అహనా..కోడంట!

Chicken Price Hikes In Telugu States - Sakshi

కొండెక్కిన కోడి ధర

చికెన్‌ మరింత ప్రియం

అధిక ఉష్ణోగ్రతలతో మృత్యువాత పడుతున్న కోళ్లు

జిల్లాలో కుదేలైన పౌల్ట్రీ పరిశ్రమ  

ఇతర రాష్ట్రాలపై  ఆధార పడాల్సిన దుస్థితి  

సుత్తి వీరభద్రరావు: బావ..ఏంటి పైకి చూస్తున్నావు. వింతగా ప్రవర్తిస్తున్నావు!
కోటా శ్రీనివాస రావు: ఏ ముంది బావ..చికెన్‌ తింటున్నా..రా నువ్వు కూడా తిందువుగానీ..
సుత్తి వీరభద్రరావు: చికెనా..ఎక్కడుంది బావా!
కోటా శ్రీనివాస రావు: ఇదిగో పైన కోడి వేలాడుతోంది. కోడిని చూస్తూ నేను కంచంలో అన్నం తింటున్నా..కనిపిస్తుంది కదా బావ..రేయ్‌.అర గుండు వెధవ..నువ్వయినా చెప్పురా!
బ్రహ్మానందం: అయ్యా..ధర్మ ప్రభువులు..మీరు చికెన్‌ ఆరగిస్తున్న సంగతి తమరి బావగారికి అర్థకం కాలేదయ్యా..తినండి. అది ఎ..ఎ ఎంత రుచిగా ఉందో!
అహనా పెళ్లంట సినిమాలో ఉన్న సరదా సంభాషణలు జిల్లాలో కోళ్ల ధర పెరగడంతో నిజమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోజు రోజుకూ పెరుగుతున్న ధరలతో మాంసం ప్రియులు చికెన్‌ కొని తినలేకపోతున్నారు.  

కర్నూలు (వైఎస్‌ఆర్‌ సర్కిల్‌) : జిల్లా వ్యాప్తంగా చికెన్‌ ధరలు అమాంతంగా పెరిగాయి. పక్షం రోజుల క్రితం  రూ.160 ఉన్న కేజీ చికెన్‌ నేడు రూ.200కు చేరింది. స్కిన్‌లెస్‌ చికెన్‌ ధర రూ. 220 పలుకుతోంది.  
జిల్లాలో వెంకాయపల్లె, ఆదోని, నంద్యాల ప్రాంతాల్లో చిన్న స్థాయి కోళ్ల ఫారాలు ఉన్నాయి. వీటితో  తప్ప మరెక్కడా కోళ్ల ఉత్పత్తి జరగడం లేదు.  గతంలో ప్రతి రోజూ 10 వేల కేజీల చికెన్‌ వినియోగం ఉండేది.  ప్రస్తుతం 15వేల కేజీలకు పైగా పెరిగింది. 

ధరలు ఎందుకు పెరిగాయంటే..
వేసవి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు మించి నమోదవుతుండటంతో కోళ్ల పెంపకం భారంగా మారింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఎండ వేడిమి తాళలేక అనేక కోళ్లు మృత్యువాత చెందుతున్నాయి. దీంతో ఉత్పత్తి తగ్గడం..డిమాండ్‌ పెరగడంతో కోడి మాంసం ధరలు పెరిగాయని చికెన్‌ వ్యాపారులు చెబుతున్నారు. అదీగాక..రంజాన్‌ మాసం వచ్చిదంటే ప్రతి ప్రాంతంలో మాంసార ఇఫ్తార్‌ విందును ఏర్పాటు చేయడం ఆనవాయితీ. ఇదే అదునుగా చూసుకున్న వ్యాపారులు వేడుకను ఆసరగా చేసుకొని చికెన్‌ ధరలు అమాంతంగా పెంచేశారని పలువురు హోటల్‌ వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా..కర్నూలు జిల్లాకు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఫారం కోళ్లు సరఫరా అవుతాయి. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో అధికంగా డిమాండ్‌ ఉండడంతో ఉన్న కోళ్లనే వాహనాల్లో తరలిస్తున్నారు. రవాణాలో పలు కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో డీలర్లు చనిపోయిన కోళ్ల నష్టం వెల కూడా వినియోగదారుల మోపుతుండటంతో చికెన్‌ ధరలు పెరిగాయని పలువురు వ్యక్తం చేస్తున్నారు.  

పెరిగిన గుడ్ల ధరలు  
గుడ్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. 100 గుడ్లు ధర గతంలో రూ.280 ఉండగా.. ప్రస్తుతం రూ.320కి పెరిగింది. గుడ్లు కొనుగోలు చేసే వినియోగదారులు కూడా గుడ్లు తేలేస్తున్నారు. 

ప్రభుత్వం చేయూతనందించాలి
పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా కోళ్లు ఉత్పత్తి కావడం లేదు. ఉత్పత్తి అయిన కోళ్లు రవాణాలో మృతి చెందుతుండటంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలో కోళ్ల పరిశ్రమల స్థాపనకు ప్రభ్తుత్వం చేయూతనందించాలి.    – రాజారెడ్డి,  వ్యాపారి , డోన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top