
సాక్షి, కృష్ణా: కుటుంబ కలహాల కారణంగా నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. వివాహం జరిగిన ఐదు నెలలకే తమ బిడ్డ చనిపోవడంతో వధువు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
వివరాల ప్రకారం.. ఉయ్యూరుకు చెందిన వర్రే శ్రీవిద్యతో అరుణ్ కుమార్ వివాహం జరిగింది. ఐదు నెలల క్రితమే ఘనంగా వీరి పెళ్లి వేడుక జరిగింది. శ్రీవిద్య(24) ఉయ్యూరులోని శ్రీ చైతన్య కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. అరుణ్ కుమార్ కలాపాములు గ్రామంలో విలేజ్ సర్వేయర్‌గా ఉన్నారు. అయితే, వీరికి వివాహం జరిగిన నాటి నుంచే అత్తరింట్లో కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ కారణంగా ఆమె.. ఆదివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఈ ఘటనపై సమాచారం అందడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు చెప్పారు. ఇక, వివాహం జరిగిన ఐదు నెలలకే ఇలా తమ కూతురు చనిపోవడంతో కుటుంబ సభ్యులు.. కన్నీటి పర్యంతమవుతున్నారు.