సొంతపార్టీ నేతపైనే చింతమనేని దాడి

Chintamaneni Attack On TDP Leader - Sakshi

గ్రామస్తుల ఆందోళన..టీడీపీ ఫ్లెక్సీల దహనం

ఎమ్మెల్యేను నిర్బంధించి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌

చివరికి క్షమాపణ చెప్పిన చింతమనేని

పెదపాడు: వరుస దాడులతో నిత్యం వార్తల్లో ఉండే పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌.. ఈసారి సొంతపార్టీ నేతపైనే దాడికి దిగారు. పెదపాడు మండలం దాసరిగూడెం తాజా మాజీ సర్పంచ్‌ పామర్తి పెదరంగారావుపై ఎమ్మెల్యే దాడి చేయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసి, తెలుగుదేశం ఫ్లెక్సీలు తగులబెట్టడంతో పాటు.. చింతమనేనిని అడ్డుకుని క్షమాపణ చెప్పేవరకూ వదలేదిలేదంటూ నిర్బంధించారు. దీంతో చేసేదేంలేక చింతమనేని క్షమాపణ చెప్పి.. పోలీసుల సాయంతో అక్కడి నుంచి బయటపడ్డారు. 

ఆ వ్యక్తికి ఎవడు సిఫార్సు చేయమన్నాడ్రా.. ?
పెదపాడు మండలం దాసరివారిగూడెంలో శుక్రవారం జరిగిన గ్రామదర్శినికి ఎమ్మెల్యే చింతమనేని హాజరయ్యారు. ఒకరికి స్వయం ఉపాధి రుణం ఇవ్వడానికి పెదరంగారావు సిఫార్సు చేసిన విషయం ఎమ్మెల్యే దృష్టికొచ్చింది. ‘అసలా వ్యక్తికి ఎవడు సిఫార్సు చేయమన్నాడ్రా..? నాకు తెలియకుండా గ్రామంలో పింఛన్లు ఎందుకు ఇప్పించావ్‌’ అంటూ అసభ్య పదజాలంతో దూషించాడు. దీనిపై పెదరంగారావు ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని ఎమ్మెల్యే.. ఆ మాజీ సర్పంచ్‌పై చెయ్యిచేసుకున్నారు. దీంతో మనస్తాపానికి గురైన పెదరంగారావు అక్కడి నుంచి వచ్చేసి తన స్వగ్రామమైన వేంపాడు చేరుకుని జరిగిన విషయాన్ని గ్రామస్తులకు చెప్పారు. దీంతో గ్రామస్తులు ఆగ్రహంతో ఊగిపోయారు.

వేంపాడు గ్రామంలో ఉన్న తెలుగుదేశం ఫ్లెక్సీలను చింపేసి తగులబెట్టారు. గ్రామదర్శిని కార్యక్రమం ముగించుకుని వస్తున్న చింతమనేనిని వారు అడ్డుకుని.. తమ సర్పంచ్‌ను కొట్టినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అయితే పెదరంగారావు తన తమ్ముడిలాంటి వాడని, మాట విననందుకు ఆగ్రహం వ్యక్తం చేశానంటూ సంజాయిషీ ఇచ్చారు. అయితే దీనికి గ్రామస్తులు సంతృప్తి చెందలేదు. దీంతో ఎమ్మెల్యే చింతమనేని.. పెదరంగారావుకు 3 సార్లు క్షమాపణ చెప్పారు. ఈలోగా అక్కడికి చేరుకున్న పోలీసులు ఎమ్మెల్యేను తమ రక్షణ మధ్య అక్కడి నుంచి తీసుకెళ్లారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే తమపై దాడులు చేయడమేంటని టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top