అతని స్థాయి ఏమిటీ? అభ్యర్థిని ప్రకటించే అర్హత ఉందా...

CM Ramesh Target To Former MLA Varadarajulu Reddy - Sakshi

ప్రొద్దుటూరులో వర్గరాజకీయాలను ప్రోత్సహిస్తున్న సీఎం రమేష్‌

తాజాగా మున్సిపల్‌ అధికారులతో సమీక్ష చేపట్టిన ఎంపీ

 అనుచరులతో అడ్డుకునేందుకు విశ్వయత్నం చేసిన ఇన్‌చార్జి

∙కడపలో సమన్వయ కమిటీ సమావేశంలో భగ్గుమన్న నేతలు

సాక్షి ప్రతినిధి కడప: రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ స్థాయి పంచాయతీకి ఎక్కువ మండలానికి తక్కువ ప్రకటనతో మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి టార్గెట్‌ అయ్యారా.. ఆ మేరకే రాజకీయంగా దెబ్బకొట్టాలనే ఆలోచన తలెత్తిందా....తన కుటుంబానికి పార్టీ పగ్గాలు అప్పగించాలనే వ్యూహాత్మక ఎత్తుగడలు అవలంబిస్తున్నారా...తరచూ వివాదాస్పద ఘటనలు కావాలనే తెరపైకి తెస్తున్నారా....ఇన్‌చార్జిని విస్మరిస్తూ వైరివర్గాన్ని ప్రోత్సహించడానికి కారణం అదేనా? అని ప్రశ్నిస్తే అవుననే విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. 

పంచాయతీకి ఎక్కువ..మండలానికి తక్కువ
సీఎం రమేష్‌ పార్లమెంట్‌లో మెంబర్‌ అయినా అప్పటి సారా కాంట్రాక్టర్‌ పోట్లదుర్తి సీఎం సుబ్బానాయుడు మనవడే. ఇది జగమెరిగిన సత్యం. కాగా ‘మొగుడు కొట్టినందుకు కాదు...తోడికోడలు నవ్వినందుకు కోపం’ అన్నట్లుగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ శైలి కన్పిస్తోంది. కన్పిస్తే కాల్చివేత రోజులు వస్తాయని సీఎం రమేష్‌ను ఉద్దేశించి మంత్రి ఆది బహిర్గతమయ్యారు. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ‘సీఎం రమేష్‌ స్థాయి పంచాయతీకి ఎక్కువ, మండలానికి తక్కువ’ అలాంటి వ్యక్తిని చంద్రబాబు ప్రోత్సహించి రాజ్యసభ సీటు ఇస్తే కాంట్రాక్టు పనుల్లో కమీషన్లు తీసుకుంటూ దోపిడీ చేయడమే కాకుండా వర్గరాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని దుమ్మెత్తిపోశారు.

 మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు వాస్తవమే అయినప్పటికీ సీఎం రమేష్‌ వ్యక్తిగత స్థాయి పట్ల బహిర్గతం కావడం, మంత్రి ఆదితో కలిసిమెలిసి ఉండడంతో మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి టార్గెట్‌ అయ్యారని పరిశీలకులు పేర్కొంటున్నారు. దానికి తోడు ప్రొద్దుటూరు పట్ట ణం సమీపంలోనే పోట్లదుర్తి ఉండడంతో నియోజకవర్గంపై తన కుటుంబ సభ్యులు ఆశలు పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో వ్యూహాత్మక ఎత్తుగడ అవలంబిస్తున్నారని పలువురు భావిస్తున్నారు.

గ్రూపులతో తలబొప్పి
టీడీపీకి గ్రూపు రాజకీయాలతో తలబొప్పి కడుతోంది. శనివారం చేపట్టిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆ విషయం మరోమారు తేటతెల్లౖ మెంది. రాయచోటి మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు తనయుడు ప్రసాద్‌బాబు టీడీపీ నేతల తీరుపై ధ్వజమెత్తారు. మాకు ఏమాత్రం సమాచారం లేకుండానే నగరదర్శిని చేపడుతున్నారని, పైగా పార్టీకి చెందిన రాంగోపాల్‌రెడ్డి రాయచోటి టీడీపీ అభ్యర్థి రమేష్‌రెడ్డి అని ఎలా ప్రకటిస్తాడు, అతని స్థాయి ఏమిటీ? అసలు అభ్యర్థిని ప్రకటించే అర్హత ఉందా... ఎవడతడంటూ నిలదీశారు. 

అలాగే ఎమ్మెల్యే జయరాములు మాట్లాడుతూ గ్రూపు రాజకీయాలు ప్రోత్సహించవద్దని సీఎం స్పష్టంగా చెబుతున్నా జిల్లాలో గ్రూపు రాజకీయాలు నడుపుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా గెలుపొంది టీడీపీలోకి వచ్చిన తనపట్ల వివక్ష చూపుతూ వర్గ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీలో మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు తర్వాత తానే సీనియర్‌ను, జిల్లా అధ్యక్షుడు సమర్థవంతంగా పనిచేసినప్పటికీ తనకు పార్టీలో ప్రాధాన్యత లేకుండా కమిటీలు ఎంపిక నుంచి ఏకపక్ష చర్యలు చేపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

అలాగే కడప నేతలు సీఎం రిలీఫ్‌ పండ్‌ వ్యవహారంపై మండిపడ్డారు. అనేకమంది టీడీపీ కార్యకర్తకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ అందడం లేదని, కొంతమంది పార్టీలో చేరిన వ్యక్తులు కమీషన్లకు కక్కుర్తిపడి స్థితిమంతులకు సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా డబ్బులు ఇప్పిస్తున్నారని, పాత కడపలో ఓ కుటుంబానికి రూ.10లక్షలు ఇప్పించడమే అందుకు నిదర్శనమని రగలిపోయారు. ఎవరిస్థాయిలో వారు పార్టీలో పైచేయి సాధించాలనే తపన ఉండడంతోనే ఇలాంటి పరిస్థితి దాపురించిందని టీడీపీ సీనియర్‌ నాయకుడొకరు సాక్షితో వాపోవడం విశేషం.  
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top