
వైఎస్ జగన్‌పై దాడి దురదృష్టకరం
సాక్షి, విజయవాడ : ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై దాడి దురదృష్టకరమని ప్రత్యేక హోదా- విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ అన్నారు. శనివారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌పై దాడి కేసులో రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని వైఎస్సార్ సీపీ నాయకులు చెప్పడంలో ఏమాత్రం తప్పులేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ తీరు, పోలీసుల వ్యవహార శైలే ఇందుకు కారణమని పేర్కొన్నారు.
జై ఆంధ్ర ఉద్యమ వీరులకు గౌరవం ఏదీ?
విభజన హామీల అమలుపై అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లి రాష్ట్రపతిని కలుస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.. కానీ ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదని చలసాని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా నవంబర్ 12 నుండి విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పర్యటన చేపడతామని ప్రకటించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం (నవంబరు 1) నాడు జై ఆంధ్ర ఉద్యమ వీరులను గౌరవించుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.