
విజయనగరం ఫోర్ట్: డ్వాక్రా మహిళలను రుణాల భారంతో ముంచేసిన చంద్రబాబు సర్కారు.. ఆడపిల్లలకు ఆధారమైన బంగారు తల్లి పథకాన్ని మా ఇంటి మహాలక్ష్మిగా పేరుమార్చి మంగళం పాడేసింది. నాలుగేళ్లుగా ఒక్క పైసాను కేటాయించకుండా ఆడబడ్డలకు ఆదరవు లేకుండా చేసేసింది. పిల్లల తల్లిదండ్రులను ఆవేదనలోకి నెట్టేసింది. ఆడ పిల్లలను కన్న తల్లిదండ్రులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ బాలికా సంరక్షణ పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఒక ఆడపిల్ల పుడితే రూ.లక్ష, ఇద్దరు పిల్లలు పుడితే రూ.60 వేలు చొప్పన ఇచ్చేవారు. అయితే, వైఎస్సార్ మరణానంతరం గద్దెనెక్కిన కిరణ్ సర్కార్ బాలికా సంరక్షణ పథకాన్ని బంగారుతల్లి పథకంగా మార్చింది. చట్టాన్ని సైతం చేసింది. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం మాఇంటి మహాలక్ష్మి పథకంగా పేరు మార్చి ఒక్క పైసా నిధులు విదల్చకుండా మరుగున పడేసింది. నాలుగేళ్లుగా పథకానికి విధివిధానాలు ఖరారు చేయలేదు. దరఖాస్తు చేసేందుకు వీలులేకుండా చేసేసింది.
పథకం అమలైతే...
బంగారు తల్లి పథకం అమలులో ఉన్న సమయంలో ఆడపిల్లల జనన ధ్రువపత్రంతో దరఖాస్తు చేసుకున్న వెంటనే రూ.2500 చెల్లించేవారు. ఇలా రెండేళ్ల వరకు ఇస్తారు. 3 నుంచి 5 ఏళ్లు లోపు వారికి అంగన్‌వాడీ కార్యకర్తల ద్వారా ఏటా రూ.1500 చెల్లించాలి. 6 నుంచి 10 ఏళ్ల వరకు ఏటా ప్రభుత్వ పాఠశాలల ద్వారా రూ.2 వేలు ఇవ్వాలి. 11 నుంచి 13 ఏళ్ల వరకు 6,7 తరగతి చదివే సమయంలో ఏటా రూ.2500 చెల్లించాలి. 14 నుంచి 15 ఏళ్లలోపు వారికి ఏటా రూ.3,500, 16 నుంచి 17 ఏళ్లు వరకు ఇంటర్ చదివే సమయంలో ఏటా రూ.3,500, 18 నుంచి 21 ఏళ్ల వరకు ఏటా రూ.4 వేలు, 21 ఏళ్లు వచ్చిన అనంతరం ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధిస్తే రూ.5 వేలు, డిగ్రీ పూర్తి చేస్తే రూ.1,55,500 అందించాలి.
30 వేల మంది ఎదురు చూపు
ఈ నాలుగు ఏళ్ల కాలంలో జిల్లాలో సుమారు 30 వేలు మంది ఆడపిల్లలు జన్మించారు. వారంతా పథకోసం ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం కారణంగా వారికి పథకం అందకుండా పోయింది.
విధివిధానాలు లేవు..
మా ఇంటి మహాలక్ష్మి పథకానికి సంబంధించి విధి విధానాలు ప్రభుత్వం నుంచి రాలేదు. దరఖాస్తుల స్వీకరణకు అవకాశం లేదు.– ఏఈ రాబర్ట్స్, పీడీ, ఐసీడీఎస్