
సాక్షి, హైదరాబాద్ : ర్యాంకుల వ్యవహారంలో కార్పోరేట్ కాలేజీలు శ్రీ చైతన్య, నారాయణ యాజమాన్యాల మధ్య వార్ వేడెక్కింది. తమ ర్యాంకులను నారాయణకు వచ్చినట్టు చెప్పుకుంటున్నారని చైతన్య కాలేజీల చైర్మన్ బీవీ రావు ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ఎంసెట్‌లో తమకు టాప్ ర్యాంకు వస్తే నారాయణకు వచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణ, శ్రీ చైతన్య కలిసి స్టార్ట్ చేసిన శార్వాణి గ్రూప్ పనిచేయడం లేదని, ప్రస్తుతం ఈ రెండు వేర్వేరని స్పష్టం చేశారు. ఇక నుంచి చైనా( చైతన్య-నారాయణ) బ్యాచ్‌లు ఉండవన్నారు.
శ్రీ చైతన్య స్కూల్‌లో చదువుకున్న విద్యార్థులను నారాయణ.. తమ విద్యార్థులుగా చెప్పుకుంటుందని మండిపడ్డారు. జేఈఈలోని టాప్ 5 ర్యాంకులు తమ విద్యార్థులవేనని, కానీ నారాయణ ర్యాంకుల విషయంలో తప్పుడు ప్రకటనలు చేస్తోందన్నారు. అవసరమైతే దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్, జేఈఈ, ఎంసెట్ ఫలితాల్లో ఇరు కాలేజీలు ఒకే ర్యాంకులు వచ్చాయని ప్రకటనలివ్వడంపై సోషల్ మీడియాలో విమర్శలొస్తున్నాయి.