ఈఏపీ సెట్‌లో బాలురు భళా | Boys secured top 10 ranks in Engineering and Agriculture and Pharmacy category | Sakshi
Sakshi News home page

ఈఏపీ సెట్‌లో బాలురు భళా

Jun 9 2025 6:03 AM | Updated on Jun 9 2025 6:03 AM

Boys secured top 10 ranks in Engineering and Agriculture and Pharmacy category

ఏపీఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల చేస్తున్న సెట్‌ ఛైర్మన్, జేఎన్‌టీయూకే వీసీ సీఎస్‌ఆర్‌కె ప్రసాద్, కన్వీనర్‌ వీవీ సుబ్బారావు

ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో టాప్‌–10 ర్యాంకులు అబ్బాయిలవే

ఇంజినీరింగ్‌లో బాలురు 70.33, బాలికలు 73.37 శాతం ఉత్తీర్ణత

అగ్రికల్చర్, ఫార్మాలో బాలురు 89.92, బాలికలు 89.76 శాతం ఉత్తీర్ణత

మొత్తం 75.67 శాతం ఉత్తీర్ణత

బాలాజీ చెరువు (కాకినాడ సిటీ)/కందుకూరు రూరల్‌/ శ్రీకాళహస్తి/పెనమలూరు/ఆలమూరు/పాలకొల్లు సెంట్ర ల్‌/తాడేపలిలగూడెం : బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, ఫార్మాడీ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఇంజినీరింగ్, అగ్రిక ల్చర్, ఫార్మసీ కామన్‌ ఎంట్రెస్ట్‌ టెస్ట్‌ (ఏపీ ఈఏపీ సెట్‌) ఫలితాల్లో అబ్బాయిలు పూర్తి ఆధిపత్యం కనబరిచారు. ఇంజినీరింగ్‌తో పాటు అగ్రికల్చర్‌ విభాగంలో టాప్‌–10 ర్యాంకులను వారే కైవసం చేసుకున్నారు.

గత ఏడాది ఇంజినీరింగ్‌లో టాప్‌–10 ర్యాంకులు అబ్బాయిలు దక్కించుకోగా, అగ్రికల్చర్‌ విభాగంలో ఆరుగురు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు ర్యాంకులు సాధించారు. కానీ, ఈ ఏడాది మాత్రం రెండు విభాగాల్లోనూ బాలురే టాప్‌–10 ర్యాంకులన్నింటినీ కొల్లగొట్టారు. ఏపీ ఈఏపీ సెట్‌ ఫలితాలను జేఎన్‌టీయూ–కాకినాడలో సెట్‌ చైర్మన్, వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్, సెట్‌ కన్వీనర్‌ వీవీ సుబ్బారావు ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. 

ఇంజినీరింగ్‌ విభాగానికి 2,80,611 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,64,840 మంది హాజరయ్యారు.  1,89,748 మంది (71.65 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 1,05,436 (70.33 శాతం) మంది, బాలికలు 84,313 (73.37 శాతం) మంది ఉన్నారు. అలాగే, అగ్రికల్చర్‌ విభాగంలో 81,837 మంది దరఖాస్తు చేసుకోగా 75,460 మంది పరీక్ష రాశారు. వీరిలో 67,761 మంది (89.8 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 16,097 (89.92 శాతం) మంది, బాలికలు 51,664 (89.76 శాతం) మంది ఉన్నారు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఇంజినీరింగ్‌ వైపు అత్యధికంగా బాలురు, అగ్రి కల్చర్‌ వైపు బాలికలు మొగ్గు చూపారు. మొత్తం మీద 75.67 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

25 శాతం వెయిటేజీతో ర్యాంకులు..
మే 19 నుంచి 27 వరకు కంప్యూటర్‌ బేస్డ్‌ (సీబీటీ) విధానంలో పరీక్ష నిర్వహించినట్లు సెట్‌ చైర్మన్, జేఎన్‌టీయూకే వీసీ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ చెప్పారు. పరీక్షలు పూర్తయిన 12 రోజుల్లో ఫలితాలు విడుదల చేశామన్నారు. ఈఏపీ సెట్‌ పూర్తయిన తరువాత ప్రాథమిక కీ విడుదల చేశామని, అభ్యంతరాలు స్వీకరించేందుకు కీ అబ్జర్వేషన్స్‌ వెరిఫికేషన్‌ కమిటీ నియమించామని చెప్పారు. జువాలజీ, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో టైపోగ్రాఫికల్‌ లోపం వలన రెండు ప్రశ్నలకు సంబంధించి ఆప్షన్లు మార్చామని, అలాగే.. మాల్‌ ప్రాక్టీస్‌కు సంబంధించి ఫలితాలు విడుదల చేయలేదన్నారు.

రాష్ట్రంలో రెగ్యులర్‌ ఇంటర్మిడియెట్‌లో ఉత్తీర్ణులై ఈఏపీ సెట్‌లో అర్హత సాధించిన వారందరికీ ఇంటర్‌ మార్కుల ఆధారంగా 25 శాతం వెయిటేజీ ఇచ్చి, ర్యాంకులు ప్రకటించామని వీసీ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఎన్‌టీయూకే ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ రవీంద్ర, కో కన్వీనర్‌ రాము, సుమతి, కో ఆరి్డనేటర్‌ సానబోయిన చంద్రశేఖర్, జయప్రసాద్, ఉషాదేవి, దిలీప్‌కుమార్‌ పాల్గొన్నారు.

