
సాక్షి, హైదరాబాద్ : తిరుపతిలో జరిగిన ధర్మ పోరాట సభలో సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. నమ్మక ద్రోహం, కుట్రలపై సుదీర్ఘ ప్రసంగం చేస్తూ... బ్రిటీష్ వాళ్లపైనే పోరాడింది తెలుగుదేశం పార్టీ అంటూ స్పీచ్ దంచికొట్టారు. అసలు తెలుగుదేశం ఆవిర్భవించిందే 1982లో అయితే బ్రిటీష్ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ఎలా పోరాడుతుందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
బ్రిటీష్ వాళ్లపైనే పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీనా, అయ్యో ఈ విషయం ఏ పుస్తకాల్లోనూ రాయకపోవడం తెలుగు జాతికే అవమానం. దీని కోసం మనమంతా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెడితే..
'గాంధీజీతోని సత్యాగ్రం చెప్పిచ్చిందే నేను...
భగత్ సింగ్ తోని బాంబు ఏపిచ్చిందే నేను...
ఆజాద్ తోని కాల్పులు జరిపించిందే నేను...
నేతాజీతోని ఆర్మీ పెట్టిచ్చిందే నేను...
అల్లూరికి విలువిద్య నేర్పిందే నేను...
శివాజీకి కత్తిసాము నేర్పిందే నేను...
రఘుతో ఈ పోస్ట్ పెట్టించిందే నేను...
మీరు ఈ పోస్టుకు లైకులు కొట్టాలని చెప్పిందే నేను... అంటూ రఘు అనే మరో నెటిజన్ చంద్రబాబు వ్యాఖ్యలపై సెటైర్ వేశారు.
ఇక కొందరైతే మహాత్మా గాంధీ ఫోటో వెనకాల చంద్రబాబు కూర్చున్నట్టు, సుభాష్ చంద్రబోస్ పక్కన లోకేశ్ నడుస్తున్నట్టు ఫోటోలు పెట్టి చంద్రబాబు వ్యాఖ్యలపై తెగ నవ్వేసుకుంటున్నారు. మంగళవారం ఉదయం నుంచి ఫేస్ బుక్, ట్విటర్, వాట్సాప్‌లలో చంద్రబాబు ధర్మపోరాట సభలో పోరాటంపై చేసిన వ్యాఖ్యలే హాట్ టాపిక్‌గా మారాయి.
సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న కొన్ని చిత్రాలు