చంద్రన్న ఎన్నికల గారడీ

Chandrababu Naidu Cheat Dwcra Groups With Post Dated Checks - Sakshi

పసుపు–కుంకుమ పేరుతో మహిళా సంఘాలకు తాయిలాలు

గతంలో ఇచ్చిన హామీతో రుణమాఫీకాక పీకల్లోతు కష్టాలు

మరోసారి మోసం చేసేందుకు సిద్ధమైన టీడీపీ ప్రభుత్వం

బత్తలపల్లి : ఎన్నికలు సమీపిస్తుండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారడీ మొదలైంది..2014 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏఒక్కటీ నెరవేర్చకపోగా ఇప్పుడు ఎన్నికల తాయిలాలు వేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డ్వాక్రా, రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన బాబు..అధికారం చేపట్టాక ఆవిషయాన్ని తుంగలో తొక్కి డ్వాక్రా మహిళలను పూర్తిగా నట్టేట ముంచాడని మహిళలు ఒక వైపు వాపోతున్నారు. మహిళలను మభ్యపెట్టేందుకు చెక్కుల పంపిణీకి శ్రీకారం చుట్టారంటున్నారు. 

విడతలవారీగా మోసం
ముదిగుబ్బకు చెందిన సుజాతమ్మ ఓ పొదుపు సంఘంలో సభ్యురాలు. పసుపు –కుంకుమ పేరుతో ప్రభుత్వం ఇస్తున్న రూ.10 వేలు ఇస్తోందని ప్రకటించడంతో కరువు కాలంలో కొంతైనా ఆసరాగా ఉంటుందనుకుంది. కుటుంబ అవసరాలు తీరుతాయని సంబరపడింది. ప్రభుత్వం చెక్కుల రూపంలో మొదటి విడతగా రూ.2500 మాత్రమే ఇస్తోందని, పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులు ఇచ్చి మళ్లీ మోసం చేస్తున్నారేమోనని నిట్టూరుస్తోంది. నాలుగున్నరేళ్లలో ఏ ఒక్క హామీనీ పూర్తిగా నెరవేర్చని ప్రభుత్వం..ఇప్పటికప్పుడు ఎన్నికలకోసమే మభ్యపెడుతోందని అంటోంది. 

గందరగోళంగా ఉంది..
తాడిమర్రికి చెందిన నాగరత్నమ్మ పొదుపు సంఘం సభ్యురాలు. గతంలో పసుపు–కుంకుమ పేరుతో ప్రభుత్వం రూ.10 వేలు పొదుపు సంఘాల సభ్యులకు పెట్టుబడి నిధి కింద నాలుగు విడతలుగా ఇస్తామని ప్రకటించింది. ఈ మొత్తాన్ని ఇద్దరు సభ్యులకు అప్పుగా ఇచ్చి, తద్వారా వచ్చే వడ్డీని వాడుకోవాలని సూచించింది. కుటుంబ అవసరానికి వినియోగించుకునే అవకాశం లేకపోవడంతో అయోమయానికి గురవుతోంది.

మరోమారు మోసానికి తెర
చంద్రబాబు అధికారం చేపట్టగానే రుణమాఫీ చేస్తామని చెప్పి ఇంత వరకూ చేయలేదు. రుణమాఫీ హామీతో మహిళా సంఘాలు బ్యాంకులకు చెల్లించాల్సిన రుణ వాయిదా చెల్లించకపోవడంతో అసలు వడ్డీ తడిసి మోపెడైంది. ఆర్థికంగా మహిళా సంఘాలు చితికిపోయాయి. ధర్మవరం నియోజకవర్గంలో కొన్ని బ్యాంకర్లు డ్వాక్రా సంఘం మహిళల ఖాతాల్లో జమ అయిన గ్యాస్‌ డబ్బులు, ఉపాధి హామీ కూలీల ఖాతాల్లో ఉన్న డబ్బును అప్పు కింద జమచేసుకున్న సంఘటనలు ఉన్నాయి. అందుకే ఈ సారి డ్వాక్రా మహిళలు చంద్రబాబు హామీలను నమ్మేందుకు సిద్ధంగా లేమని బహిరంగంగా విమర్శిస్తున్నారు.

కొత్త డ్రామాకు శ్రీకారం..
మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండడంతో చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారు. డ్వాక్రా సంఘాల్లోని ప్రతి సభ్యురాలికీ ఒక్కొక్కరికి రూ.10వేలు దఫాలుగా ఇస్తామని పోస్ట్‌ డేటేడ్‌ చెక్కులను మహిళలకు పంపిణీ చేస్తున్నారు. అయితే ఇక్కడ మరో విషయం ఏమిటంటే చెక్కులు ఇచ్చిన వెంటనే మార్చుకునేందుకు వీలుకాదు. ప్రస్తుతం ఇచ్చిన చెక్కులపైన  ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ అనినుంది. గత ఎన్నికల ముందు చంద్రబాబు మోసపూరిత హామీలను నమ్మి పూర్తిగా మోసపోయాం..ఇక ఎప్పుడూ బాబూ మాటలను నమ్మమని మహిళలు అంటున్నారు.

రుణాలు మాఫీకాలేదు
చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నమ్మి రుణాలు తీసుకుంటే ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. ఈ సారి బాబు మాటలు నమ్మి మోసపోయేందుకు సిద్ధంగా లేం. నాలుగున్నరేళ్లుగా ఏమీ చేయకుండా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో మహిళలు గుర్తుకు వచ్చారా?    – సుగుణ, పొదుపు సంçఘం సభ్యురాలు, ధర్మవరం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top