అపోలోకు చిత్తూరు ఆస్పత్రి | Sakshi
Sakshi News home page

అపోలోకు చిత్తూరు ఆస్పత్రి

Published Sun, Aug 30 2015 3:25 AM

అపోలోకు చిత్తూరు ఆస్పత్రి - Sakshi

- నిర్ణయం తీసుకున్న రాష్ట్ర మంత్రివర్గం
- హెల్త్‌సిటీ స్థాపన పేరుతో ప్రకటన
చిత్తూరు (అర్బన్):
చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిని అపోలో వైద్య సంస్థలకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శనివారం విజయవాడలో జరిగిన మంత్రివర్గ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే దీన్ని నేరుగా చెప్పకుండా చిత్తూరులో హెల్త్‌సిటీ స్థాపన పేరిట మంత్రులు చెప్పడం విశేషం. నగరంలోని మురకంబట్టు వద్ద అపోలో వైద్య సంస్థలకు కేటాయించిన స్థలంలో మెడికల్ కళాశాలతో పాటు కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందించడానికి హెల్త్ సిటీని ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అపోలో హెల్త్‌సిటీ ప్రారంభం కావాలంటే ముందుగా చిత్తూరు ప్రభుత్వ వైద్యశాలను ఐదేళ్ల పాటు అపోలో సంస్థలకు లీజుకు ఇవ్వాల్సి ఉంటుంది.

అపో లో వైద్య సంస్థలకు సొంత కళాశాల లేకపోవడంతో మెడిసిన్‌లో సీట్లు పొందిన విద్యార్థులు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాక్టీస్ చేయనున్నారు. ఇందుకోసం చిత్తూరు ఆస్పత్రిని క్లినిక ల్ అటాచ్‌మెంట్ కింద ఉపయోగించుకుంటా రు. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రిని ప్రైవేటుపరం చేయడానికి సర్కులర్ ఇవ్వడం, ఓ కమిటీని ఏర్పాటు చేసి ఇక్కడున్న వసతులు, వైద్యుల వివరాలను సేకరించిన ప్రభుత్వం తాజా నిర్ణయంతో తన వైఖరిని తేల్చేసింది. మురకంబట్టు వద్ద అపోలో సంస్థల వైద్య కళాశాలలు ప్రారంభమయ్యేంత వరకు ప్రభుత్వ ఆస్పత్రిని ఉపయోగించుకోనున్నారు. ఇందుకు తొలిగా మురకంబట్టులో ఉన్న ఖాళీ స్థలంలో హెల్త్‌సిటీ కి శంకుస్థాపన చేయడానికి అపోలో సంస్థ ఏర్పాట్లు చేసుకుంటోంది. ప్రభుత్వ పెద్దలు తేదీలు చెప్పగానే అటు శంకుస్థాపన.. ఇటు ఆస్పత్రి అప్పగింత ఒకే సారి జరిగిపోతుంది.

Advertisement
Advertisement