పోలవరం పూర్తిచేద్దాం.. సహకరించండి | cm chandrababu urged centre to compleate polavaram project | Sakshi
Sakshi News home page

పోలవరం పూర్తిచేద్దాం.. సహకరించండి

May 19 2015 2:16 AM | Updated on Aug 21 2018 8:34 PM

సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రి ఉమాభారతికి పుష్పగుచ్ఛం అందిస్తున్న చంద్రబాబు - Sakshi

సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రి ఉమాభారతికి పుష్పగుచ్ఛం అందిస్తున్న చంద్రబాబు

పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు సహకరించాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. 2018 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉందని, సత్వరం నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

- కేంద్ర ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు వినతి
- కేంద్ర మంత్రి ఉమాభారతితో భేటీ
- అదనపు నిధుల కే టాయింపుపై చర్చ
 
న్యూఢిల్లీ:
పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు సహకరించాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. 2018 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉందని, సత్వరం నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

చండీగఢ్‌లో మంగళవారం జరగనున్న నీతి ఆయోగ్ ‘స్వచ్ఛ భారత్’ సీఎంల సబ్‌కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు సోమవారం ఢిల్లీకి వచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు అశోక్‌గజపతిరాజు, సుజనా చౌదరి, ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావులతో కలసి మంత్రి ఉమాభారతితో భేటీ అయ్యారు. అనంతరం, మంత్రి వెంకయ్యనాయుడుతో కలసి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో అరగంటకుపైగా బాబు సమావేశమయ్యారు.

రూ.100 కోట్లు వెంటనే ఇవ్వండి!
పోలవరం ప్రాజెక్టు కోసం మంజూరు చేసిన రూ.100 కోట్లను వెంటనే విడుదల చేయాలని మంత్రి ఉమాభారతిని సీఎం చంద్రబాబు కోరారు. 2016-17 బడ్జెట్‌లో రూ.2 వేల కోట్లు కేటాయించాలన్నారు. వచ్చే ఖరీఫ్‌లో కృష్ణా జలాల విడుదలలో తెలంగాణ, ఏపీ మధ్య విభేదాలు రాకుండా కేంద్రమే చొరవ తీసుకోవాలన్నారు. అనంతరం ఏపీ భవన్‌లో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. అమిత్‌షాతో సమావేశంలో ఇరు పార్టీల మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించినట్టు తెలిపారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చినా అన్ని సమస్యలూ పరిష్కారం కాబోవన్నారు. కాగా, 6న జరగనున్న ఏపీ రాజధాని శంకుస్థాపనకు షాను ఆహ్వానించినట్టు సమాచారం. ఇదిలావుంటే, పోలవ రానికి ఎక్కువ నిధులు కేటాయించేలా ఆర్థిక మంత్రిపై ఒత్తిడి తెస్తున్నట్టు మంత్రి ఉమాభారతి మీడియాకు చెప్పారు. సీఎం చంద్రబాబు సహకారంతో ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తామన్నారు.

సమస్యలను ఇలా పరిష్కరించుకుందాం: తెలంగాణకు బాబు వినతి
విభజన చ ట్టం.. షెడ్యుల్ 9, 10లోని సంస్థల పంపకాలు ఏడాదిలోపు పూర్తి కావాల్సి ఉందని, సమస్యల పరిష్కారంలో తెలంగాణ కలసి రావాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ‘ఇద్దరు సీఎంలం కూర్చుని చర్చిద్దాం. వీలుకాకపోతే కేంద్రం సహకారంతో పెద్ద మనుషులను పెట్టుకుని పరిష్కరించుకుందాం.’ అని సీఎం అన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆ దిశగా స్పందన ఉండడంలేదన్నారు.
 
మూడేళ్లలో ఆరోగ్యాంధ్రప్రదేశ్ కల నెరవేరాలి
మూడేళ్లలో ఆరోగ్యాంధ్రప్రదేశ్ కల సాకారం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్‌పై సోమవారం నిర్వహించిన వర్క్‌షాప్‌లో మాట్లాడుతూ అధునాతన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని వైద్యాన్ని పేదలకు చేరువ చేయాలన్నారు. ప్రతి ఒక్కరికీ హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని, అందువల్ల వైద్యసేవలందించడం సులువవుతుందన్నారు. ఇప్పటికే  ఐదేళ్ల లోపు వయసున్న 40 లక్షల మంది చిన్నారుల వివరాల్ని కంప్యూటరీకరించామన్నారు.

ఆరోగ్యాంధ్రప్రదేశ్ కార్యక్రమాలకు కేంద్రమంత్రి సుజనాచౌదరి సమన్వయకర్తగా వ్యవహరిస్తారన్నారు. సుజనాచౌదరి మాట్లాడుతూ వైద్య పాఠశాలలు, కళాశాల నిర్వహణ, సంక్షేమ పథకాల అమలుకు వనరుల్ని సమకూర్చుకోవాలని సూచించారు. ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్, వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రాథమిక వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఐఏఎస్ అధికారి లవ్ అగర్వాల్, సీఎంవో ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర, ఏపీఐఐసీ చైర్మన్ పి. కృష్ణయ్యలు పాల్గొన్న ఈ వర్క్‌షాప్‌లో రెడ్డీస్ లేబొరేటరీస్ కో-చైర్మన్ జీవీ ప్రసాద్, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డా. శ్రీనాథరెడ్డి, అసోచామ్ హెల్త్ కేర్ చైర్మన్ డా.బీకేరావు, టీసీఎస్ హెల్త్ కేర్ సొల్యూషన్స్ ఉపాధ్యక్షుడు గిరీష్ కృష్ణమూర్తి, మేదాంత కో- ఫౌండర్ సునీల్ సచ్‌దేవ, మిలిందా గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధి అపరాజిత రామకృష్ణన్, కార్నా మెడికల్ డేటాబేస్ జనరల్ మేనేజర్ హిడే టోషీ యమౌచి, రెడ్డీస్ ల్యాబ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అలోక్ సోనిగ్, కృష్ణమూర్తి విజయన్‌లతోపాటు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement