నాణ్యమైన బియ్యం పంపిణీకి పకడ్బందీ చర్యలు

CM YS Jagan command On Civil Supplies Department Review - Sakshi

ఏప్రిల్‌ నుంచి దశల వారీగా అన్ని నియోజకవర్గాల్లో పంపిణీకి కసరత్తు 

పౌర సరఫరాల శాఖపై సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశం 

సాక్షి, అమరావతి : ప్యాక్‌ చేసిన నాణ్యమైన బియ్యాన్ని ఏప్రిల్‌ నుంచి దశల వారీగా అన్ని జిల్లాల్లో పకడ్బందీగా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో సేకరించిన నాణ్యమైన బియ్యం నమూనాలను ఆయన పరిశీలించారు. తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, ఆ శాఖ ఎక్స్‌ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్‌ తదితర అధికారులతో సమీక్షించారు.

పేదలకు పంపిణీ చేసేందుకు 26.63 లక్షల టన్నుల నాణ్యమైన బియ్యం అవసరమని, ఇందులో భాగంగా ఖరీఫ్, రబీ సీజన్‌లో వచ్చే ధాన్యం దిగుబడి ద్వారా 28.74 లక్షల టన్నుల బియ్యం అందుబాటులో ఉన్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. నాణ్యమైన బియ్యం పంపిణీ కోసం 30 చోట్ల 99 బియ్యం ప్యాకింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో 41, పీపీపీ పద్ధతిలో 58  ప్యాకింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

గోడౌన్ల నుండి రేషన్‌ దుకాణాలకు సకాలంలో చేరవేసేలా ప్రతి 30 నుండి 40 కిలోమీటర్ల పరిధిలో ఒక ప్యాకేజీ యూనిట్‌ అందుబాటులోకి తెస్తున్నారు. పంపిణీ కోసం క్షేత్ర స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అందుకు తగ్గట్టుగా అవసరమైన సిబ్బంది, వాహనాలు ముందుగానే ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. పర్యావరణానికి హాని జరగకుండా బియ్యం ప్యాకింగ్‌ కోసం వాడే సంచులను తిరిగి సేకరించేలా చూడాలని చెప్పారు. 

నాణ్యమైన బియ్యం పంపిణీ ఇలా.. 
ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అన్ని జిల్లాల్లో నాణ్యమైన బియ్యం పంపిణీని దశల వారీగా ప్రారంభిస్తారు. ఇప్పటికే పైలట్‌ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లాను ఎంపిక చేసి గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ఇంటింటికీ నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. మిగిలిన జిల్లాల్లో ఏప్రిల్‌ నుంచి జిల్లాకో నియోజకవర్గం చొప్పున ప్యాక్‌ చేసిన నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేలా పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top