పేలుతున్నాయ్‌.. జాగ్రత్త

Cell Phone Blastings In Hands Special Story - Sakshi

సెల్‌ఫోన్‌ చార్జింగ్‌లో జాగ్రత్తలు తప్పనిసరి

నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ప్రమాదం

నేడు సెల్‌ఫోన్‌ నిత్యావసరవస్తువుగా మారిపోయింది. అది లేని జీవితాన్ని ఊహించుకోలేం. నిద్రించే సమయంలోనూ పక్కనే పెట్టుకుంటున్నారు. కుటుంబ సభ్యుల కంటే కూడా ఫోన్‌నే ఇష్టంగా చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మొబైల్‌ ఫోన్ల వాడకంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే అవి పేలి ప్రాణాలకే ప్రమాదం సంభవించే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు.

మదనపల్లె సిటీ:సెల్‌ఫోన్‌లో లిథియం అయాన్‌/లిథియం పాలిమర్‌ బ్యాటరీలు ఉంటాయి. ఇవి విద్యుత్‌తో చార్జ్‌ అవుతుంటాయి. ఫోన్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగినా.. బ్యాటరీలో లోపమున్నా.. సామర్థ్యానికి మించి ఎక్కువ చార్జింగ్‌ చేసినా అవి పేలిపోయే ప్రమాదం ఉంది. సెల్‌పోన్‌ లోపల సున్నితమైన భాగాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే సన్నని సర్క్యూట్లు ఉంటాయి. వాటిపై సన్నని ప్లాస్టిక్‌ తొడుగు ఉంటూ షార్ట్‌ సర్క్యూట్‌ కాకుండా కాపాడుతుంటుంది. ఫోన్‌ను అపరిమితంగా వాడినా, ఎక్కువ సేపు చార్జింగ్‌ పెట్టినా వేడెక్కి ప్లాస్టిక్‌ తొడుగు కరిగిపోతుంది. అప్పుడు సర్క్యూట్లు ఏదో ఓ సందర్భంలో కలిసిపోయి షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి ఫోన్‌ మండిపోయే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా రాత్రి వేళల్లో మొబైల్‌ ఫోన్లు చార్జింగ్‌ పెట్టి అలాగే నిద్రిస్తుంటారు. దీని వల్ల ఎక్కువ సేపు చార్జింగ్‌ అయి బ్యాటరీ సామర్థ్యం దెబ్బతినడంతో పాటు ఏదో ఒక రోజు పేలిపోయే ప్రమాదం ఉంది. సెల్‌ ఫోన్‌ చార్జింగ్‌లో ఉండగా కాల్‌ వస్తే అలాగే మాట్లాడడం కూడా పేలడానికి మరో కారణం.

సెల్, బ్యాటరీల వాడకంలో జాగ్రత్తలు
బ్యాటరీలో ఉండే ప్లస్, మైనస్‌లను ఒకదానికొకటి కలపరాదు.
పని చేయని బ్యాటరీలను మంటల్లో వేయరాదు. వేస్తే పేలుడు సంభవిస్తుంది.
బ్యాటరీలను రాళ్లతో గాని, ఇనుపు వస్తువులతో గాని చితక్కొట్టరాదు.
బ్యాటరీలను విప్పి వాటి లోపలి భాగాలను విడదీసే ప్రయత్నం చేయరాదు.
బ్యాటరీలను మంటల వద్ద, గ్యాస్‌ స్టవ్‌ల వద్ద, వేడి హీటర్ల వద్ద ఉంచరాదు.

