ఢిల్లీ మెట్రోరైలులో చంద్రబాబు ప్రయాణం | Chandrababu traveling in Delhi Metro | Sakshi
Sakshi News home page

ఢిల్లీ మెట్రోరైలులో చంద్రబాబు ప్రయాణం

Mar 29 2015 2:55 AM | Updated on Oct 16 2018 5:04 PM

ఢిల్లీ మెట్రోరైలులో చంద్రబాబు ప్రయాణం - Sakshi

ఢిల్లీ మెట్రోరైలులో చంద్రబాబు ప్రయాణం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీలో శనివారం మెట్రో రైలులో ప్రయాణించారు.

శివాజీ స్టేడియం మెట్రో స్టేషన్ నుంచి విమానాశ్రయానికి..
ఢిల్లీ మెట్రో పటిష్టంగా ఉంది: బాబు కితాబు
 

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీలో శనివారం మెట్రో రైలులో ప్రయాణించారు. శివాజీ స్టేడియం మెట్రో స్టేషన్ నుంచి విమానాశ్రయం వరకు ప్రయాణించి మెట్రోరైలు పనితీరును పరిశీలించారు. మొదట కాన్వాయ్‌లో మెట్రో స్టేషన్‌కు చేరుకున్న చంద్రబాబుకు ఢిల్లీ మెట్రోరైల్ కార్పోరేషన్ అధికారులు మెట్రో రైలు నిర్వహణ, టికెట్ వెండింగ్ మెషీన్ నుంచి టికెట్లు తీసుకునే విధానం, ఆటోమెటిక్ ఫేయిర్ కలెక్షన్ తీరు, యంత్రాల పనితీరును వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ మెట్రో సాంకేతికంగా చాలా పటిష్టంగా ఉందని, దేశంలో పెరుగుతున్న జనాభా దృష్ట్యా మెట్రో కారిడార్ ప్రజా రవాణాకు చాలా ఉపయోగపడుతుందన్నారు. ప్రజా రవాణాను ఆదర్శవంతంగా చేయడానికి మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్టేషన్ ఏర్పాటు చేసుకోవాలన్నారు.

మెట్రో రైలు, స్పీడ్ రైలు, రోడ్డు, విమానయానం అన్నీ సమీకృతం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అభివృద్ధి లక్ష్యంగా దూరదృష్టితో పనిచేయాలని, అది ఉత్తమ సాంకేతికతను ఉపయోగించినప్పుడే సాధ్యపడుతుందన్నారు. ఏపీలో విజయవాడ, వైజాగ్‌లో రెండు మెట్రో కారిడార్ల నిర్మాణానికి సంబంధించి త్వరగానే ఫీజిబిలిటీ నివేదిక అందుతుందని చెప్పారు. వాణిజ్యపరంగా నిర్వహిస్తే ఏ ప్రాజెక్టైనా సాధ్యపడుతుందని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. క్రాస్ సబ్సిడీ ఇచ్చినా అనేక విధాలుగా లాభాలొస్తాయన్నారు. రోడ్లు నిర్మించి టోల్ పెట్టాక ప్రజలు డబ్బులు చెల్లించే పరిస్థితి ఏర్పడిందని, అలానే మౌలిక సదుపాయాల కల్పనలో ప్రజలను భాగస్వాములను చేస్తే అన్ని సాధ్యమవుతాయని పేర్కొన్నారు. చంద్రబాబు వెంట కేంద్ర మంత్రి సుజనా చౌదరి, రాష్ట్ర మంత్రి నారాయణ తదితరులున్నారు.

వచ్చేనెలలో విజయవాడ, వైజాగ్ మెట్రో నివేదిక: డీఎంఆర్‌సీ డెరైక్టర్ శర్మ

విజయవాడ, వైజాగ్ మెట్రో కారిడార్ల ఫీజిబిలిటీ నివేదికను త్వరగానే అందచేయనున్నట్టు డీఎంఆర్‌సీ డెరైక్టర్ ఎస్.డి.శర్మ వెల్లడించారు. విజయవాడ, వైజాగ్‌లో 25 కిలోమీటర్ల చొప్పున మెట్రో కారిడార్లు ఉంటాయని చెప్పారు. విజయవాడలోని రెండు కారిడార్లలో 25 స్టేషన్లు ఉంటాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement