
పార్టీ శ్రేణులతో సమీక్షిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు
సాక్షి, కర్నూలు: టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలులో నిర్వహిస్తున్న నియోజకవర్గాల సమీక్ష సమావేశాలను కొందరు ఆ పార్టీ నేతలు లైట్‌గా తీసుకున్నారు. నందికొట్కూరు, కోడుమూరు నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బండి జయరాజు, రామాంజనేయులు డుమ్మా కొట్టారు. అలాగే కోడుమూరు నియోజకవర్గ నేత విష్ణువర్ధన్‌రెడ్డి మధ్యలోనే అలిగి వెళ్లిపోయారు. గతంలో ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా పనిచేసిన వీరభద్రగౌడ్ హాజరు కాలేదు. నగర శివారులోని వీజేఆర్ కన్వెన్షన్ హాలులో రెండో రోజు మంగళవారం చంద్రబాబు ఆరు నియోజకవర్గాల నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మొదట నందికొట్కూరుపై సమీక్షించారు. బండి జయరాజు గైర్హాజరు కావడంతో అంతా మాండ్ర శివానందరెడ్డి చూసుకున్నారు. అనంతరం కోడుమూరు సమీక్ష జరగ్గా.. రామాంజనేయులు హాజరుకాలేదు. గతంలో ఇక్కడ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించిన డి.విష్ణువర్ధన్‌రెడ్డి హాజరైనప్పటికీ కోట్ల వర్గానికి, తన వర్గానికి ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లును డిమాండ్ చేశారు. ఇందుకు సోమిశెట్టి ఒప్పుకోకపోవడంతో పార్టీ కోసం కష్టపడిన నేతలను విస్మరిస్తారా అంటూ విష్ణు తన మద్దతుదారులతో కలిసి అలిగి వెళ్లిపోయారు. దీంతో సమీక్షలో కోట్ల చక్రపాణిరెడ్డి అన్నీ తానై వ్యవహరించారు.
ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ, నంద్యాల నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి, పత్తికొండ నుంచి కేఈ శ్యామ్‌బాబు, ఆలూరు నుంచి కోట్ల సుజాతమ్మ హాజరయ్యారు. అంతకుముందు మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చంద్రబాబును కలిశారు. ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఇన్‌చార్జ్ వీరభద్రగౌడ్ హాజరు కాలేదు. అయితే మసాల పద్మజ, వైకుంఠం కుటుంబ సభ్యులు వచ్చారు. సమీక్షల సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి.. నాయకులు, కార్యకర్తలకు అండగా ఉండకపోతే వెనుకబడి పోతామని అన్నారు. ఇక నుంచైనా క్రమం తప్పకుండా నియోజకవర్గాల్లో ఉండాలని వేడుకున్నట్లు తెలిసింది. ఎక్కడికక్కడే ఎమ్మెల్యేలపై లేనిపోని ఆరోపణలు చేయాలని, వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని చెప్పేందుకు ప్రయత్నించాలని సూచినట్లు తెలుస్తోంది. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కేఈ ప్రభాకర్, బీటీ నాయుడు, మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.