సీఎం జపాన్ పర్యటనకు తొలి విడతగా రూ.1.70కోట్లు | CM Japan tour To The first phase of Rs .1.70 crore | Sakshi
Sakshi News home page

సీఎం జపాన్ పర్యటనకు తొలి విడతగా రూ.1.70కోట్లు

Jul 4 2015 3:33 AM | Updated on Sep 2 2018 3:19 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం జపాన్, హాంకాంగ్ పర్యటనకోసం తొలి విడతగా రూ.1.70 కోట్లను...

నేటి అర్ధరాత్రి 1 గంటకు విమానంలో జపాన్ పయనం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం జపాన్, హాంకాంగ్ పర్యటనకోసం తొలి విడతగా రూ.1.70 కోట్లను విడుదల చేసేందుకు ఆర్థికశాఖ శుక్రవారం ఆమోదం తెలిపింది. పర్యటన ముగిశాక మిగతా వ్యయానికి సంబంధించి ఆర్థికశాఖ నిధులను విడుదల చేయనుంది. జపాన్ పర్యటనకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని బృందం శనివారం అర్ధరాత్రి 1 గంటకు హైదరాబాద్‌నుంచి విమానంలో బయల్దేరనుంది.

సీఎం వెంట మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, ప్రభుత్వ కమ్యూనికేషన్స్ సలహాదారు పరకాల ప్రభాకర్, ఢిల్లీలో రాష్ట్రప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు, సీఎం కార్యాలయ ముఖ్యకార్యదర్శి సతీష్‌చంద్ర, మున్సిపల్, ఆర్థిక, పరిశ్రమల శాఖల ముఖ్యకార్యదర్శులు ఎ.గిరిధర్, పీవీ రమేశ్, ఎస్.ఎస్.రావత్, పరిశ్రమల మౌలిక వసతుల కల్పనశాఖ కార్యదర్శి అజయ్‌జైన్, సీఆర్‌డీఏ కమిషనర్ ఎన్.శ్రీకాంత్ వెళ్లనున్నారు.ఈ పర్యటనలో సీఎం  రాజధాని నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావాలని జపాన్ ప్రధానిని ఆహ్వానించనున్నారు. 8వ తేదీ వరకు బాబు బృందం జపాన్‌లోనే పర్యటిస్తుంది.అనంతరం 9, 10 తేదీల్లో హాంకాంగ్‌లో పర్యటిస్తుంది. 10వ తేదీ రాత్రి అక్కడ్నుంచీ బయల్దేరి హైదరాబాద్‌కు తిరిగి రానుంది.
 
జపాన్ పర్యటనలో ప్రముఖులతో భేటీ
ముఖ్యమంత్రి చంద్రబాబు తన జపాన్ పర్యటనలో పలు సంస్థల ప్రతినిధులు, ప్రముఖులతో భేటీ కానున్నారు. ఈ నెల 6వ తేదీ ఉదయం ఫ్యూజీ ఎలక్ట్రిక్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కెంజీ గోటో, సుమిటోమో మిత్సుయి బ్యాంకింగ్ కార్పోరేషన్ (ఎస్‌ఎమ్‌బీసీ), మిత్సుబిషి కార్పొరేషన్ ప్రతినిధులతో సీఎం సమావేశమవుతారు. అలాగే 7న కూడా ప్రముఖ బ్యాంకింగ్ అధికారులు, పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు.
 
నేడు మంత్రివర్గం సమావేశం..
సీఎం అధ్యక్షతన శనివారం ఉదయం 10 గంటలకు  మంత్రివర్గ సమావేశం జరగనుంది.

అమెరికాలో నలుగురు మంత్రులు
ఇదిలా ఉండగా అమెరికాలో జరుగుతున్న తానా సభల్లో పాల్గొనేందుకు నలుగురు మంత్రులు వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement