ఎక్కడో ఏదో జరిగిందంటూ వ్యాపించే వదంతులను నమ్మవద్దని, పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ మో హన్‌రావు ప్రజలకు సూచించారు.
నిజామాబాద్ క్రైం, న్యూస్‌లైన్ :
ఎక్కడో ఏదో జరిగిందంటూ వ్యాపించే వదంతులను నమ్మవద్దని, పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ మో హన్‌రావు ప్రజలకు సూచించారు. ఇందుకు అన్ని వర్గాలవారూ సహకరించాలని కోరారు. వినాయక నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో శుక్రవా రం నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత నిజామాబాద్‌లోనే గణేశ్ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయన్న కీర్తి ఉందన్నారు. దీనిని నిలబెట్టుకోవాలని సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పండుగలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు.
గొడవలకు పాల్పడేవారిని ఇప్పటికే బైండోవర్ చేశామన్నారు. అనుమానాస్పద వ్యక్తులుగాని, వస్తువులు గాని కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. అనుమానితులపై నిఘా పెంచామన్నారు.
రోడ్ల మరమ్మతులు చేపట్టాం
నగరంలో అవసరమైన చోట రోడ్ల నిర్మా ణం, మరమ్మతులు చేపట్టామని కార్పొరేషన్ ఇన్‌చార్జి కమిషనర్ మంగతాయారు తెలిపారు. గణేశ్ మండళ్ల వద్ద, నిమజ్జన శోభాయాత్ర సాగే దారుల్లో చెత్త పడేయొద్దని ప్రజలకు సూచించారు. సంస్థలో పారిశుధ్య కార్మికుల కొరత ఉందని, ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
నిమజ్జనం కోసం స్థలం కేటాయించాలి
‘నగరంలోని ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. గణేశ్ నిమజ్జ నం కోసం నగర శివారు ప్రాంతంలో ప్రభు త్వ భూమిలోంచి కొంత స్థలాన్ని కేటాయిస్తే బాగుంటుంది’ అని శాంతికమిటీ సభ్యుడు, బోర్గాం ఉపసర్పంచ్ గంగారెడ్డి(చిరంజీవి) అధికారులకు సూచించారు. నగరంలోని గణేశ్ విగ్రహాలను వినాయక్‌నగర్ బావి, బోర్గాం వాగు, బాసరలోని గోదావరి నదిలో నిమజ్జనం చేస్తారు. నది లో విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల తాగునీరు కలుషితమవుతోందని పలువు రు సభ్యులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. పెద్ద విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు నగర శివారులోనే స్థలం కేటాయించాలని సూచించారు. సమావేశంలో నగర డీఎస్పీ అనిల్‌కుమార్, ఎస్‌హెచ్‌ఓ నర్సింగ్ యాదవ్, సీఐలు సైదులు, శ్రీశైలం, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌కుమార్, తహశీల్దార్ రాజేందర్ పాల్గొన్నారు.