పెళ్లి కానుక కోసం.. కళ్లు కాయలు

Chandranna Pelli Kanuka Financial Aid Pending In Andhra Pradesh - Sakshi

58,753 జంటల ఎదురు చూపులు

కల్యాణ మిత్రలు పెళ్లి ఫొటోలు తీసి ఉన్నతాధికారులకు పంపాకే మంజూరు

మంజూరైన నెలకు కూడా అందని పెళ్లి కానుక

అమలుకాని.. పెళ్లి నాటికి కానుక అందిస్తామన్న సీఎం హామీ

సాక్షి, అమరావతి:  పెళ్లి నాటికి పెళ్లి కానుక అందిస్తాం.. అని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెబుతున్నా ఆచరణలో అది అమలుకావడం లేదు. పెళ్లి సమయంలో కల్యాణ మిత్రలు వచ్చి ఫొటోలు తీసుకుని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశాకే కానుకను ఆన్‌లైన్‌ ద్వారా పెళ్లి చేసుకున్న జంటలకు ప్రభుత్వం చెల్లిస్తోంది. పెళ్లి కానుక అందించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖలు వారి అధికారుల ద్వారా రిపోర్టులు తెప్పించుకుంటున్నాయి. ఇవి కాకుండా మండలానికి ఇద్దరు చొప్పున స్వయం సహాయక సంఘాల నుంచి నియమితులైన కల్యాణ మిత్రలు.. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె ఇంటికెళ్లి విచారణ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాతే పెళ్లి పత్రికను తీసుకుంటారు. వీరిద్దరికి పెళ్లి జరుగుతుందని తెలిసిన వారి నుంచి సాక్ష్యం తీసుకుంటారు. పెళ్లి సమయంలో అక్కడికెళ్లి ఫొటోలు తీసుకుని ఉన్నతాధికారులకు పంపించాల్సి ఉంటుంది. ఈ తతంగం పూర్తయితేగానీ పెళ్లి కానుక అందని పరిస్థితి. 

ఆంక్షలతో ఆలస్యం 
ఈ పథకాన్ని 2018 ఏప్రిల్లో ప్రారంభించారు. అప్పటి నుంచి 45,875 జంటలు పెళ్లి కానుక కోసం దరఖాస్తు చేసుకోగా కానుక ఇచ్చింది మాత్రం 16,956 జంటలకే. అంటే ఇంకా 28,919 జంటలకు అందాల్సి ఉంది. పథకం ప్రారంభానికి ముందు.. 15 రోజులు ముందుగా పెళ్లి కానుక కోసం దరఖాస్తు చేసుకోవాలని నిబంధన విధించారు. ఈ కారణంగా చాలా మంది దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోయారు. వీరందరికీ అక్టోబర్‌లో ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం కల్పించారు. ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్న జంటలు 29,834 ఉన్నాయి. అంటే ఇంకా కానుక అందుకోవాల్సిన జంటలు మొత్తం 58,753 మంది ఉన్నాయి. పెళ్లి కానుక గురించి గొప్పలు చెబుతున్న ప్రభుత్వం మంజూరులో మాత్రం రకరకాల ఆంక్షలు పెడుతోంది. మంజూరు చేయగానే పంపిణీ చేసినట్టుగా ప్రచారం చేసుకుంటోంది. అయితే మంజూరు చేశాక నెలకు కూడా కానుక అందడం లేదు. పెళ్లి కానుకను కూడా రాజకీయాలకు వాడుకోవాలనే ఆలోచనలో టీడీపీ ప్రభుత్వం ఉండటంపై నూతన వధూవరులు మండిపడుతున్నారు. 

రాష్ట్రంలో రకరకాలుగా.. 
పెళ్లికానుక కింద షెడ్యూల్డ్‌ కులాల వారికి రూ.40 వేలు, షెడ్యూల్డ్‌ తెగల వారికి రూ.50 వేలు, బీసీలకు రూ.35 వేలు, మైనార్టీలకు రూ.50 వేలు ఇస్తున్నారు. ఈబీసీలకు ఇవ్వడం లేదు. అయితే తెలంగాణలో మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీలకు.. రూ.1,00,116 చెల్లిస్తున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top