భూతాపం.. జల సంక్షోభం

Climate changes affecting the movement of monsoons - Sakshi

రుతు పవనాల గమనంపై ప్రభావం చూపుతున్న వాతావరణ మార్పులు

అతివృష్టి.. లేదంటే అనావృష్టి

నదీ పరీవాహక ప్రాంతాలపై తీవ్ర ప్రభావం

ద్వీపకల్ప నదులే కాదు..హిమాలయ నదుల ఉనికీ ప్రశ్నార్థకమే

గతేడాది వరదలు, నీటి ఎద్దడితో తల్లడిల్లిన జిల్లాలు 200

ఏడాదిలో నెలపాటు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న వారి సంఖ్య 360 కోట్లు

సాక్షి, అమరావతి: భూతాపం (గ్లోబల్‌ వార్మింగ్‌) రుతుపవనాల గమనాన్ని నిర్దేశిస్తోందా? దేశంలో నదీ పరీవాహక ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపుతోందా? గోదావరి, కృష్ణా, కావేరి వంటి ద్వీపకల్ప నదులే కాదు.. గంగా, యమునా, బ్రహ్మపుత్ర వంటి హిమాలయ నదుల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తోందా.. అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతోంది ఐక్యరాజ్య సమితి తాజాగా విడుదల చేసిన ప్రపంచ జల వనరుల అభివృద్ధి నివేదిక (డబ్ల్యూడబ్ల్యూడీఆర్‌) గత ఏడాది దేశంలో సమృద్ధిగా వర్షాలు కురిసినా 200 జిల్లాల్లో వరదలు, నీటి ఎద్దడితో ప్రజలు తల్లడిల్లటాన్ని భారతీయ ఉష్ణమండల వాతావరణ సంస్థ (ఐఐటీఎం) ఎత్తిచూపడాన్ని బట్టి.. దేశంలో జల సంక్షోభం తీవ్రమయ్యే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. భూతాపం వల్ల ప్రపంచంలో ఏడాదిలో ఒక నెలపాటు 360 కోట్ల మంది తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారని డబ్ల్యూడబ్ల్యూడీఆర్‌ వెల్లడించింది. పారిస్‌ ఒప్పందం మేరకు భూతాపాన్ని 2 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 1.5 డిగ్రీలకు తగ్గించకపోతే.. 2050 నాటికి ఏడాదిలో ఒక నెలపాటు తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనే వారి సంఖ్య 517 కోట్లకు చేరుకుంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. 

నివేదికలోని ప్రధానాంశాలివీ..
► కార్బన్‌డయాక్సైడ్, గ్రీన్‌ హౌస్‌ వాయువులు వాతావరణంలో కలవడం భూ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడానికి దారితీస్తుంది. సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడానికి దోహదపడుతుంది. 
► ఇది రుతుపవనాల గమనాన్ని ప్రభావితం చేస్తుంది. గతేడాది దేశ వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిశాయి. కానీ.. ఒకేసారి కుండపోత వర్షం కురవడం, వర్షపాత విరామాలు (డ్రైస్పెల్స్‌) అధికంగా ఉండటం వల్ల దేశంలో 200 జిల్లాల ప్రజలు వరదలు, నీటి ఎద్దడితో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
► ఆసియా ఖండంలో భారత్, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ తదితర దేశాలకు చెందిన 200 కోట్ల మంది తాగునీటి, సాగునీటి అవసరాలను గంగా, యమున, బ్రహ్మపుత్ర వంటి హిమాలయ నదులు తీరుస్తున్నాయి.
► హిమాలయ నదులపై జలవిద్యుత్‌ కేంద్రాల ద్వారా 500 గిగా వాట్స్‌ విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. భూతాపం ప్రభావం వల్ల హిమాలయాల్లో గ్లేసియర్స్‌(మంచు.. హిమానీ నదాలు) కరుగుతున్నాయి. 
► 2060 నాటికి హిమానీ నదాలు 50 శాతం కరిగిపోతాయి. ఇది హిమాలయ నదుల ప్రవాహంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 2060 నాటికి ఆ నదుల్లో నీటి లభ్యత 50 శాతం తగ్గిపోతుంది. ఇది 200 కోట్ల మందిని జల సంక్షోభంలోకి నెడుతుంది.
► రుతు పవనాల గమనం వల్ల అతివృష్టి, అనావృష్టి ఏర్పడి ద్వీపకల్ప నదుల్లో నీటి లభ్యతపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 
► భూతాపం వల్ల భూమిలోకి ఇంకే వర్షపు నీరు కంటే ఆవిరి అయ్యే నీటి శాతమే ఎక్కువ. ఇది భూగర్భ జలాలు అడుగంటిపోవడానికి దారి తీస్తుంది. అంటే.. ద్వీపకల్ప భారతదేశంలో జల సంక్షోభం మరింత ముదురుతుంది.
► భూతాపం 1 డిగ్రీ సెల్సియస్‌ పెరిగితే ప్రపంచ జనాభాలో 7 శాతం మందికి నీటి లభ్యత 20 శాతం తగ్గడానికి దారి తీస్తుంది. అదే భూతాపం 1.5 డిగ్రీల నుంచి రెండు డిగ్రీలకు పెరిగితే ప్రపంచ జనాభాలో 50 శాతం మంది తీవమ్రైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
► నవంబర్‌ 4, 2016 నుంచి అమల్లోకి వచ్చిన పారిస్‌ ఒప్పందానికి కట్టుబడి అమెరికా, యూరోపియన్‌ యూనియన్, చైనా సహా అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు వాతావరణ కాలుష్యాన్ని నివారించడం ద్వారా భూతాపాన్ని 1.5 డిగ్రీలకు తగ్గించగలిగితే జల సంక్షోభం ముప్పు తప్పుతుంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top