సెల్‌ బ్యాటరీ ఆదా ఇలా
4జీ నెట్‌ వాడేటప్పుడు బ్యాటరీ వేగంగా ఖర్చు అవుతుంది. కాబట్టి అవసరాన్ని బట్టి మాత్రమే ఇంటర్‌నెట్‌ ఉపయోగించాలి. బ్యాక్‌ గ్రౌండ్‌లో రన్‌ అయ్యే అనవసరమైన అప్లికేషన్లను డిలీట్‌ చేస్తే బ్యాటరీ ఆదా చేయవచ్చు. సెల్‌ ఎక్కువగా ఉపయోగించే వారైతే పవర్‌ బ్యాంక్‌ ఉంచుకోవాలి.
అందులోనూ ఆటో కట్‌ ఆఫ్‌ ఉండే పవర్‌ బ్యాంక్‌ను మాత్రమే ఉపయోగించాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సెల్‌ ఫోను బ్యాటరీ లైఫ్‌ పెరుగుతుంది.
సెల్‌ ఫోన్‌ చార్జింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కంపెనీకి చెందిన ఒరిజనల్‌ చార్జర్లు, బ్యాటరీలు మాత్రమే వినియోగించాలి.
చాలా మంది రాత్రిపూట చార్జింగ్‌ పెట్టి నిద్రపోతుంటారు. ఎక్కువ సేపు చార్జింగ్‌ పెడితే బ్యాటరీ పనితీరు దెబ్బతినడమే కాకుండా పేలిపోయే ప్రమాదం ఉంది.
చార్జింగ్‌ సమయంలో సెల్‌ఫోన్‌ పరుపులపై మెత్తని వస్తువులపై ఉంచరాదు. లో ఓల్టేజి ఉన్నప్పుడు చార్జింగ్‌ పెట్టకుండా ఉండడమే మంచిది. చార్జింగ్‌లో ఉండగా ఇయర్‌ ఫోన్స్‌ వాడరాదు. అలాగే గేమ్స్‌ ఆడరాదు. ఫోన్లు వస్తే తీసివేసిన తర్వాత ఫోన్‌ మాట్లాడాలి.
బ్యాటరీ ఉబ్బినట్లు గమనిస్తే వెంటనే మార్చాలి. ఒకేసారి 0 నుంచి 100కి చార్జింగ్‌ చేస్తే బ్యాటరీపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చార్జింగ్‌ చేయాలి.
10 శాతం ఉండగానే చార్జింగ్‌ పెట్టడం మంచింది.
ఫోన్‌ పొరపాటున నీళ్లలో పడిపోతే వెంటనే చార్జింగ్‌ పెట్టకండి. బ్యాటరీని నేరుగా ఎండలో పెట్టరాదు. నీడలో ఆరబెట్టాలి. అప్పటికీ ఆరకపోతే ఒక పాత్రలో బియ్యం తీసుకుని, అందులో బ్యాటరీ లేదా సెల్‌ఫోన్‌ ఒక రాత్రి అంతా ఉంచాలి. బియ్యానికి తేమను పీల్చుకునే గుణం ఉంటుంది. తద్వారా బ్యాటరీలోని తేమ పోయి సెల్‌ఫోన్‌ యాథావిధిగా పని చేస్తుంది.
చార్జింగ్‌ చేసేటప్పుడు సెల్‌ ఫోన్‌ బ్యాక్‌ ప్యానెల్‌ తీసివేస్తే మంచిది. విరిగిన, వైర్‌ కట్‌ అయిన చార్జర్లు ఉపయోగించరాదు. చాలా మంది సెల్‌ఫోన్లకు భద్రత అంటూ కవర్లు తగిలిస్తారు. దీని వల్ల చార్జింగ్‌ సమయంలో సెల్‌ఫోన్‌ వేడెక్కుతూనే ఉంటుంది. ఫలితంగా బ్యాటరీ పాడవుతుంది.
కొన్ని ఫోన్లలో బ్యాటరీ ఒక్క రోజులో లేదా గంటల వ్యవధిలో అయిపోతుంది. ఇలాంటి సమయంలో బ్యాటరీలు మార్చుకోవాలి.

సెల్‌ఫోన్ల వాడకంలోజాగ్రత్తలు అవసరం
ప్రస్తుతం సమాజంలో సెల్‌ఫోన్ల వాడకం బా గా పెరిగింది. చిన్నారుల నుంచి వృద్ధుల వర కు అందరూ సెల్‌ఫోన్లు వాడుతున్నారు. గం టల తరబడి గేమ్స్‌ ఆడరాదు. ఫోన్‌ మాట్లాడరాదు. అలా చేయడం వల్ల వేడెక్కి పేలిపోతుంటాయి. రాత్రిళ్లు చార్జింగ్‌ పెట్టి నిద్రపోవడం మంచిది కాదు. సెల్‌ఫోన్‌ వినియోగదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రాణహాని నుంచి తప్పించుకోవచ్చు.
– దివాకర్, దివా సెల్‌ఫోన్, కంప్యూటర్‌ సర్వీస్‌ సెంటర్, మదనపల్లె

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top