హోదా సాధించలేకపోయాం: చంద్రబాబు

Chandrababu Naidu Talk On Special Status Statement - Sakshi

హోదా తీర్మానంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను తాము సాధించలేకపోయామని, హోదా సాధన బాధ్యత ప్రజలు వైఎస్సార్‌సీపీకే ఇచ్చారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఏపీ ప్రత్యేక హోదా తీర్మానంపై చర్చలో భాగంగా మంగళవారం చంద్రబాబు మాట్లాడారు. గడిచిన ఐదేళ్ల కాలంలో హోదా సాధనకు ప్రయత్నించామని, కానీ మావల్ల కాలేదని పేర్కొన్నారు. తాము విఫలమైనందుకు ప్రజలు వైఎస్సార్‌సీపీకి 151 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి తెలంగాణకు చెందిన ఏడు ముంపు మండలాలను తమ ప్రభుత్వమే ఏపీలో  విలీనం చేసిదని చంద్రబాబు తెలియజేశారు. ప్రత్యేక హోదా అనే పదాన్ని కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదని, అందుకే ప్యాకేజీకి ఒప్పుకున్నామని టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్యాకేజీ ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ.. ఏపీ శాసనసభ తీర్మానం చేసిందని ఆయన గుర్తుచేశారు. 

తమకు ప్యాకేజీ వద్దని, రాష్ట్రాన్ని సంజీవని అయిన ప్రత్యేక హోదానే కావాలని సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సభలో స్పష్టం చేసిన విషయంతెలిసిందే. చివరిరోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన ప్రత్యేక హోదా కోరుతూ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీకి ధన్యవాదాలు తెలుపుతూ ఇదే అసెంబ్లీ వేదికగా తీర్మానం చేసిందని, అయితే ఆ ప్యాకేజీ తమకు వద్దని హోదా కావాలనే ఉద్దేశంతోనే ఈ తీర్మానం ప్రవేశం పెడుతున్నట్లు వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ఏపీకి జీవనాడి అయిన ప్రత్యేకహోదాను జాప్యం లేకుండా ఇవ్వాల్సిందిగా 5 కోట్ల ప్రజల తరఫున ప్రకటన చేస్తున్నట్లు తెలిపారు. సభ చర్చలో భాగంగా హోదా తీర్మానంపై పలువురు సభ్యులు మాట్లాడారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top