కరోనా.. హైరానా..!

CHeemakurthi People Fear on Corona Positive Case - Sakshi

అనుమానితులు రిమ్స్‌కు తరలింపు  

ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి కోసం విస్తృత గాలింపు

చీమకుర్తి: ప్రార్థనల నిమిత్తం ఢిల్లీ వెల్లి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్థారణ కావడంతో చీమకుర్తి వాసుల్లో గుండె ఝల్లుమంది. ఆయనతో సంబంధం ఉన్నటువంటి బంధువులు, స్నేహితులు, ఇతరులతో కలిసి తిరిగాడని పోలీసులు, అధికారులు గుర్తించటంతో స్థానికుల్లో మరింత ఆందోళన నెలకొంది. ఇప్పటికే బంధువులు, స్నేహితులను 14 మందిని గుర్తించి ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. పాజిటివ్‌ వ్యక్తికి సమీపంలో నివాసం ఉంటున్న ఐదుగురు, చీమకుర్తి పట్టణంలో మరో ఐదుగురు, పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి అత్తగారి ఊరైన పల్లామల్లిలో మరో నలుగురు మొత్తం 14 మందిని రిమ్స్‌కు తరలించారు. ఆర్‌డీఓ ప్రభాకర్‌రెడ్డి, నియోజకవర్గం స్పెషలాఫీసర్‌ కే.అద్దెయ్య, తహసీల్దార్‌ కె.విజయకుమారి స్థానిక వైద్యసిబ్బందితో కరోనా అనుమానితుల వివరాలను సేకరించారు. కరోనా పాజిటివ్‌ వ్యక్తి చీమకుర్తితో పాటు అత్తగారి ఊరైన పల్లామల్లి వెళ్లి వచ్చాడు. తన భార్య గర్భవతి కావడంతో చీమకుర్తిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. దీంతో ఏఏ ప్రాంతాలలో ఎవరెవరుతో కలిసి మాట్లాడాడో ఆయా వివరాలను సేకరించే క్రమంలో పోలీసులు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్‌లు, వలంటీర్లు ఊపిరి పీల్చుకునే తీరిక లేకుండా సర్వేల మీద సర్వేలు చేస్తున్నారు.  

కుంకలమర్రు(కారంచేడు): మండలంలోని కుంకలమర్రు గ్రామానికి చెందిన 32 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకి ఒంగోలు రిమ్స్‌ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలిసిన గ్రామస్తులు భయంతో గడగడలాడిపోతున్నారు. వైరస్‌ సొకిన వ్యక్తి ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన రోజు నుంచి గ్రామంలోని అనేక ప్రాంతాల్లో తిరగడం, గ్రామంలో నెట్‌ సెంటర్‌ ఉండటం కూడా ఆందోళనకు గురిచేస్తోంది. అతనితో పాటు కలసిమెలసి ఉన్న 20 మంది బంధువులు, భార్య, కుమారుడు, కుమార్తెలను క్వారంటైన్‌కు తరలించారు. వీరిలో 20 మందిని చీరాలలోను, ముగ్గురిని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. వీరు కాకుండా అప్పటికే అతనికి వైద్య సేవలందించిన వైద్యుడు, ఏఎన్‌ఎంలు స్వచ్ఛంద నిర్బంధంలోకి వెళ్లారు. ఆశా కార్యకర్తను కూడా క్వారంటైన్‌కు తరలించారు. గ్రామంలో 12 టీంల ద్వార సుమారు 50 మంది వైద్య సిబ్బంది గ్రామంలోని ప్రతి ఇంటిని జల్లెడ పట్టే పనిలో నిమగ్నమయ్యారు.

కందుకూరు: కందుకూరుకు చెందిన ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించడంతో పట్టణంంలో అలజడి రేగింది. ఆ ముగ్గురితో ఎంత మందికి సంబంధం ఉంది, ఎవరెవరు కలిశారనే అంశం చర్చనీయాశంగా మారింది. ఇప్పటికే పాజిటివ్‌ రిపోర్టు వచ్చిన ముగ్గురి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు. మరోవైపు ఇతర వ్యక్తులను గుర్తించే పనిలో ఉన్నారు. కొందరు స్వచ్ఛందంగా ముందుకు వస్తుండగా, మరికొందరని అధికారులు గుర్తించి క్వారంటైన్‌ కేంద్రాలకు పంపుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 40 మందిని గుర్తించి క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు. ఇంకా మరింత మంది ఉండవచ్చనే కోణంలో అధికారులు గాలింపు చేస్తున్నారు. ప్రస్తుతం ఓగూరు వద్ద ఉన్న హార్టికల్చర్‌ కాలేజీ, పట్టణంలోని పాలటెక్నిక్‌ కాలేజీల్లో క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మూడు పాజిటివ్‌ కేసులతో పట్టణం మొత్త హై అలెర్టు జోన్‌ కింద అధికారులు ప్రకటించారు. ఆంక్షలను కఠిన తరం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top