రైతు బిడ్డ రికార్డు ! | Sakshi
Sakshi News home page

రైతు బిడ్డ రికార్డు !

Published Sat, Sep 22 2018 10:00 AM

Chittoor Ravi Teja Get Scientist Job In Apple Company - Sakshi

తిరుపతి రూరల్‌ : అమ్మ ప్రోత్సాహం....నాన్న తోడ్పాటు...చిన్ననాటి నుంచి ఏదో సాధించాలనే తపన ఆ రైతు బిడ్డను అమెరికాలోని ప్రతిష్టాత్మక ఆపిల్‌ సంస్థలో చిన్న వయస్సులోనే పెద్ద కొలువులో కూర్చోపెట్టింది. చంద్రగిరి మండలం పుల్లయ్యగారిపల్లెకు చెందిన అనంత రవితేజకు ఆపిల్‌ కంపెనీ శాస్త్రవేత్తగా కొలువు ఇచ్చి ఏడాదికి రూ.1.72 కోట్ల వేతనం అందించేందుకు ముందుకు వచ్చింది.
రవితేజ తండ్రి  రమేష్‌నాయుడు ఓ సాధారణ రైతు. పుల్లయ్యగారిపల్లెలో మూడు ఎకరాల్లో వ్యవసాయం చేస్తుంటారు. తల్లి నీలిమ పదో తరగతి వరకు చదివింది.

వీరికి రవితేజ, శ్రీనివాసరావు సంతానం. బిడ్డలను ఉన్నత చదువులు చదివించాలని తల్లి తపన పడింది. రవితేజను ఇంజినీరుగా, చిన్న కొడుకు శ్రీనివాసరావును డాక్టర్‌గా చదివించింది. రవితేజ ప్రాథమిక విద్య తిరుపతి బాలాజీ కాలనీలోని కేంబ్రిడ్జి స్కూల్,  వికాస్‌ కళాశాలలో ఇంటర్మీడియట్, బెంగళూరులోని కేఎస్‌ఐటీ కళాశాలలో ఈసీఈ విభాగంలో 2014లో బీటెక్‌ పూర్తి చేశారు. అమెరికాలోని న్యూయార్క్‌ వర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులో రెండేళ్ల ఎంఎస్‌ కోర్సును తొమ్మిది నెలల్లోనే పూర్తి చేసుకున్నారు. తరువాత ఏడాదికి రూ.1.22 కోట్ల వేతనంతో మొదటి ప్రయత్నంలోనే బ్లూంబర్గ్‌ కంపెనీలో శాస్త్రవేత్తగా సంవత్సరం పనిచేశారు. అతడి ప్రతిభను గుర్తించిన ఆపిల్‌ కంపెనీ, ఏడాదికి రూ.1.72 కోట్ల వేతనంతో శాస్త్రవేత్తగా ఉద్యోగం కల్పించింది.

అమ్మ ప్రోత్సాహం అనంతం
తన ఉన్నతికి అమ్మే స్ఫూర్తి అని, ఆమె విశేషంగా ప్రోత్సహించారని, త్వరలోనే తన తల్లిని అమెరికాకు తీసుకెళతానని రవితేజ తెలిపారు. పదేళ్ల తర్వాత ఇండియాకు వచ్చి కంపెనీ పెట్టి దేశసేవ చేస్తానని తెలిపారు.

హార్వర్డ్‌ వర్సిటీలో ఎంబీఏ...వంద శాతం ఫెలోషిప్‌
సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి ప్రతిష్టాత్మక ఆపిల్‌ కంపెనీలో ఉన్నతోద్యోగం సాధించిన రవితేజ మరో అరుదైన అవకాశం పొందారు. ప్రస్తుతం అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీలో ఎంబీఏ చదవడానికి వందశాతం ఫెలోషిప్‌ను సాధించాడు.

Advertisement
Advertisement