ఊయలే వారి ఊపిరి తీసింది..

chittoor: children died while playing in cradle - Sakshi

సాక్షి, పూతలపట్టు: అమ్మానాన్న కూలికి వెళ్లడం, సెలవు రోజు కావడంతో ఆ చిన్నారుల ఆనందానికి అవధుల్లేవు. తమకు ఆటవిడుపు దొరికిందని సంబరపడ్డారు. ఊళ్లోని రాతి స్తంభాలకు కట్టిన ఊయల ఊగడానికి వెళ్లారు. ఆ ఊయలే వారి పాలిట మృత్యువుగా మారింది. ఈ విషాద సంఘటన చిత్తూరు జిల్లా మండలంలోని గొడుగుచింతలో శనివారం జరిగింది. వివరాలివి.. గ్రామంలోని దళితవాడకు చెందిన నాగరాజు, సరిత దంపతులు కూలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు మగ పిల్లలు.  తాము కష‍్టపడి పిల్లలిద్దరినీ బాగా చదివించాలని కలలు కన్నాము.

పెద్ద కొడుకు గిరిధర్‌(7) గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి, చిన్నకొడుకు పవన్ కుమార్‌(4) అంగన్వాడీ సెంటర్‌లో చదువుతున్నారు. తల్లిదండ్రులు పనులకు వెళ్లడం, రెండవ శనివారం కావడంతో పిల్లలిద్దరూ ఆడుకోవడానికి వెళ్లారు. అరిమేను గంగమ్మ ఆలయానికి వెళ్లి అక్కడ రాతి స్తంభాలకు కట్టిన ఊయల ఎక్కారు. కొద్దిసేపటి తర్వాత ఆకస్మికంగా ఆ రాతి స్తంభాలు విరిగిపోయాయి. ఊయల వేగంగా ముందుకెళ్లడంతో పిల్లలు ఎగిరి దూరంగా పడిపోయారు. ఇద్దిరి తలలకు తీవ్ర గాయాలు కాగా తీవ్ర రక్తస్రావమై కొద్దిక్షణాలకే ప్రాణాలు విడిచారు. విషయం 

విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పరుగున వచ్చి విగతజీవులైన తమ చిన్నారులను చూసి గుండెలవిసేలా రోదించారు. కాగా, గ్రామ దేవతకు మొక్కు చెల్లింపులో భాగంగా ఓ భక్తుడు పదేళ్ల క్రితం ఈ ఊయల రాతి స్తంభాల మద్య ఇనుప గొలుసులతో ఏర్పాటు చేశాడు. రోజూ గ్రామంలోని పిల్లలు అక్కడికి వెళ్లి ఊగుతుంటారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ స్తంభాలు నేలకొరగడం విస్మయం కలిగిస్తోందని గ్రామస్తులు చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top