
సోషల్ మీడియాను తట్టుకోలేకపోతున్నాం
తాను టెక్నో సావీ అయినా, ఏ రాష్ట్రం అందుకోలేని విధంగా టెక్నాలజీలో ముందున్నా సోషల్ మీడియాను మాత్రం తట్టుకోలేకపోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారు.
టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు
సాక్షి, అమరావతి: తాను టెక్నో సావీ అయినా, ఏ రాష్ట్రం అందుకోలేని విధంగా టెక్నాలజీలో ముందున్నా సోషల్ మీడియాను మాత్రం తట్టుకోలేకపోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారు. ఏపీలో నెటిజన్లు తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకున్నట్లుగా ఉందని, ప్రతి అంశం పార్టీకి వ్యతిరేకంగా ప్రమోట్ అవుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో అందరూ ఆలోచించాలని పార్టీ నాయకులకు సూచించారు. ఆయన ఉండవల్లిలోని తన నివాసంలో మంగళవారం ఉదయం తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.
విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు సోషల్ మీడియాను ఫాలో కావడంలేదని, చాలామందికి దీనిపై అవగాహన లేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇప్పటికైనా తేరుకుని సోషల్ మీడియాను చురుగ్గా ఫాలో కావాలని, టీడీపీకి, టీడీపీ నాయకులకు వ్యతిరేకంగా వచ్చే వాటిపై ఎదురుదాడి చేయాలని సూచించారు. సీనియర్ నాయకులు కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారనీ, పార్టీలో క్రమశిక్షణ లోపించిందని కోపగించారు.