టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నారని..
-
చంద్రబాబు ఢిల్లీ టూర్‌పై కొణతాల వ్యాఖ్య
-
జగన్ బెయిల్‌ను అడ్డుకోవాలని కాంగ్రెస్ పెద్దల కాళ్లపై పడటానికి ఢిల్లీ వెళ్తున్నారంటూ ధ్వజం
-
రాష్ట్రం రగులుతూ ఉంటే నీచరాజకీయాలతో ప్రజలను మోసగిస్త్తున్నారని విమర్శ
నక్కపల్లి (విశాఖ జిల్లా), న్యూస్‌లైన్: టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నారని.. వాటిని మూడు నెలలకోసారి రెన్యువల్ చేయించుకునేందుకు తరచూ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను రహస్యంగా కలుస్తున్నారని వైఎస్సార్ సీపీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ గురించి మాట్లాడేందుకే చంద్రబాబు ఢిల్లీ యాత్రకు వెళుతున్నారని టీడీపీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానించటం బాబు చీకటి ఒప్పందాలకు నిదర్శనమని పేర్కొన్నారు. సమైక్య శంఖారావం యాత్రలో ఉన్న షర్మిలను కలిసేందుకు ఆదివారం విశాఖ జిల్లా నక్కపల్లికి వచ్చిన కొణతాల ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.
జగన్‌మోహన్‌రెడ్డి ప్రభంజనాన్ని అడ్డుకునే దమ్ము, ధైర్యం లేకనే టీడీపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కై సీబీఐ చేత అక్రమ కేసులు బనాయించి ఆయనను అరెస్టు చేయించారని గుర్తుచేశారు. తుది చార్జిషీట్ల పేరుతో బెయిల్ రాకుండా అడ్డుకోవటంలో ఆ రెండు పార్టీల పాత్ర ఉందన్న విషయం సుస్పష్టమన్నారు. తుది చార్జిషీటు దాఖలుకు సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన గడువు ఈ నెల 8వ తేదీతో పూర్తయిందని.. అది దాఖలయ్యాక జగన్‌కు బెయిల్ రావటం ఖాయమని చంద్రబాబు భయపడుతున్నారని కొణతాల చెప్పారు. బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, ఆర్థికమంత్రి చిదంబరం తదితర కాంగ్రెస్ పెద్దల కాళ్లా వేళ్లా పడటానికి ఇప్పుడు బాబు ఢిల్లీ వెళుతున్నారని ధ్వజమెత్తారు. విభజన ప్రకటనతో రాష్ట్రం రావణ కాష్టంలా రగిలిపోతుంటే చంద్రబాబు నీచరాజకీయాలకు పాల్పడుతూ ఇరు ప్రాంతాల వారిని మోసం చేస్తున్నారని ఈసడించారు.
బాబు ఆత్మగౌరవం పేరుతో ఆత్మవంచన యాత్ర చేపట్టినా.. ఇప్పటివరకు ఎక్కడా తాను సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటన చేయలేదని కొణతాల గుర్తుచేశారు. కాంగ్రెస్, టీడీపీలు రెండూ ఏకమై ఎన్ని కుట్రలు పన్నినా ప్రజాకోర్టులో జగన్‌మోహన్‌రెడ్డి నిర్దోషిగా బయటకు వస్తారని స్పష్టంచేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకటరావు, పార్టీ నాయకుడు వీసం రామకృష్ణ పాల్గొన్నారు.