అది.. వారి తలరాత | CM Chandrababu response on yerpedu lorry accident | Sakshi
Sakshi News home page

అది.. వారి తలరాత

Apr 24 2017 1:23 AM | Updated on Aug 14 2018 11:26 AM

అది.. వారి తలరాత - Sakshi

అది.. వారి తలరాత

చిత్తూరు జిల్లా ఏర్పేడులో లారీ ఢీకొని 15 మంది దుర్మరణం చెందడాన్ని సీఎం చంద్రబాబు బాధితుల తలరాత(డెస్టినీ)గా అభివర్ణించారు.

ఏర్పేడు దుర్ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందన

సాక్షి, న్యూఢిల్లీ: చిత్తూరు జిల్లా ఏర్పేడులో లారీ ఢీకొని 15 మంది దుర్మరణం చెందడాన్ని సీఎం చంద్రబాబు బాధితుల తలరాత(డెస్టినీ)గా అభివర్ణించారు. నీతిఆయోగ్‌ మూడో గవర్నింగ్‌ కౌన్సిల్‌ భేటీకి హాజరైన సీఎం ఆదివారం రాత్రి ఢిల్లీలోని ఏపీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘ఏర్పేడులో జరిగిన సంఘటన బాధాకరం. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఒక్కోసారి దురదృష్టం వెంటాడినప్పుడు ఎట్లా ఉంటుందో ఇదొక ఉదాహరణ. ఒకవైపు బాధ, మరోవైపు డెస్టినీ.  ఒక్కోసారి డెస్టినీ ఇలా చేస్తుంది. ఒక కారణం కోసం వెళ్లిన వారు ప్రాణాలు కోల్పోయారు. గ్రామస్తుల ఆందోళనకు కారకులైన ఇద్దరు వ్యక్తులు టీడీపీకి చెందిన వారు. ధనుంజయ నాయుడు, చిరంజీవి నాయుడును పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నాం. వాళ్లను అరెస్టు చేయాలని ఆదేశించాం. వాళ్లు చేసిన పని వల్లే ఇదంతా జరిగింది. ఎమ్మార్వోను సస్పెండ్‌ చేస్తున్నాం.. ఫిర్యాదు చేసినప్పుడు జాగ్రత్త తీసుకుని ఉంటే ఇది జరిగేది కాదు’’ అని చంద్రబాబు చెప్పారు.

బొక్కలో తోస్తే దారికొస్తారు
‘‘ఏర్పేడు స్టేషన్‌ ఎస్‌ఐకి గాయాలయ్యాయి. అతడిపైనా ఆరోపణలు ఉన్నాయి. ఈ దుర్ఘటనపై సీనియర్‌ ఐఏఎస్‌ అధికారితో విచారణ జరిపిస్తున్నాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఆర్‌టీఏ అధికారులు నిర్లక్ష్యం వల్ల లారీ ప్రమాదం జరిగింది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకున్నా మనుషులను చంపే లైసెన్స్‌ ఉన్నట్టు వ్యవహరించారు. పదేళ్లు, ఇరవై ఏళ్లు బొక్కలో తోస్తే దారికొస్తారు. తాగి వాహనం నడిపితే లైసెన్స్‌ రద్దయ్యేలా కఠిన చర్యలు తీసుకుంటాం.’’ అని బాబు హెచ్చరించారు.

సోషల్‌ మీడియాలో బాధ్యతగా ఉండాలి
సోషల్‌ మీడియాలోని పోస్టింగ్‌లపై ఉక్కుపాదం మోపుతున్నారన్న మీడియా ప్రశ్నకు చంద్రబాబు బదులిస్తూ... ‘‘నేరపూరితంగా, అదేపనిగా రెచ్చగొట్టే విధానంలో, అవమానకర రీతిలో ప్రవర్తించడం సరికాదు. బాధ్యతగా ఉండాలి. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛఉండాలి. కానీ, సభ్యత లేకుండా ఇష్ట్రపకారం చేస్తే ఎలా? నాకు కూడా ఓ వెబ్‌సైట్‌ ఉంది. కానీ మేమెప్పుడు ఇలాంటివి ప్రమోట్‌ చేయలేదు’’ అని బాబు పేర్కొన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌కు సాయం చేయాలని నీతిఆయోగ్‌ భేటీలో తాను ప్రధానిని కోరినట్లు చంద్రబాబు తెలిపారు. ప్రత్యేక సాయానికి చట్టబద్ధత కల్పించాలని విజ్ఞప్తి చేశాం. విశాఖకు రైల్వే జోన్‌ ఇవ్వాలని కోరాం. ’ అని సీఎం పేర్కొన్నారు.

ఒకేసారి ఎన్నికలపై వ్యతిరేకత రాలేదు
‘‘దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగాలన్న అంశాన్ని ప్రధాని ప్రస్తావించారు. దీనిపై వ్యతిరేకత రాలేదు. దాదాపు అంతా సానుకూలమే. మేమూ  సిద్ధమే. దీనిపై రాజకీయ ఏకాభిప్రాయం రావాల్సి ఉంది. ’ అని చంద్రబాబు వెల్లడించారు.  కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌తో సీఎం ఆదివారం ఢిల్లీలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో భూసేకరణ చట్టం రూపకల్పనపై చర్చించినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement