
సీమాంధ్ర సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు
సీమాంధ్ర సమగ్రాభివృద్ధికోసం అన్ని రాజకీయపార్టీలు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని ఆంధ్రా మేధావుల వేదిక అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
పార్టీలను కోరిన ఆంధ్రా మేధావుల వేదిక నేత చలసాని
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర సమగ్రాభివృద్ధికోసం అన్ని రాజకీయపార్టీలు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని ఆంధ్రా మేధావుల వేదిక అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వేదిక ఆధ్వర్యంలో ఆదివారమిక్కడ ‘సీమాంధ్ర ముందున్న సవాళ్లు-మెరుగైన భవిష్యత్తుకు మార్గదర్శక ప్రణాళిక’ అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. చలసాని మాట్లాడుతూ.. హేతుబద్ధతతో, ఒక జాతీయ విధానంతో అందరికీ న్యాయం చేస్తూ రాష్ట్ర విభజన చేసినట్టయితే బాగుండేదన్నారు.
సీమాంధ్రలో ఉన్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఓ పుస్తకాన్ని రూపొందించి ప్రజల్లోకి తీసుకెళతామని, తద్వారా రాజకీయ పార్టీలపై ఒత్తిడి పెంచి సీమాంధ్ర ఆర్థికాభివృద్ధికోసం ప్రణాళిక రూపొందించేలా చేస్తామని చెప్పారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. సీమాంధ్రలో వనరులను ఉపయోగించుకుని అన్నిరంగాల్లో అభివృద్ధి అయ్యేలా కృషి చేయాలని సూచించారు. సమావేశంలో విద్యుత్, సహజ వనరులు, మౌలిక సదుపాయాలు, నీటిపారుదల, ఆర్థిక రంగం, రాజధాని లాంటి అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ కాంతారావు, విశ్రాంత ఐపీఎస్ గుర్రప్ప, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.