చంద్రబాబును తరిమికొట్టడం ఖాయం

చంద్రబాబును తరిమికొట్టడం ఖాయం


బుట్టాయగూడెం : రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేస్తున్న చంద్రబాబును ప్రజలు ఆరు నెలల్లో తరిమికొట్టి చంద్రగిరి పంపేయటం ఖాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద శనివారం సీపీఎం భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు మధు అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పాలన ఎక్కువ రోజులు సాగదన్నారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంభించిన నైజాం సర్కారునే ప్రజలు తరమికొట్టారన్న విషయాన్ని టీడీపీ నేతలు గుర్తించుకోవాలన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న అహంకారంతో టీడీపీ నాయకులు ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. రుణమాఫీపై తొలి సంతకమన్న చంద్రబాబు అధికారం చేపట్టి ఐదు నెలలనైనా ఒక్కరి రుణాన్ని కూడా రద్దు చేయలేకపోయారని మధు ఎద్దేవా చేశారు.

 

 సర్వేల పేరుతో అర్హులైన పింఛన్‌దారులను కూడా జాబితాల తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ బలంగా ఉందని చంద్రబాబు అనుకుంటున్నారని ప్రజల్లో అంతకంటే ఎక్కువ వ్యతిరేకత ఉందని మధు విమర్శించారు. పార్టీలు వేరైనా బీజేపీ, టీడీపీ విధానాలు ఒక్కటేనని ఆరోపించారు. పేద ప్రజలకు ఉపయోగపడే ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేస్తుండడం దారుణమని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు భూమికి భూమి ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి డిమాండ్ చేశారు. అనాదిగా గిరిజనులు సాగు చేస్తున్న భూముల్లోకి గిరిజనేతరులు అక్రమంగా ప్రవేశించినా అధికారులు పట్టించుకోవడం లేదని, ప్రశ్నించిన వారిపై పోలీసులు తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి మంతెన సీతారాం మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో శాంతికి భంగం కలిగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. డివిజన్ కార్యదర్శి ఎ.రవి, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు  తెల్లం రామకృష్ణ, కార్యదర్శి పోలోజు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top