ఇంజినీరింగ్‌లో రెండో ర్యాంకర్‌ భానుచరణ్‌రెడ్డి..
ఇంజినీరింగ్‌ విభాగంలో రెండో ర్యాంకు సాధించిన భానుచరణ్‌రెడ్డిది తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఓపెన్‌ కేటగిరీలో 51వ ర్యాంకు, జేఈఈ మెయిన్స్‌ ఓపెన్‌ కేటగిరిలో 158, జేఈఈ బీఆర్క్‌ ఓపెన్‌ కేటగిరిలో 54వ ర్యాంకు సాధించాడు. ఈయన తండ్రి రాయలసీమ జూనియర్‌ కాలేజి ప్రిన్సిపాల్‌ మాండవ్యపురం జయభారత్‌. ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌ తీసుకుని క్వాంటం కంప్యూటర్స్‌ను డెవలప్‌ చేయడమే తన లక్ష్యమని భానుచరణ్‌రెడ్డి చెప్పాడు.

ఇంజినీరింగ్‌లో పాలకొల్లు విద్యార్థికి మూడో ర్యాంకు
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన కోటివల్లి యశ్వంత్‌ సాత్విక్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో 3వ ర్యాంకు సాధించాడు. యశ్వంత్‌ సాత్విక్‌ గతంలో పాలిసెట్‌లో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకు, జేఈఈ మెయిన్స్‌ మొదటి సెషన్‌ ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో మొదటి స్థానం, జేఈఈ మెయిన్స్‌ రెండో సెషన్‌లో ఓపెన్‌ కేటగిరీలో 53వ ర్యాంకు, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో 3వ ర్యాంకు సాధించాడు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఓపెన్‌ కేటగిరీలో 113వ ర్యాంకు, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో 8వ ర్యాంకు సాధించాడు. యశ్వంత్‌ తండ్రి వెంకట సత్యనారాయణ పండ్ల వ్యాపారి. ఐఐటీ ముంబైలో కంప్యూటర్‌ సైన్స్‌ చదవాలనేది తన కోరికని యశ్వంత్‌ చెప్పాడు.

ఇంజినీరింగ్‌లో కందుకూరు విద్యార్థికి 10వ ర్యాంకు..
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన బద్రిరాజు వెంకట మణి ప్రీతమ్‌ ఏపీ ఈఏపీసెట్‌ (ఎంసెట్‌) ఫలితాలు ఇంజినీరింగ్‌ విభాగంలో 10వ ర్యాంకు సాధించాడు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 234వ ర్యాంకు, మెయిన్స్‌లో 129వ ర్యాంకు, తెలంగాణ ఎంసెట్‌లో 39వ ర్యాంకు సాధించిన ప్రీతమ్‌.. ఈఏపీసెట్‌లోనూ హవా కొనసాగించాడు. ప్రీతమ్‌ తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే.

అగ్రిఫార్మాలో హర్షవర్థన్‌కు ఫస్ట్‌ ర్యాంకు..
అగ్రి, ఫార్మా ఫలితాల్లో కృష్ణాజిల్లా పెనమలూరు మండలం కానూరుకు చెందిన రామాయణం వెంకట నాగసాయి హర్షవర్థన్‌కు రాష్ట్రస్థాయిలో ఫస్ట్‌ ర్యాంకు వచ్చింది. నంద్యాలకు చెందిన తండ్రి నాగసత్యనారాయణ, తల్లి హేమలలిత కొన్నేళ్లుగా కానూరులో నివసిస్తున్నారు. నాగసత్యనారాయణ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ట్రాన్స్‌పోర్టేషన్‌ గ్రూప్‌ స్టేట్‌ హెడ్‌గా పనిచేస్తున్నారు. నాగసాయి హర్షవర్థన్‌కు 149.5 మార్కులతో స్టేట్‌ ఫస్ట్‌ వచ్చాడు. తనకు మెడిసిన్‌ చదవాలని ఉందని వెంకట నాగసాయి హర్షవర్థన్‌ తెలిపారు. మెడిసిన్‌ చదవాలనే లక్ష్యంతో నిరంతరం శ్రమించానన్నారు.

అగ్రిఫార్మాలో మల్లేశ్‌కుమార్‌కు మూడో ర్యాంకు..
అగ్రి, ఫార్మా విభాగంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్ల గ్రామానికి చెందిన డేగల అకీరానంద వినయ్‌ మల్లేష్‌కుమార్‌ మూడో ర్యాంకు సాధించాడు. మల్లేష్‌ తండ్రి శివప్రసాద్‌ రైస్‌మిల్లు యజమాని కాగా తల్లి వెంకటలక్ష్మి గృహిణి. నీట్‌లో మంచి ర్యాంకు సాధించి కార్డియాలజిస్ట్‌గా సేవలు అందించడమే తన లక్ష్యమని మల్లేశ్‌ కుమార్‌ తెలిపాడు.

అగ్రి, ఫార్మా విభాగంలో ‘గూడెం’ విద్యార్థికి ఐదో ర్యాంకు..
ఆగ్రి, ఫార్మా విభాగంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన యలమోలు సత్య వెంకట్‌ ఐదో ర్యాంకు సాధించాడు. సత్యవెంకట్‌ తల్లిదండ్రులు డాక్టర్‌ రామకృష్ణ, డాక్టర్‌ సుచరిత ఇద్దరూ డాక్టర్లే. తల్లి, తండ్రి, సోదరి బాటలోనే వైద్యుడిగా చేయాలనేది తన సంకల్పమని సత్య వెంకట్‌ చెప్పాడు. మంచి వైద్యుడిగా సమాజంలో విశేష సేవలందించాలనేది తన లక్ష్యమని సత్య వెంకట్‌ చెప్పారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement