంతరం ఉద్యోగాల భర్తీపై కార్యాచరణను ప్రకటిస్తూ.. సమగ్ర క్యాలెండర్‌ను విడుదల చేయనున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top