బంధాన్ని మరిచి..ఇంటిని విడిచి

Child Helpline Centre Giving Counselling To Children In Vizianagaram - Sakshi

కాలం మారింది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగైంది. పిల్లలపై పెద్దలకు పట్టు సడలుతోంది. నాలుగు మంచిమాటలు చెప్పేవారు లేకపోతున్నారు. పిల్లల ప్రవర్తనను పసిగట్టలేని బిజీ జీవనాన్ని తల్లిదండ్రులు గడుపుతున్నారు. వారి ఆసక్తి, అభిరుచులను తెలుసుకోలేకపోతున్నారు. కష్టాలను అధిగ   మించే సామర్థాలను పెంపొందించకుండా అనవసర ఒత్తిడి పెంచుతున్నారు. కలహాలు పడుతున్నారు. పిల్లలపై ఆవేశాన్ని చూపుతున్నారు. ఇంటిని వీడిపోయే ఆలోచనను రేకెత్తిస్తున్నారు. చేతులారా పిల్ల ల భవిష్యత్‌ను నాశనం చేస్తున్నారని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలకు  మమకారం పంచాలని... ఆసక్తులు గమనించాలని.. బంధాన్ని బలోపేతం చేయాలని సూచిస్తున్నారు. 

సాక్షి, విజయనగరం : చదువుకోవాలంటూ తల్లిదండ్రులు మందలించారని గుర్ల మండలానికి చెందిన 13 ఏళ్ల బాలిక  ఇంటి నుంచి పారిపోయి బస్సులో వచ్చేసింది. విజయనగరం చైల్డ్‌లైన్‌ సభ్యులు బాలికను  కార్యాలయానికి తీసుకుని వచ్చి సంరక్షించారు. తల్లిదండ్రుల అంగీకారం ప్రకారం కేజీబీవీలో  చేర్పించారు. 'విశాఖపట్నం పూర్ణమార్కెట్‌ ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలుడు తల్లి మందలించిందని కొద్ది రోజుల కిందట ఇంటి నుంచి వచ్చేసాడు. చైల్డ్‌లైన్‌ 1098 సంస్థ సభ్యులు బాలుడిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు’.

 ఇలా అనేక మంది ఇంటి నుంచి పారిపోయి వచ్చేస్తున్నారు. తల్లిదండ్రులు మందలించారని కొంతమంది, పట్టణాలు చూద్దామని మరి కొందరు ఇంటిని వీడుతున్నారు. ఆవేశంలో ఇంటిని వీడిన వారు పోలీసులు, చైల్డ్‌లైన్‌ సభ్యులకు దొరికితే ఫర్వాలేదు. పొరపాటును ఏ అగంతుకులకో దొరికితే పిల్లల పరిస్థితి అంతే సంగతి.

మూడేళ్లలో 100 మంది... 
గత  మూడేళ్ల కాలంలో దాదాపు 100 మంది వరకు ఇంటి నుంచి పారిపోయి వచ్చేశారు. వీరిలో అధికశాతం మంది తల్లిదండ్రులు మందలిస్తే పారిపోయి వచ్చిన వారే. అధికారులు గుర్తించని వారు ఎంతోమంది ఉంటారు. నేటి సాంకేతిక కాలంలో తల్లిదండ్రులు ఉరుకుల పరుగుల జీవనం సాగిస్తున్నారు. పిల్లల ఆసక్తులు, అభిరుచులను గమనించలేనంత బిజీ అవుతున్నారు. దీంతో పిల్లల ప్రవర్తనపై పట్టుకోల్పోతున్నారు. వారు ఏం చేస్తున్నారో కూడా తెలుసుకోలేకపోతున్నారు. మరికొందరు పిల్లలకు ఆసక్తిలేని రంగాల్లో రాణించాలంటూ ఒత్తిడి పెంచుతున్నారు.

ఆయా రంగాల్లో వెనుకబడితే మందలిస్తున్నారు. దండిస్తున్నారు. దీనివల్లే చాలామంది పిల్లలు ఇంటిని వీడేందుకు సిద్ధపడుతున్నట్టు మానసిక నిపుణులు చెబుతున్నారు. మరికొన్నిచోట్ల తల్లిదండ్రులు నిత్యం గొడవలు పడడంతో పిల్లలకు భద్రత కరువవుతోంది. ఇంటిని వీడిపోవాలన్న ఆలోచన తలెత్తి మెల్లగా తల్లిదండ్రుల నుంచి దూరమవుతున్నారు. వీరిలో కొందరు మంచి మార్గాల్లో పయనిస్తుంటే.. మరికొందరు సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారు. 

గొడవల వల్లే... 
కుటుంబంలోను, తల్లిదండ్రులు తరచూ గొడవలు పడుతుండడంతో పిల్లలకు భద్రత కరువవుతోంది. దిశానిర్దేశం చేసేవారు లేకపోతున్నారు. దీంతో కొంతమంది పిల్లలు ఇంటి నుంచి పారిపోయి వచ్చేస్తున్నారు. సోషల్‌ మీడియా ప్రభావం కూడా పిల్లలపై ఉంటుంది. సోషల్‌ మీడియాలో చూపిస్తున్న ప్రదేశాలను చూడాలని కొంతమంది పట్టణాలకు వచ్చేస్తున్నారు. ఇంట్లో స్వేచ్ఛ ఉండడం లేదని, తల్లిదండ్రులు మందలించారని చాలా మంది పిల్లలు ఇంటి నుంచి పారిపోయి వచ్చేస్తున్నారు.     
– జీకే దుర్గ, చైల్డ్‌లైన్‌ కౌన్సిలర్‌  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top